పేర్ని నాని కేసులో విచారణ ముమ్మరం
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:34 AM
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ల నుంచి 387 టన్నుల పీడీఎస్ బియ్యం మాయం కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. జిల్లా పౌరసర ఫరాలశాఖ అధికారి కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కోటిరెడ్డిని పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే పేర్ని గోడౌన్‌ల మేనేజర్ మానస్‌తేజను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. టోల్‌గేట్ల వద్ద నమోదైన లారీల వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

పోలీస్ విచారణకు పౌరసరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ హాజరు
ఇప్పటికే పోలీసుల అదుపులో గోడౌన్ మేనేజర్ మానస్‌తేజ
టోల్ గేట్ల రికార్డుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ల నుంచి 387 టన్నుల పీడీఎస్ బియ్యం మాయం కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. జిల్లా పౌరసర ఫరాలశాఖ అధికారి కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కోటిరెడ్డిని పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే పేర్ని గోడౌన్‌ల మేనేజర్ మానస్‌తేజను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. టోల్‌గేట్ల వద్ద నమోదైన లారీల వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో పొట్లపాలెంలో ఉన్న బఫర్ గోడౌన్‌ను ప్రతి నెలా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేసి బియ్యం స్టాక్ మొత్తం ఉందా, నాణ్యత చెడిపోకుండా తీసుకుంటున్న చర్యలపై పౌరసరఫరాలశాఖ టెక్నికల్ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికపుడు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికలను పంపుతూ ఉండాలి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్‌గా కోటిరెడ్డి రెండేళ్లుగా పనిచేస్తున్నారు. పొట్లపాలెంలోని బఫర్ గోడౌన్‌లో తనిఖీలు సక్రమంగా చేశారా లేదా అనే అంశంపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు. తనిఖీ చేసిన సమయంలో రికార్డులలో నమోదు చేసిన లెక్కల వివరాలను పరిశీలిస్తున్నారు. బియ్యం మాయమైన ఘటన వెలుగులోకి రావడంతో కోటిరెడ్డి ఈ నెల 10వ తేదీన మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేపన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు గోడౌన్‌లను తనిఖీ చేసి, అందులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్‌లలోని రికార్డులు, గోడౌన్ ఆవరణలో ఉన్న వెయింగ్ మిషన్ రికార్డులను స్వాధీనం చేసుకుని, పూర్తిస్థాయి వివరాలు రాబట్టేపనిలో ఉన్నారు. ఈ క్రమంలో గతంలో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్లుగా పనిచేసిన అధికారుల నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరించారు. బియ్యం మాయం కేసులో ఏ-2గా ఉన్న గోడౌన్‌ల మేనేజర్ మానస్‌తేజను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గోడౌన్‌ల మేనేజర్ నోరు విప్పితేనే..
ఇప్పటికే ప్రత్యేక పోలీస్ బృందాలు పేర్ని నాని గోడౌన్ నుంచి బియ్యం లోడ్ చేసిన లారీలు ఎక్కడి వరకు ప్రయాణించాయనే అంశంపై టోల్ గేట్ల వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ విచారణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. గోడౌన్ మేనేజర్ మానస్‌తేజ వాస్తవాలు వెల్లడిస్తేనే ఈ కేసులో అసలు నిందితులు ఎవరు, తెరవెనుక ఉన్న పెద్ద మనుషులు, బియ్యం విక్రయాల్లో ఉన్న వ్యాపారులు, బియ్యం రవాణాకు సహకరించిన వారు ఎవరు, తదితర వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పేర్ని నానికి చెందిన గోడౌన్‌ల నుంచి బియ్యం మాయమైన ఘటనపై ప్రత్యేక పోలీస్ బృందాలు ప్రతి చిన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తుండటం గమనార్హం.
బియ్యం మాయం కేసులో నలుగురు అరెస్ట్
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో గోడౌన్ మేనేజర్ మానసతేజ, పౌరసరఫరాలశాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, పెడన మండలం నందిగామకు చెందిన మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, బంటుమిల్లి మండలం పెనుమల్లికి చెందిన లారీ డ్రైవర్ బోట్ల మంగారావును మచిలీపట్నం తాలూకా పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరికి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు.