Share News

‘కోడ్‌’ కలవరం

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:20 AM

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు అధికారులకు కత్తి మీద సాములా మారింది.

‘కోడ్‌’ కలవరం
చిక్కీలపై ఉన్న జగనన్న ఫొటో, జగన్‌ ముఖచిత్రంతో ముద్రించిన సంచిలు

అధికారులకు తలనొప్పి తెచ్చిన

జగన్‌ ప్రచార ఆర్భాటం

విద్యార్థులకు చిక్కీల పంపిణీపై సందిగ్థత

ఆదోని, మార్చి 20 : ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు అధికారులకు కత్తి మీద సాములా మారింది. సాధారణంగా నేతల విగ్రహాలకు ముసుగు వేయడం, కార్యక్రమాల్లో నాయకుల ఫొఫటోలు తొలగించడం, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలు కనిపించకుండా చేయడం, బ్యానర్లు తొలగించడం వంటి పనులతో సతమతమవుతన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం చేసిన పనులు ప్రస్తుతం వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే చిక్కీల కవర్లు, ఇతర ఉపకరణాల అన్నింటిపై ముఖ్యమంత్రి జగన్‌ పేరు, ఫొటోలు ఉన్నాయి. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నియమావళి అమలులో భాగంగా గడువులోపు అన్నింటినీ తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా సిబ్బంది పూర్తిస్థాయిలో ఆయా పనులు చేసినా, ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై తర్జన, భర్జన పడుతున్నారు.

ఇదీ పరిస్థితి....

ఎన్నికల వేళ ప్రతి అంశంపై రాజకీయ నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం సాధారణం. ఈ నేపథ్యంలో సున్నితమైన అంశాల పై స్పష్టమైన ఆదేశాలు ఇస్తేనే క్షేత్రస్థాయిలో సమస్య ఉండదని ఆయా శాఖల సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

ఇంటి గోడలు, ప్రహరీలకు మా నమ్మకం నువ్వే జగన్‌ అని ఆయన ముఖచిత్రంతో ముద్రించి ఉన్న స్టిక్కర్లను అతికించారు. ప్రైవేట్‌ స్థలాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల చిత్రాలు, బ్యానర్లు ఇతర ప్రచార అంశాలకు సంబంధించి తొలగించడం లేదా సంబంధిత యజమానుల అనుమతి పత్రాలు తీసుకోవడం తప్పనిసరి. ఇప్పటివరకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే వాటిని ఏర్పాటు చేశారు. ఈ విషయం పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

పట్టణాల పరిధిలో వార్దు సచివాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద బ్యానర్లు, ఇతర ప్రచార సామగ్రి తొలగింపు, ఫొటోలు కనిపించకుండా కాగితాలు అతికించారు. గ్రామాల్లో ఆయా పనులు పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంది.

చిక్కీల పై జగన్‌ ఫొటో.....

పాఠశాలలో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద అందించే చిక్కీ ప్యాకెట్ల పై ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉండటంతో నిబంధనల ప్రకారం కవర్లు తొలగించాలి. ఈ విషయంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు రావాల్సి ఉందని అధికారుల చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ప్యాకెట్‌ రూపంలో కాకుండా, కవర్‌ తొలగించి చిక్కీలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. జగనన్న గోరుముద్ద పేరిట వచ్చిన ప్యాకెట్లు పాఠశాలల్లో, హాస్టల్లో వేలసంఖ్యలో ఉన్నట్లు చెబుతున్నారు.

Updated Date - Mar 21 , 2024 | 12:20 AM