Share News

మిల్లర్ల మాయాజాలం

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:27 AM

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని గొప్పలు చెబుతున్న జగన్‌ సర్కారు ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది.

మిల్లర్ల మాయాజాలం

ధాన్యాన్ని కల్లాల నుంచి రైసు మిల్లులకు తరలించడానికి సాధారణంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, లారీలు వంటి గూడ్స్‌ వెహికల్స్‌నే వినియోగిస్తారు. అంతే తప్ప మోటారు సైకిళ్లు, ఆటోలు, స్కూలు బస్సుల్లో కొన్ని లక్షల క్వింటాళ్ల ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడం సాధ్యమా?!.. తమది రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ సర్కారు రివర్స్‌ పాలనలో మోటారు సైకిళ్లపై కూడా వందలు, వేల టన్నుల ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించడం సుసాధ్యమేనని తేలింది!. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక స్కూల్‌ బస్సులో ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించారు!. ఈ జిల్లాతోపాటు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆటోల్లో ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇంకా విచిత్రమేమిటంటే.. గోదావరి జిల్లాలతోపాటు మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో మోటారు సైకిళ్ల మీద వందల క్వింటాళ్ల ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించారట. రాష్ట్ర రవాణాశాఖ అధికారుల విచారణలోనే ఈ నమ్మలేని నిజాలు వెలుగులోకి రావడం గమనార్హం. వైసీపీ జమానాలో వెలుగుచూసిన ఈ దందాలోని వింతలు.. విడ్డూరాలు చదవండి!.

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు

స్కూటర్లు, ఆటోలు, స్కూల్‌ బస్సుల్లో తరలించారట!

దొంగ ట్రక్‌ షీట్లతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

బయోమెట్రిక్‌, జీపీఎస్‌ నిబంధనలకు తూట్లు

లోతుగా దర్యాప్తు చేస్తే పెద్ద కుంభకోణమే!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని గొప్పలు చెబుతున్న జగన్‌ సర్కారు ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం వ్యాపారం మొత్తం రైసు మిల్లర్ల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో రైసు మిల్లులను నడుపుతున్నవారిలో వైసీపీకి చెందినవారే అధికం. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్‌లోనూ సొంత మనుషుల ద్వారా రూ. వేల కోట్లు ‘కప్పం’ కట్టించుకుంటూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అనధికారికంగా రైసు మిల్లర్లకే అప్పగించేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ, రెవెన్యూ శాఖ సహాయకులు మొదలు కొన్ని రాష్ట్రస్థాయిలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల వరకు అందరూ రైసు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిండా ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి ఈ ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణానికి తెరతీశారు.

73 శాతం ధాన్యం కొనుగోళ్లు ఆఫ్‌లైన్‌లోనే..

ఆన్‌లైన్‌ విధానంలో ధాన్యం సేకరిస్తున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. మిల్లర్లు, దళారుల చేతిలో దగా పడుతున్న రైతులకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేలు, ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా ధాన్యం విక్రయించే ప్రతి రైతు వేలిముద్రలను తీసుకోవాలని, రైతులు అమ్మిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించే వాహనాలకు జీపీఎస్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జీపీఎస్‌ పరికరాలను అమర్చిన వాహనాల్లోనే ధాన్యం రవాణా చేయాలని స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఎక్కడా చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. మిల్లర్లతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందాల మేరకు దొడ్డిదారిన ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. సీజన్‌ ప్రారంభంలో రెండు మూడు రోజులు వర్షాలు కురిసినా.. తర్వాత వర్షాలు ఆగిపోయాయి. అయినా సీజన్‌ మొత్తం ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతివ్వడం మిల్లర్లు, దళారుల దోపిడీకి అవకాశంగా మారింది.

దాంతో రైతులు పండించిన ధాన్యం మొత్తం దళారులు, మిల్లర్ల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం మాట నమ్మి ఆన్‌లైన్‌లో అమ్మిన రైతులకు సొమ్ము చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతుండటంతో మద్దతు ధర కోసం ఆశ పడకుండా ఈ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారులు ఇచ్చిన ధరలకే అమ్మేసుకున్నారు. పల్నాడు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం, కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కేవలం 27 శాతం మంది రైతులు మాత్రమే ఆన్‌లైన్‌లో బయోమెట్రిక్‌ ఆధారంగా తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోగా.. మిగిలిన 73 శాతం మంది రైతులు ఆఫ్‌లైన్‌లో దళారులు, మిల్లర్లు ఇచ్చినంత తీసుకుని తమ ధాన్యాన్ని అమ్ముకున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల ప్రకారం సాధారణ రకం ఽధాన్యం క్వింటాకు 2050 లు, 75 కేజీల బస్తాకు రూ. 1637 లు చొప్పున మద్దతు ధరలను రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆఫ్‌లైన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతివ్వడంతో దళారులు, మిల్లర్లు రైతులను నిండా ముంచేశారు. వివిఽధ ఖర్చుల పేరుతో రూ.300 నుంచి రూ.500 వరకు మినహాయించుకుని.. 75 కేజీల ధాన్యం బస్తాకు గరిష్ఠంగా రూ.1,300 మాత్రమే రైతులకు చెల్లించారు. వాస్తవానికి గన్నీలు, లేబర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా.. ఆ నిధులను వెంటనే విడుదల చేయకపోవడం వల్ల మిల్లర్లు ముందుగానే రైతుల నుంచి ఆ చార్జీలు వసూలు చేసుకున్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఘోరంగా నష్టపోయారు. ఇదంతా ఒకెత్తయితే.. తర్వాత మరో రకమైన దోపిడీకి మిల్లర్లు తెరతీశారు. రైతుల నుంచి ఆఫ్‌లైన్‌లో బస్తా రూ. 1300 చొప్పున కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమ మిల్లుల్లో నిల్వ చేసుకుని.. అదే ధాన్యాన్ని ఆన్‌లైన్‌ చేయించుకుంటూ ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకునే ప్రక్రియకు తెరతీశారు. అయితే నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో ధాన్యం అమ్మకానికి సంబంధిత రైతుల వేలిముద్రలు, ధాన్యాన్ని రవాణా చేసే వాహనాల రిజిస్టరు నంబర్లు తదితర వివరాలు నమోదు చేసి ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ-క్రాప్‌ యాప్‌లో తప్పుడు వివరాలు నమోదు చేయించి వారి పేరు మీద ఆన్‌లైన్‌లో వందల క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించినట్లుగా దొంగ లెక్కలు చూపిస్తున్నారు. ఆ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించినట్లుగా తప్పుడు రిజిస్టర్‌ నంబర్లు నమోదు చేయించారు. ఈ వాహనాల రిజిస్టరు నంబర్లు దొరకకపోవడంతో స్కూటర్లు, ఆటోలు, స్కూల్‌ బస్సుల రిజిస్టర్‌ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ నుంచి ఇప్పటికే రూ.వందల కోట్లు అక్రమంగా కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు పుష్కలంగా ఉండటంతో ఇప్పటికే లక్షల టన్నుల ధాన్యాన్ని ఆన్‌లైన్‌ చేయించుకుని వాటికి మద్దతు ధరతోపాటు జీఎల్‌టీ చార్జీలను కూడా రాబట్టుకున్నారని తెలుస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యాన్ని రవాణా చేసినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వాహనాల వివరాలను రవాణాశాఖ అధికారులు ర్యాండమ్‌గా చెక్‌ చేసినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ విచారణ జరిపించాలంటూ డీఎంలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని దర్యాప్తు సంస్థలతో లోతుగా విచారణ జరిపిస్తే భారీ కుంభకోణమే వెలుగులోకి వస్తుందని సివిల్‌ సప్లయిస్‌ వర్గాలే చెబుతున్నాయి.

Updated Date - Feb 25 , 2024 | 08:47 AM