Share News

నేటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:44 AM

ఎన్నికల పర్వంలో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు గురువారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. దీంతో... నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. దీనికోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

నేటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల పర్వం

రాష్ట్రంలో నేటి నుంచే నామినేషన్ల పర్వం

అభ్యర్థుల జాబితాలతో ఇరుపక్షాలూ రెడీ

ఎన్నికల పర్వంలో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు గురువారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. దీంతో... నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. దీనికోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి... ఇటు వైసీపీ! ‘నేను సైతం’ అంటూ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్‌! పోటాపోటీకి సై అంటున్నాయి. ప్రధాన పక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల దాఖలుతో ఈ వేడి మరింత పెరగనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ... ఈనెల 25. ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఏ నియోజక వర్గంలో ఎవరి మధ్య పోటీ అన్నది స్పష్టంగా తేలిపోతుంది. 2019లో ఏపీలో తొలివిడతలోనే పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈసారి... నాలుగో విడతలో జరుగుతుండటంతో అభ్యర్థులకు సుదీర్ఘ కాలం ప్రచారం తప్పడంలేదు.

అమరావతి/ఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగోదశలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నుంచి ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగియనుంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా బుధవారం తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు వేయాలన్నారు. ఒక్కో అభ్యర్థి 4సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్థి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థి వెంట మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను రికార్డు చేస్తామని, దీనికిగాను నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్థులు ప్రవేశించే మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

నామినేషన్లు-జాగ్రత్తలు

అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.

పార్లమెంటుకు పోటీ చేసే వారు ఫాం2-ఏ, అసెంబ్లీకి పోటీ చేసే వారు ఫాం2-బీలో దరఖాస్తు చేయాలి.

నేటి నుంచి 25 మధ్యాహ్నం 3 వరకే స్వీకరణ ప్రక్రియ.

పబ్లిక్‌ సెలవుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు.

నామినేషన్లను ఆర్‌వోకుగానీ, ఏఆర్‌వోకుగానీ సమర్పించాలి.

అభ్యర్థి నామినేషన్‌తోపాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.

ఫాం-26 స్టాంప్‌ పేపర్‌ విలువ రూ.10 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. భౌతికంగా స్టాంప్‌ పేపర్‌ అందుబాటులో లేకుంటే ఈ-స్టాంప్‌ కూడా ఉపయోగించవచ్చు.

అభ్యర్థి నామినేషన్‌ వేసిన నాటి నుంచి, ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.

పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు.

తెలంగాణలో కూడా..

గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో దశ ఎన్నికల ప్రక్రియలో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం(ఉప ఎన్నిక) ఉన్నాయి. అదేవిధంగా బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 8, జమ్మూకాశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఈ దశలో పోలింగ్‌ జరగనుంది.

Updated Date - Apr 18 , 2024 | 03:44 AM