Share News

రవాణాలో ఏటీఎ్‌సలకు బ్రేకులు

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:00 AM

రవాణా శాఖలో ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎ్‌స)ల ఏర్పాటు గందరగోళానికి దారితీసింది.

రవాణాలో ఏటీఎ్‌సలకు బ్రేకులు

ఎంవీఐ లేకుండా ఏకపక్షంగా ప్రైవేటుకు నో

వైసీపీ నేతల అనుచరుల దోపిడీకి అడ్డుకట్ట

రెండేళ్ల ఆదాయం మొత్తం తీసుకునేందుకు అనుమతి లేదు

అనంతపురం, నంద్యాల ఏటీఎ్‌సలు నిలిపేసిన రవాణాశాఖ

ఇప్పుడు ఆపేస్తే ఎలా.. కోర్టుకు వెళతాం: ఏటీఎస్‌ కాంట్రాక్టర్లు

ఆర్థిక శాఖ ఆమోదం తర్వాతే అమలు: కాంతిలాల్‌ దండే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రవాణా శాఖలో ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎ్‌స)ల ఏర్పాటు గందరగోళానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కమిషనరేట్‌ నుంచి ప్రయత్నాలు జరుగుతుంటే.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుమ్మక్కై ప్రభుత్వ సొమ్ము దోచుకోవడానికి చేసుకున్న విధానాన్ని ఆమోదిస్తారా..? అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన.. వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బంధువులు అనేక లొసుగులతో దోపిడీకి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండేకు సూచించారు. దీంతో ఆయన ఫిర్యాదుల ఆధారంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాటికి సమాధానాలు చెప్పాలని కోరుతూ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హాకు అంతర్గత మెమో జారీ చేశారు. కమిషనర్‌ ఈ నెల 10 వరకూ సెలవులో ఉండటంతో ఏటీఎ్‌సల ఏర్పాటుకు తాత్కాలిక బ్రేకులు వేస్తూ కాంతిలాల్‌ దండే ఆదేశాలిచ్చారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాతే ఏటీఎ్‌సల ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఏటీఎ్‌సలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


టెండరు నిబంధనలు మార్చినట్టు ఫిర్యాదు

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం వాహన ఫిట్‌నెస్‌ ఒక ప్రధాన కారణమని గుర్తించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆటోమేటిక్‌ ఫిట్‌నెస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రైవేటు వ్యక్తులకైనా వాటిని అప్పగించవచ్చని సూచించింది. దీంతో ఏపీలో ఏటీఎ్‌సలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు వైసీపీ ప్రభుత్వం ఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభించింది. ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు వేయగా... వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బంధువులు ఏడు కేంద్రాలను దక్కించుకున్నారని ఇటీవల రవాణా మంత్రికి ఫిర్యాదులు అందాయి. మిగతా వాటిని కూడా ఈ ఏడాది అక్టోబరు 31లోపు ఏర్పాటు చేయాలని కేంద్రం గడువు విధించడంతో కూటమి సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనలకు విరుద్ధంగా... రెండేళ్ల పాటు టెస్టింగ్‌ ఫీజుతోపాటు సర్టిఫికెట్‌ ఫీజుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఏటీఎస్‌ నిర్వాహకులకే ఇచ్చేలా టెండరు నిబంధనలు మార్చారని మంత్రి దృష్టికి వచ్చింది.

దీంతో ఆయన అధికారులతో సమీక్షించారు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) ప్రతిదీ తనిఖీ చేశాకే ఫిట్‌నె్‌సకు అనుమతిస్తారని, దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తప్పులు ఎక్కువ జరుగుతాయని అధికారులు తెలిపారు. గుజరాత్‌లో 5వేల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు నకిలీవని తేలాయని గుర్తు చేశారు. తెలంగాణ, కేరళలో సొంతంగా ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తున్నాయని, ఏపీలోనూ అదే పద్ధతి కొనసాగిస్తే బాగుంటుందని చెప్పారు. సమ్మతించిన మంత్రి.. నాన్‌ ఆటోమేటిక్‌ పరిశీలనకు ఎంవీఐలను ఏటీఎ్‌సల్లో నియమించాలని, పూర్తిగా ప్రైవేటు పెత్తనాన్ని ఒప్పుకోవద్దని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి చెప్పారు. అదే సమయంలో రెండేళ్ల పాటు మొత్తం ఆదాయం తీసుకునే నిబంధన కూడా మార్చాలని, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇప్పటికే మొదలైన అనంతపురం, నంద్యాల ఏటీఎ్‌సలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం నుంచి ఆ రెండు ఏటీఎ్‌సలు ఆగిపోయాయి. ఎంవీఐలు పాత పద్ధతిలోనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో రవాణా శాఖ రివర్స్‌లో వెళుతుందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే.. తాము ఏటీఎ్‌సలను వద్దనడం లేదని, ఆర్థిక శాఖ ఆమోదం, అనుమానాల నివృత్తి తర్వాత వాటిని ఆమోదిస్తామని కాంతిలాల్‌ దండే చెబుతున్నారు.


ఇదేమి నిర్ణయం.. కోర్టుకెళతాం

ఈ చర్యతో ఏటీఎస్‌ కేంద్రాలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎ్‌సలను ఏర్పాటు చేయాలంటే ఒక్కో చోట మూడు, నాలుగు కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం రూపాయి ఇవ్వదు గనుక రెండేళ్ల పాటు ఫిట్‌నెస్‌ ఫీజు మొత్తం తీసుకునేలా గత ప్రభుత్వం టెండరు షరతుల్లో పేర్కొందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల తగ్గింపునకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా టెక్నాలజీ వైపు వెళ్తుంటే ఏపీలో అందుకు భిన్నంగా రివర్స్‌లో వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంపై కోర్టుకు వెళతామని చెబుతున్నారు.

అడ్డగోలు దోపిడీకి బ్రేకులు..: రవాణా శాఖ

ఇప్పుడు ఒక ఆటోకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) చేస్తే ఎంత..? ఏటీఎస్‌ ద్వారా అదనంగా తీసుకునేది ఎంత..? భారీ వాహనానికి మాన్యువల్‌గా తీసుకునే ఫీజుకన్నా ఆటోమేటిక్‌ ద్వారా తీసుకునే అదనం ఎంత..? ఇలా ప్రతిదీ లెక్కించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోల్పోయే ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకుంటామని రవాణా మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు ప్రభుత్వ ఖజానాకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు ఎలా సహకరిస్తామని ప్రశ్నిస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ముందుకెళ్తామని తెలిపింది.

Updated Date - Nov 08 , 2024 | 06:41 AM