Share News

అమ్మ ఒడి ఖర్చుకంటే.. కరెంటు బాదుడే ఎక్కువ

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:04 AM

అమ్మ ఒడి పథకం కింద ఇచ్చినదాని కంటే కరెంటు చార్జీలు పెంచి అదనంగా ప్రజల నుంచి పిండింది ఎక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

అమ్మ ఒడి ఖర్చుకంటే.. కరెంటు బాదుడే ఎక్కువ

అమ్మ ఒడి ఖర్చు 26 వేల కోట్లు

పెంచిన కరెంటు చార్జీలతో అదనంగా పిండింది 27 వేల కోట్లు: పట్టాభి

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): అమ్మ ఒడి పథకం కింద ఇచ్చినదాని కంటే కరెంటు చార్జీలు పెంచి అదనంగా ప్రజల నుంచి పిండింది ఎక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన పథకం అమ్మ ఒడి ఒక్కటేనని, దానికి అయిన ఖర్చును కూడా ప్రజల నుంచే పిండారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో అమ్మ ఒడి పథకం కింద రూ.26 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇదే ఐదేళ్లలో కరెంటు చార్జీలను పెంచి ప్రజల నుంచి అదనంగా రూ.27,500 కోట్లు వసూలు చేసింది. ఒక్క కొత్త పథకం అమలు చేయడానికి ఇంత ఘోరంగా చార్జీలు పెంచారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కరెంటు చార్జీలు పెంచడంతోపాటు చెత్త పన్ను, డ్రైనేజి పన్ను, మరుగు దొడ్డి పన్ను, ఆస్తి పన్నులను కూడా పెంచారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బాదనంత స్థాయిలో జగన్‌ ప్రజలను బాదారు. ఈ పిండుడుపై టీడీపీ ప్రత్యేకంగా ‘బాదుడే బాదుడు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఒక కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. జగన్‌రెడ్డి విద్యుత్‌ చార్జీల బాదుడు తట్టుకోలేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయాయి. ఈ బాదుడు కాక విపరీతంగా అప్పులు తెచ్చారు. రాష్ట్రం అప్పులను ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేర్చారు. ఇన్ని అప్పులు తెచ్చి ఏం చేశారో తెలియదు. కనీసం రోడ్లు బాగుచేసే దిక్కు కూడా లేదు’ అని పట్టాభి విమర్శించారు. కార్పొరేషన్ల పేరుతో రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చి వాటిని తిరిగి తీర్చలేక రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు. చార్జీల పెంపుతో ప్రజలకు షాక్‌ మీద షాక్‌ ఇస్తున్న జగన్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు దిమ్మ తిరిగే షాక్‌ ఇవ్వడం ఖాయమని పట్టాభి హెచ్చరించారు.

Updated Date - Apr 03 , 2024 | 04:04 AM