Share News

చక్కబెట్టేశాక చట్టం!

ABN , Publish Date - May 30 , 2024 | 02:05 AM

కౌన్సెలింగ్‌ విధానాన్ని అవహేళన చేసి, అడ్డగోలుగా అక్రమ బదిలీలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బదిలీల కోసం ‘చట్టం’ అంటూ హడావుడి మొదలుపెట్టింది.

చక్కబెట్టేశాక చట్టం!

టీచర్ల బదిలీలకు చట్టంపై కసరత్తు

ఉపాధ్యాయ సంఘాల నుంచి సలహాలు

గత బదిలీల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు

50 కోట్లు వసూలుచేసిన సీనియర్‌ మంత్రి

అక్రమాల్లో అధికార వర్గాల ప్రమేయం

అంతా అయిపోయాక చట్టం పాట

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కౌన్సెలింగ్‌ విధానాన్ని అవహేళన చేసి, అడ్డగోలుగా అక్రమ బదిలీలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బదిలీల కోసం ‘చట్టం’ అంటూ హడావుడి మొదలుపెట్టింది. బదిలీలు సకాలంలో జరిగేలా, న్యాయ వివాదాలను అధిగమించేలా చట్టం తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీనికిగాను సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలను పాఠశాల విద్యాశాఖ కోరింది. ఈ కొత్త చట్టం వస్తే నిర్దేశిత సమయంలో బదిలీలు జరుగుతాయని చెబుతోంది. బదిలీలకు షెడ్యూలు ఇచ్చిన తర్వాత పలు అంశాలపై టీచర్లు కోర్టులకు వెళ్లడం, ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారింది. దీన్ని అధిగమించేందుకు చట్టం తెస్తామని వైసీపీ ప్రభుత్వం ఏడాది కిందట ప్రకటించింది. అయితే, ఆ చట్టం తెచ్చేలోగా అక్రమ మార్గాల్లో బదిలీలు కూడా చేసింది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఏకంగా 1200 మంది టీచర్లను కౌన్సెలింగ్‌ లేకుండా బదిలీ చేయడం వివాదంగా మారింది. గతంలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున సిఫారసు బదిలీలు చేయలేదు. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా చట్టం తెస్తే అందరినీ కౌన్సెలింగ్‌ విధానంలోనే బదిలీ చేయాలి. అప్పుడు నిజంగానే పారదర్శకత వస్తుంది. కానీ, అలాంటి పారదర్శక చట్టం తెస్తామంటున్న ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడింది. మొదట మహిళా టీచర్లకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వంలోని ఓ సీనియర్‌ మంత్రి సిఫారసు బదిలీలకు తెరతీశారు.

అక్రమాలను అడ్డుకోవాల్సిన ఆయనే ‘ఎంతిస్తారు’ అంటూ దుకాణం తెరిచారు. తన కార్యాలయం నుంచి సిఫారసు చేస్తే కోరుకున్న చోటకు బదిలీ అనే విధానాన్ని అమలుచేశారు. దీనిని అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా సహకరించారు. ఓ ఉన్నతాధికారి అయితే ఈ సిఫారసు బదిలీలకు ప్రత్యేకంగా అధికారులను కేటాయించి మరీ పూర్తిస్థాయి సహకారం అందించారు. దీనిలో సీనియర్‌ మంత్రికి అత్యధిక స్థాయిలో ముడుపులు అందాయనే ప్రచారం సాగింది. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా వసూళ్లు మొదలవడంతో అధికారులూ దీనిలో జోక్యం చేసుకున్నారు. సచివాలయంలోని ఓ అధికారి, పాఠశాల విద్యాశాఖలోని అధికారులు కూడా కొన్ని సిఫారసు బదిలీలు చేయించుకుని జేబులు నింపుకొన్నారు. మొత్తంగా సిఫారసు బదిలీలు అంటూ రూ.50 కోట్ల మేర వసూలు చేశారు. కావాల్సిన మేరకు జేబులు నిండాక ఇప్పుడు చట్టం అంటూ హడావుడి చేస్తున్నారు. నిజంగా బదిలీల్లో పారదర్శకత ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే అప్పుడే చట్టం ఎందుకు చేయలేదనేది ప్రశ్న.

తప్పేంటి: మంత్రి మాట

సీనియర్‌ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ విద్యాశాఖలో ఏవైనా అక్రమాలు, పొరపాట్లు జరుగుతుంటే సరిదిద్దాల్సిన స్థానంలో ఉన్నారు. కానీ స్వయంగా ఆయనే సిఫారసు బదిలీలు చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత ఏ స్థాయిలో ఉందనేదానికి బొత్స వ్యాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ. ఏడాది కిందట సిఫారసు బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అప్పటికే ఆ అక్రమాలను టీచర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై మంత్రి బొత్స అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాప్రతినిధులు కొన్ని సిఫారసు బదిలీలు చేసుకుంటే తప్పేంటి? ఈ మాత్రం చేసుకునే అధికారం కూడా లేదా? దీనిని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు’’ అంటూ బహిరంగంగానే అక్రమాలకు మద్దతు ప్రకటించారు. ఇక స్వయంగా విద్యాశాఖ మంత్రే తప్పు లేదని అనడంతో టీచర్ల బదిలీల్లో అక్రమాలకు గేట్లు తెరిచినట్లయింది. అప్పటి వరకు డబ్బులకు బదిలీలు జరుగుతాయో లేదోనని సందేహించిన కొందరు.. మంత్రి వ్యాఖ్యలతో నిర్భయంగా నేతలను ఆశ్రయించి అక్రమ దారిలో బదిలీలు చేయించుకున్నారు.

మాటల్లోనే పారదర్శకత

తమ ప్రభుత్వం అంటేనే పారదర్శకతకు మారుపేరంటూ గొప్పలు చెప్పే సీఎం జగన్‌, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కబుర్లకే పరిమితమయ్యారు. స్వయంగా సీఎం కార్యాలయం నుంచే మొదటి సిఫారసు బదిలీల జాబితా విడుదల కాగా సీఎంగానీ, విద్యాశాఖ మంత్రిగానీ దానిపై నోరు మెదపలేదు. అసలు ఇలా చేయొచ్చా? అని కూడా ఆలోచన చేయలేదు. జాబితాలు వచ్చిందే తడవుగా పాఠశాల విద్యాశాఖలో ఆమోదముద్రలు వేయించిన ఘనత విద్యాశాఖ మంత్రిగా బొత్సకు దక్కుతుంది. అక్రమ బదిలీలు తప్పు లేదని వంతపాడి మరీ వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో పెద్దఎత్తున దుమారం రేగినా సీఎం, విద్యాశాఖ మంత్రి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాగా, ఇప్పుడు చట్టం అంటూ కొత్త పాట పాడుతుండడం గమనార్హం.

Updated Date - May 30 , 2024 | 02:05 AM