Share News

YSRCP: తేలని భవిత.. తలల పట్టుకుంటున్న మంత్రులు!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:08 AM

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రుల భవిత ఇంకా తేలలేదు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

YSRCP: తేలని భవిత.. తలల పట్టుకుంటున్న మంత్రులు!

  • అభ్యర్థులను ఖరారు చేయకుండా ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రుల భవిత ఇంకా తేలలేదు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, ఆర్కే రోజా, పినిపె విశ్వరూప్‌, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, పీడిక రాజన్నదొర అభ్యర్థిత్వాలను ఇంకా జగన్‌ ఖరారు చేయలేదు. గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా ప్రకటించినా ఆయన అందుకు సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. సర్వే నివేదికల ఆధారంగా అసెంబ్లీ ఇన్‌చార్జీలను ప్రకటిస్తానని సీఎం జగన్‌ పదే పదే చెబుతూ వస్తున్నారు.

ఇప్పటికే మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్‌, ఉషశ్రీ చరణ్‌, జోగి రమేశ్‌లకు సిట్టింగ్‌ స్థానాల్లో కాకుండా కొత్త నియోజకవర్గాలకు బదిలీ చేశారు. దీంతో ఈ మంత్రులకు తాము పోటీ చేస్తామన్న విశ్వాసం కలిగింది. కాని మిగిలిన మంత్రుల విషయంలో టికెట్లను ఖరారు చేయకపోడంతో వారిలో ఆందోళన కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ విషయం ఎటూ తేలలేదు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఈసారి సీటు దక్కుతుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఇక కీలక మంత్రులు గోవర్ధన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పీడిక రాజన్న దొర వంటి వారి విషయంలోనూ వైసీపీ అధినేత ఎటూ తేల్చలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకూ సీటు వస్తుందో లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు సీటు సందేహాస్పదంగా మారింది.

Updated Date - Feb 02 , 2024 | 10:17 AM