Share News

ప్రయోగం ఫలించలే!!

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:08 AM

వైసీపీ అధినేత జగన్‌.. తాజా ఎన్నికల్లో చేసిన ఏ ప్రయోగం కూడా ఫలించలేదు. ప్రజలు ఆయా ప్రయోగాలను పాతాళానికి తొక్కేశారు.

ప్రయోగం ఫలించలే!!

వైసీపీ అధినేత జగన్‌.. తాజా ఎన్నికల్లో చేసిన ఏ ప్రయోగం కూడా ఫలించలేదు. ప్రజలు ఆయా ప్రయోగాలను పాతాళానికి తొక్కేశారు. మంత్రులుగా ఉన్న వారిని వేర్వేరు నియోజకవర్గాలకు మార్చడం.. వేరే వారికి అవకాశం ఇవ్వడం వంటి ప్రయోగాలు చేశారు. ఉదాహరణకు చిలకలూరి పేట నుంచి 2019లో విజయం దక్కించుకున్న విడదల రజనీకి తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌ సీటు కేటాయించారు. ఇక్కడ ఆమె ఓడిపోయారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి 2019లో విజయం సాధించిన బూడి ముత్యాలనాయుడును ఈసారి అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి నిలిపారు. ఆయన స్థానంలో కుమార్తె అనురాధకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రయోగం కూడా వికటించింది. ఇద్దరూ ఓడిపోయారు. ఇలా.. నియోజకవర్గాల మార్పుల నుంచి వారసుల వరకు అనేక మందిపై జగన్‌ ప్రయోగాలు చేశారు. కానీ, వీటన్నింటినీ ఓటర్లు తిప్పికొట్టారు.

పార్టీ మారి వీరు గెలిచారు.. వీరు ఓడారు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు ఘన విజయం సాధిస్తే.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు ఘోర ఓటమిని చవిచూశారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోనేటి ఆదిమూలం, వసంత కృష్ణ ప్రసాద్‌, వేమిరెడ్డి ప్రశాంతిలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అలాగే, వైసీపీ నుంచి టీడీపీలో ఎంపీలుగా బరిలో నిలిచిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపొందారు. అదేవిధంగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు వెంకటేశ్‌ను చీరాల అసెంబ్లీ నుంచి రంగంలోకి దింపారు. వెంకటేశ్‌ కూడా ఓడిపోయారు.

Updated Date - Jun 05 , 2024 | 07:28 AM