Share News

విద్యా కానుక అస్తవ్యస్తం

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:48 AM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక అస్తవ్యస్తంగా మారింది.

విద్యా కానుక అస్తవ్యస్తం

సకాలంలో సరఫరా చేయని కాంట్రాక్టర్లు

యూనిఫాంలు వచ్చింది 17 శాతమే

బ్యాగులు 39 శాతం, బూట్లు 32 శాతం

కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడంతో ఈ దుస్థితి

అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక అస్తవ్యస్తంగా మారింది. పాత కాంట్రాక్టర్లతో వైసీపీ పెద్దలు, పాఠశాల విద్యాశాఖ అధికారులు కుమ్మక్కు కావడంతో చివరికి సకాలంలో కిట్లు సరఫరాకాని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది టెండర్లు లేకుండానే గతేడాది కిట్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు అధికారులు అప్పనంగా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇలా కావాల్సిన కాంట్రాక్టర్లను ఎంపిక చేయడంతో సకాలంలో కిట్లు సరఫరా చేయడంలో వారు చేతులెత్తేశారు. 13న బడులు తెరిచే రోజునుంచే కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఒక్క వస్తువు కూడా నూరు శాతం రాష్ర్టానికి రాలేదు. బ్యాగులు కేవలం 39 శాతం, యూనిఫాం క్లాత్‌లు 17 శాతం, బెల్టులు 72 శాతం, బూట్లు 32 శాతం, ఒకటో తరగతి విద్యార్థులకు ఇచ్చే డిక్షనరీలు 5 శాతం, ఆరో తరగతి విద్యార్థులకు ఇచ్చే డిక్షనరీలు 80 శాతం, నోట్‌ పుస్తకాలు 82 శాతం వచ్చాయి. బుధవారం నుంచి ఈ వస్తువులన్నీ పాఠశాలలకు రవాణా కావాలి. ఇలా అరకొరగా కిట్లు రావడంతో ఏ పాఠశాలలకు పంపాలనే అంశంపై గందరగోళం ఏర్పడనుంది. అయితే ఇదంతా అస్మదీయ కాంట్రాక్టర్ల కారణంగానే అని స్పష్టమవుతోంది. ఈ ఏడాది రూ.630 కోట్లతో 36.5 లక్షల కిట్లు కొనుగోలు చేస్తున్నారు.

అంత పెద్ద కాంట్రాక్టును టెండర్లు లేకుండా నేరుగా అప్పగించేశారు. అయినా పాత బకాయిలు చెల్లించకపోతే కిట్లు ఇవ్వబోమని ఆ కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బెదిరించారు. తొలుత 50 శాతం బకాయిలు చెల్లించాలని కండిషన్‌ పెట్టడంతో సమగ్రశిక్ష అధికారులు రూ.300 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి మరో 40శాతం ఇవ్వకపోతే కిట్లు ఇవ్వబోమని కాంట్రాక్టర్లు మళ్లీ అడ్డం తిరిగారు. దీంతో మొత్తం 90 శాతం బకాయిలు చెల్లించేశారు. అయినా కూడా ఇప్పటికీ రాబోయే విద్యా సంవత్సరానికి కిట్లు సక్రమంగా సరఫరా చేయలేదు. అయితే కాంట్రాక్టర్లు బెదిరించడం ప్రభుత్వ పెద్దల ప్లాన్‌లో భాగమేనని తర్వాత అర్థమైంది. డబ్బులిస్తేనే కిట్లు సరఫరా చేస్తామని షరతు పెట్టాలని ప్రభుత్వంలోనే కొందరు వారికి సూచించారు. అలా రెండుసార్లు వారు కోరిన విధంగా డబ్బులు చెల్లించారు. తద్వారా ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారులకు కమీషన్లు దక్కాయి. అయితే ఇంత చేసినా ఇప్పుడు మళ్లీ మధ్యలో కిట్లు ఆపేయాలని కాంట్రాక్టర్లు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు సరఫరా చేస్తున్న కిట్లకు కూడా డబ్బులిస్తేనే మొత్తం సరఫరా పూర్తిచేస్తామని కాంట్రాక్టర్లు అంటున్నట్టు తెలిసింది. ప్రభుత్వం మారినందున కొత్త ప్రభుత్వం వైసీపీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేస్తుందేమోననే భయంతో ఇలా చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు అధికారులు చక్రం తిప్పారు. వారి నిర్వాకంతో విద్యా కానుక గందరగోళంగా మారింది.

విద్యాకానుక ఇకపై ‘స్టూడెంట్‌ కిట్‌’

పాఠశాల విద్యార్థులకు ఇచ్చే బ్యాగులు, బూట్లు, బెల్టులు, పుస్తకాల కిట్‌ పేరును పాఠశాల విద్యాశాఖ మార్చింది. ఇప్పటివరకూ జగనన్న విద్యా కానుక పేరుతో ఈ వస్తువులను విద్యార్థులకు అందిస్తున్నారు. ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పాటుకానందున ప్రస్తుతానికి స్టూడెంట్‌ కిట్‌గా పేరు మార్చింది. ఈ మేరకు స్టూడెంట్‌ కిట్ల పంపిణీపై సమగ్రశిక్ష ఎస్పీడీ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకూ విద్యాకానుక పేరుతో కిట్లు పంపిణీ చేసిన జగన్‌ ప్రభుత్వం రాజకీయ ప్రచారం చేసుకుంది. బ్యాగులు, బెల్టులు, నోట్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటోలు, పేర్లు వేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఇప్పుడు పంపిణీ చేయబోయే కిట్లపై ఎలాంటి పేర్లు ముద్రించలేదు.

Updated Date - Jun 12 , 2024 | 02:49 AM