Share News

రాష్ట్రానికే తలమానికం ‘నాసిన్‌’

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:42 AM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాసిన్‌(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.

రాష్ట్రానికే తలమానికం ‘నాసిన్‌’

టీడీపీ హయాంలో శంకుస్థాపన

మోదీ చేతుల మీదుగా ప్రారంభం

పుట్టపర్తి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాసిన్‌(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపంలో ఏర్పాటైన ఈ ప్రఖ్యాత శిక్షణా కేంద్రాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. పాలసముద్రం వద్ద ఏర్పాటైన నాసిన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా అభివృద్ధిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. జిల్లాను పారిశ్రామిక హబ్‌ చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాసిన్‌, భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ సముదాయాన్ని(బెల్‌) జిల్లాకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. వాటి ఏర్పాటుకు చకచకా భూములు కేటాయించారు. 2015, ఏప్రిల్‌ 11న అప్పటి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ నాసిన్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆరేళ్లపాటు పనులు నెమ్మదించాయి. గత రెండేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి.

తొలి అతిపెద్ద శిక్షణ అకాడమీ

దేశంలో మొట్టమొదటిసారిగా 1996లో హరియాణాలోని ఫరీదాబాద్‌లో 23 ఎకరాల్లో తొలి నాసిన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయంగా ఫరీదాబాద్‌ ఉండగా.. ఢిల్లీ, చెన్త్నె, కోల్‌కతా, ముంబైలో జోనల్‌ కేంద్రాలు ఉన్నాయి. పాలసముద్రం వద్ద 503.10 ఎకరాల్లో ఏర్పాటైన నాసిన్‌ దేశంలోనే రెండోదిగా నిలిచింది. విస్తీర్ణం పరంగా అతిపెద్దది. దక్షిణ భారతంలో తొలి అకాడమీగా నిలిచింది. ఇక్కడ యూపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఎంపికైన ఇండియన్‌ రెవెన్యూ సర్వీసె్‌స(ఐఆర్‌ఎస్‌) అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. పరోక్ష పన్నుల రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో జీఎస్జీ, కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్త్సెజ్‌, సేవాపన్నుల వసూలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, యాంటీ మనీల్యాండరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, మేధోసంపత్తి తదితరాలను బోధించనున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 02:42 AM