Share News

‘ఓట్ల పట్టుచీరలు’పై కలెక్టర్‌ సీరియస్‌

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:42 PM

ఓటర్లను ప్రలోభ పరుచుకునేం దుకు పీలేరు వైసీపీ నాయకులు తలపెట్టిన చీరల పంపిణీ వ్యవహారంపై కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది.

‘ఓట్ల పట్టుచీరలు’పై కలెక్టర్‌ సీరియస్‌

విచారించి నివేదిక అందించాలని పీలేరు అధికారులకు ఆదేశాలు

వలంటీర్ల ప్రమేయంపై దృష్టి సారించాలని సూచన

పీలేరు, మార్చి 1: ఓటర్లను ప్రలోభ పరుచుకునేం దుకు పీలేరు వైసీపీ నాయకులు తలపెట్టిన చీరల పంపిణీ వ్యవహారంపై కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఆ తంతుపై విచార ణ జరిపి తనకు వెంటనే నివేదిక అందించాలని పీలేరు రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమా చారం. కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక ఆర్‌ఐ, వీఆర్వోలు శుక్రవారం పీలేరు పట్టణంలోని పలు వార్డుల్లో పర్య టించి విచారణ ప్రారంభించారు. ఎన్నికల నగారా మోగక ముందే పీలేరు వైసీపీ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు గురువారం నుంచి తాయిలాల పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. ‘ఓట్ల పట్టుచీరలు’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో శుక్రవారం కథనం వెలువడిన విషయం పాఠకులకు తెలి సిందే. పీలేరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభో త్సవం కోసం తాను పీలేరులో ఉన్నప్పుడే చీరల పంపిణీ జరిగిందన్న విషయం తెలుసుకుని కలెక్టర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఆంధ్రజ్యోతిలో వచ్చిన విధంగా పీలేరు పట్టణంలో ఎక్కడెక్కడ చీరల పంపిణీ జరిగిందో సవివరంగా విచారించి తనకు నివేదిక అందజేయాలని శుక్రవారం మధ్యాహ్నం తహసీల్దారు మహబూబ్‌బాషాను ఆదేశించినట్లు సమాచారం. చీరల పంపిణీలో వలంటీర్ల ప్రమేయం ఉన్నదా, పంపిణీలో వారు పాల్గొన్నారా, పాల్గొని ఉంటే ఎవరెవరు, ఎక్కడెక్కడ పాల్గొన్నారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తనకు తెలియజేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు మహబూబ్‌ బాషా, ఆర్‌ఐ చాణక్య నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసి శుక్రవారం పీలేరు పట్టణంలో సమగ్రంగా విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

వలంటీర్లలో టెన్షన్‌.. టెన్షన్‌..

చీరల పంపిణీపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించిన సంగతి బహిర్గతం కావడంతో పీలేరు పట్టణంలోని పలువురు వలంటీర్లలో టెన్షన్‌ మొదలైంది. చీరల పంపిణీలో ఆయా ప్రాంతాల్లోని వలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. వలంటీర్ల ద్వారానే వైసీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి చీరలు అందజేశారు. కొంత మంది వలంటీర్లు ఒక అడుగు ముందుకు వేసి తాము తమ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రారంభించామని, పూర్తి చేశామని తమ వ్యాట్సప్‌లలో స్టేటస్‌లు కూడా పెట్టుకున్నారు. వారందరూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాటిని తొలగించినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్‌ అమలులో లేనందువల్ల తమకేమీ కాదని ధైర్యంగా ఉన్న వారు, కలెక్టర్‌ సీరియస్‌ కావడంతో ఖంగుతిన్నారు. అయితే పీలేరు పట్టణంలో చీరల పంపిణీ కార్యక్రమం రెండవ రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. ఎవరేమనుకున్నా తమకు పట్టదన్నట్లు వైసీపీ శ్రేణులు తమ ప్రాంతాల్లో చీరల పంపిణీని కొనసాగించారు.

Updated Date - Mar 01 , 2024 | 11:42 PM