Share News

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన సీఎం

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:38 PM

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశాడని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు.

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన సీఎం

టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు

రైల్వేకోడూరు, జనవరి 11: సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశాడని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు. గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలోని ఐదు కోట్ల ప్రజాకానీకానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, దోపీడీలను ఎత్తిచూపేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రా.. కదిలిరా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యలను ఎత్తిచూపడం జరుగుతుందన్నారు. టీడీపీ కార్యక్రమాలకు వచ్చిన జనవాహినిని చూసి సీఎంకు వణుకు మొదలైందని, వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ఇసుక, గ్రానైట్‌, మైనింగ్‌ పేరుతో రూ.లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని నిలువునా సీఎం జగన్‌ ముంచేశారన్నారు. సీఎం చేసింది కూల్చివేతలు, రద్దులు, దాడులు, భూకబ్జాలు, కేసులే అని తెలిపారు. అభివృద్ధి మాత్రం శూన్యమైందన్నారు. యువతకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగం పోయి.. పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా సీఎం జగన్‌ను గద్దె దింపాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బోనాసి వెంకటసుబ్బయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మా శివ, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు కమతం నాగరాజుయాదవ్‌, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు పుల్లెల రమేష్‌, రాజంపేట పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు తేనేపల్లి చిన్నా, గడ్డ శ్రీరాములు, మిట్టవీధి మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:38 PM