Share News

రేపే ఓటర్ల తుది జాబితా విడుదల

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:59 AM

కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం(ఈ నెల 22వ తేదీన) తుది ఓటర్ల జాబితా-2024ను విడుదల చేయనుంది.

రేపే ఓటర్ల తుది జాబితా విడుదల

పారదర్శకమా.. మళ్లీ తప్పులతడకేనా?

ఇప్పటికే ముసాయిదా జాబితాపై ఫిర్యాదుల వెల్లువ

ఢిల్లీకి వెళ్లి ఈసీకి ప్రతిపక్షాల మొర

ఆ అభ్యంతరాలన్నీ క్లియర్‌ అయ్యాయా?

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో ఉత్కంఠ

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం(ఈ నెల 22వ తేదీన) తుది ఓటర్ల జాబితా-2024ను విడుదల చేయనుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోనూ, ప్రతిపక్ష పార్టీల్లోను ఉత్కంఠ నెలకొంది. నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలంటూ సుమారు ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓటర్ల జాబితాల్లోని తప్పులను ఎత్తి చూపుతూ, అధికార పార్టీ అక్రమాలపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. ఆ పార్టీ నేతలు ఢిల్లీ దాకా వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. తుది ఓటర్ల జాబితా అయినా పారదర్శకంగా రూపొందేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అనేక సార్లు మోరపెట్టుకున్నారు. సోమవారం ఎన్నికల సంఘం రాష్ట్రంలోని తుది ఓటర్ల జాబితా-2024ను విడుదల చేయనుండగా, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతేడాది అక్టోబరులో ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా-2024 తప్పుల తడకగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తుది ఓటర్ల జాబితా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో నెలకొంది. జాబితా పారదర్శకంగా రూపొందిందా? మళ్లీ ముసాయిదా లాగానే అర్హుల ఓట్లు గల్లంతవుతాయా? అనర్హులు జాబితాలో ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదా జాబితాపై అధికార పార్టీ నాయకుల ప్రభావం పూర్తిగా పడింది. వలంటీర్ల ప్రభావం, కింది స్థాయిలో పలువురు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాయడంతో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లు, అర్హుల ఓట్లు ముసాయిదాలో కనుమరుగయ్యాయి. తటస్థుల ఓట్లకు ఎసరు పెట్టారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, వామపక్షపార్టీలు గగ్గోలుపెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదులు చేశాయి. డూప్లికేట్‌ ఓట్లు, దొంగ ఓట్లు, జీరో డోర్‌ నెంబర్లపై ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల వివరాలు తప్పులతడకలుగా నమోదయ్యాయి. కింది స్థాయిలో ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు అలక్ష్యంగా వ్యవహరించడం, అధికార పార్టీకి కొమ్ముకాయడంతో ముసాయిదా జాబితా విడుదల తర్వాత మళ్లీ ప్రజలు ఓటు నమోదుకు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓటు తొలగించబడిన వారు మళ్లీ ఫారం-6 దరఖాస్తులు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షపార్టీల ఓట్ల తొలగింపునకు కుప్పలు తెప్పలుగా నకిలీ ఫారం-7 పెట్టడంతో అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగించేశారు. అలాంటి వారు ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేశారు. ఓటు బదిలీకీ ఫారం-8లు కుప్పలు తెప్పలుగా పెట్టారు. వీటన్నింటినీ పరిష్కరించామని పదే పదే ఎన్నికల సంఘం చెబుతోంది. అసలు తాము పెట్టిన అభ్యంతరాలు ఏమయ్యాయెృూ? తుది జాబితాలో అయినా తమ పేరు ఉంటుందో లేదో? అని అర్హులైన ఓటర్లు బెంబేలెత్తిపోతున్నారు.

అభ్యంతరాలు, ఫిర్యాదులు క్లియరైనట్టేనా?

ముసాయిదా ఓటర్ల జాబితాపై ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించామంటూ ఎన్నికల సంఘం అధికారులు పదేపదే చెబుతున్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాలపై ఈసీ నుంచి సరైన సమాధానం రావడంలేదని, పూర్తిస్థాయిలో పరిష్కరమయ్యాయా? లేదా? అర్హుల ఓట్లు చేరాయా? దొంగ ఓట్లు తొలగించారా? తుది జాబితాలోనూ కొనసాగుతాయా? జీరో డోర్‌ నెంబర్లు, బల్క్‌ఫారం-7లు, అర్హుల ఓట్ల తొలగింపు తదితర అంశాలపై ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కరించి తుది జాబితా తప్పులు లేకుండా విడుదలవుతుందా? లేక ముసాయిదా జాబితాలో చోటుచేసుకున్న తప్పులే పునరావృతం అవుతాయా? అనే చర్చ నడుస్తోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించడంలేదని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 8 జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ చర్చలు తీసుకుందో? లేదో? బహిర్గతం కాలేదు. అసలు విచారణ చేసిందో? లేదో కూడా తెలియని పరిస్థితి. జనసేన, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలిపి, అవి తుది ఓటర్ల జాబితాలో లేకుండా చూడాలని కోరాయి. ఆ ఫిర్యాదులన్నీ ఈసీ పరిష్కరించిందా? అభ్యంతరాలన్నీ క్లియర్‌ అయ్యాయా? తుది ఓటర్ల జాబితా-2024 పారదర్శకంగా ఉంటుందా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Updated Date - Jan 21 , 2024 | 10:16 AM