ఓటు కోసం పోటెత్తుతున్న జనం
ABN , Publish Date - May 12 , 2024 | 03:44 AM
తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వచ్చేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసీని కోరారు.

అదనపు బస్సులు వేయండి.. ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ
అమరావతి(ఆంధ్రజ్యోతి), విజయవాడ, మే 11: తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వచ్చేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసీని కోరారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ ఎండీకి ఆయన లేఖ రాశారు. ‘ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీలో ఓటు వేసేందుకు ప్రయాణమయ్యారు. అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక బస్టాండ్లలో నిరీక్షిస్తున్నారు. ఈ నాలుగు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి, ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ప్రజా రవాణా సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
స్పందించిన ద్వారకా తిరుమలరావు
చంద్రబాబు లేఖపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సానుకూలంగా స్పందించారు. ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు శనివారమే ప్రకటించారు. ‘ఈ నెల 8 నుంచి 12 వరకు హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ 339 బస్సులు నడుపుతున్నాం. వీటికి అదనంగా ఆదివారం మరో 302 సర్వీసులు, సోమవారం మరో 206 ప్రత్యేక బస్సులు నడుపుతాం. బెంగుళూరు నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకూ ప్రత్యేక బస్సులు నడుపుతాం. ఇందుకు అదనపు చార్జీలు ఏవీ వసూలు చేయడం లేద’ని ఎండీ తెలిపారు.