Share News

శంకుస్థాపనలే... పనుల్లేవ్‌!

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:05 AM

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాజెక్టులు పడకేశాయి. సాక్షాత్తూ సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ఒక్క అడుగు ముందుకు పడటంలేదు.

శంకుస్థాపనలే... పనుల్లేవ్‌!

పశ్చిమలో రూ.3,200కోట్లతో ప్రాజెక్టులంటూ హడావుడి

2022 నవంబరులో శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

14 నెలలు అవుతున్నా అడుగు కూడా కదలని పనులు

బియ్యపు తిప్ప వద్ద అతీగతీ లేని హార్బర్‌ నిర్మాణం

నల్లీ క్రాక్‌ కాలువలో పూడికతీత పనుల ఊసే లేదు

రెగ్యులేటర్ల నిర్మాణానికి

అనుమతులివ్వని సర్కారు

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాజెక్టులు పడకేశాయి. సాక్షాత్తూ సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ఒక్క అడుగు ముందుకు పడటంలేదు. 2022 నవంబరులో మత్స్యకార దినోత్సవం రోజున నరసాపురం వచ్చిన ముఖ్యమంత్రి దాదాపు రూ.3,200కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటి వరకూ అందులో ఒక్క పనీ ప్రారంభించలేదు. సదరు ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం మాట అటుంచి... అసలు ప్రభుత్వమే వాటికి ఇప్పటికీ అనుమతులు మంజూరు చేయలేదు. నరసాపురం మండలం బియ్యపు తిప్ప వద్ద రూ.429.00 కోట్లతో హార్బర్‌ నిర్మాణం చేపడుతున్నట్టు నాటి సభలో సీఎం ప్రకటించారు. సభా వేదిక పైనుంచే పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఏజన్సీని ఖరారు చేశామని, హార్బర్‌ పూర్తయితే తీరప్రాంత రూపురేఖలు మారిపోతాయని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు చూస్తామంటూ గొప్పగా చెప్పారు. ఇది జరిగి దాదాపు 14నెలలు పూర్తయ్యాయి. ఇప్పటికీ బియ్యపు తిప్ప వద్ద ఒక్క పునాది రాయి కూడా పడలేదు. పనులు జరుగుతాయన్న ఆశాలేదు. మరోవైపు తీరప్రాంతంలో నల్లీ క్రీక్‌ కాలువ పూడుకుపోయింది. సముద్రం నుంచి నీరు ఎగదన్నే అదే కాలువలో మత్స్యకారులు చేపల వేట సాగించి జీవనోపాధి పొందేవారు. సదరు నల్లీ క్రీక్‌ పనులను టీడీపీ హయాంలో ప్రారంభించారు. 25శాతం పనులు పూర్తి కాలేదంటూ వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. ప్రస్తుతం నల్లీ క్రీక్‌ ఊసే లేదు.

రెగ్యులేటర్లంటూ జనం చెవిలో పూలు

కొల్లేరు మంచినీటి సరస్సు జలాలు సముద్రంలో కలిసే ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి నీటి పారుదల శాఖ ప్రతిపాదనలు చేసింది. తొలుత రూ.360కోట్లతో రెగ్యులేటర్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు స్పందించలేదు. అ తర్వాత అంచనాలను సవరించారు. కొత్త ధరలో 3 రెగ్యులేటర్ల విలువ రూ.420 కోట్లకు పెరిగింది. వీటిలో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిధిలోని మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్‌కు జగన్‌ శంకుస్థాపన చేశారు. రెగ్యులేటర్‌ ఆవశ్యకతను నరసాపురం సభలోనే ఆయన వివరించారు. రెగ్యులేటర్లు నిర్మిస్తే సముద్రపు నీరు కొల్లేటి సరస్సులోకి రాకుండా ఉంటుంది. పశ్చిమ డెల్టా ప్రాంతంలో లవణీయత తగ్గుముఖం పడుతుంది. రెగ్యులేటర్ల నిర్మాణం ఖాయంగా జరిగిపోతుందంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఆశలు రేకెత్తించారు. అయితే వాటి నిర్మాణం కోసం నీటి పారుదల శాఖ పంపిన సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికీ పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాల్సి ఉంది. కానీ సీఎం మాత్రం ముందుగానే శంకుస్థాపన చేసేశారు. ఇక ఉభయగోదావరి జిల్లాలను నరసాపురం మీదుగా కలిపే వశిష్ట వారధి నిర్మాణానికి జగన్‌ హామీ ఇచ్చారు. రూ.490 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. అయితే ఇప్పటికీ టెండర్లు తెరవకుండా వాయిదా వేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే లోపు టెండర్లు ఖరారు కాకపోతే ఇక ఇప్పట్లో పనులు ప్రారంభించే అవకాశమే ఉండదు.

సర్వేతో సరిపెట్టుకున్న వాటర్‌ గ్రిడ్‌

పశ్చిమగోదావరి జిల్లా గ్రామాలకు విజ్జేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి పైప్‌లైన్‌ ద్వారా అందించేందుకు రూ.1,400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.3,600 కోట్లతో పూర్వ పశ్చిమగోదావరి జిల్లాకు గోదావరి జలాలను నేరుగా అందించే ప్రాజెక్టును సిద్ధం చేశారు. వీసీపీ ప్రభుత్వంలో దాన్ని రూ.1,400 కోట్లకు కుదించారు. కొత్త పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రాజెక్టును పరిమితం చేశారు. దీనినుంచి పట్టణాలను మినహాయించారు. వాటర్‌ గ్రిడ్‌ పనులు కూడా ప్రారంభిస్తున్నట్టు నరసాపురం సభ నుంచే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికీ సర్వే పనులే పూర్తి కాలేదు. ప్రభుత్వానికి నివేదిక అందలేదు.

ఈ పనులకు మోక్షమెప్పుడు?

మొగల్తూరు మండలం రుస్తుంబాదలో రూ.133 కోట్లతో 220/132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు.

నరసాపురం పట్టణంలో రూ.149.00 కోట్లతో వాటర్‌ ప్రాజెక్ట్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైయినేజీ నిర్మిస్తామంటూ హడావుడిగా జీవో విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. టెండర్లు పిలవలేదు. వీటికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం విశేషం.

నరసాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయాన్ని రూ.332 కోట్లతో చేపట్టాల్సి ఉంది. సుమారు రూ.100 కోట్లతో తరగతి గదుల భవనాలు ప్రారంభించారు. పునాదులు వేశారు. నిధులు లేకపోవడంతో ఇప్పుడు ఈ పనులకు అతీగతీ లేకుండా పోయింది.

కోతకు గురైన ఏటిగట్టును రూ.35కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించారు. ఇప్పటికి రూ.15కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదే ఏటి గట్టు ఇటీవల మళ్లీ కోతకు గురైంది. పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడమే కారణమని విమర్శలున్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 03:05 AM