Share News

రైతుకు సాయంలో తేడా గమనించాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:59 AM

రాష్ట్రంలో రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా వారికి గత 57 నెలల్లో మంచి కార్యక్రమాలు చేశామని సీఎం జగన్‌ అన్నారు. రైతుకు సాయం విషయంలో

రైతుకు సాయంలో తేడా గమనించాలి

57 నెలల్లో మంచి చేశాం: సీఎం జగన్‌

రైతు భరోసా, వడ్డీ రాయితీ విడుదల

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా వారికి గత 57 నెలల్లో మంచి కార్యక్రమాలు చేశామని సీఎం జగన్‌ అన్నారు. రైతుకు సాయం విషయంలో గతానికి, ఇప్పటికీ తేడాను గమనించాలని కోరారు. ‘రైతు భరోసా-పీఎం కిసాన్‌’ పథకం మూడో విడత నిధులను బుధవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.1,078 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. అలాగే 2021-22 రబీ, 2022-23 ఖరీఫ్‌ సీజన్లలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న 10.78 లక్షల మంది రైతులకు వడ్డీ రాయితీ నిధులు రూ.217 కోట్లు కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘వ్యవసాయం సుసంపన్నం - రాష్ట్రానికి సౌభాగ్యం’ పేరుతో వ్యవసాయశాఖ రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘రైతుభరోసా కింద ఐదేళ్లలో ఒక్కొక్క రైతుకు రూ.67,500 ఇచ్చాం. రైతుభరోసా సాయంతో 50% మంది రైతులకు మేలు జరిగింది. వీళ్లు వేసే 80% పంటలకు 80% ఖర్చు కింద ఈ పెట్టుబడి సాయం ఉపయోగపడుతుంది.

రుణాలు తీసుకున్న రైతులు వడ్డీతో సహా కట్టిన వెంటనే సున్నావడ్డీ రూపంలో వెనక్కి ఇచ్చేస్తూ, ప్రతి రైతునూ ప్రోత్సహిస్తున్నాం. 19 లక్షల మంది రైతులకు 9గంటలు పగటి పూటే నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఆర్బీకేలు పెట్టి ప్రతి ఎకరాను ఈ-క్రాప్‌ చేయించి, అన్ని పంటలకు బీమా ప్రీమియం కడుతున్నాం. కేంద్రం నోటిఫై చేయని పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించి, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయిస్తున్నాం. సమగ్ర భూ సర్వే చేపట్టి, భూ రికార్డులను అప్‌డేట్‌ చేసి, రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను గ్రామ సచివాలయాల పరిధిలోకి తెచ్చాం’’ అని తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 08:27 AM