Share News

పేదల ఇళ్ల నిర్మాణంపై కేంద్రం అసంతృప్తి

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:48 AM

పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

పేదల ఇళ్ల నిర్మాణంపై కేంద్రం అసంతృప్తి

మంజూరైన ఇళ్లు 23 లక్షలు.. పూర్తి చేసింది 6.3 లక్షలే

కేంద్రం నిధులు ఇస్తున్నా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’

జూలైలోపు పూర్తి చేయాలంటూ నెలవారీగా లక్ష్యాలు

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ, పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొత్తం 23 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. సకాలంలో నిర్మాణం పూర్తిచేయలేదనే కారణంతో 5 లక్షలకుపైగా ఇళ్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మిగిలిన 18లక్షల ఇళ్లను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తిచేసే పరిస్థితులు కనిపించడం లేదంటూ కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే రాష్ట్ర గృహనిర్మాణశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీఎంఏవై పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై సమీక్షించారు.

కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉందంటూ ఆయన అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న పేదల ఇళ్ల నిర్మాణాలను వచ్చే జూలై లోపు పూర్తి చేయాలంటూ నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిశోర్‌ గతేడాది రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గాజులపల్లిలోని జగనన్న లే-అవుట్‌ను సందర్శించారు. ఈ లే-అవుట్‌లో 1,402 ఇళ్లు మంజూరు చేయగా.. అప్పటికి 250 ఇళ్లు మాత్రమే పూర్తి చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ రాష్ట్రానికి వచ్చింది. వివిధ జిల్లాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) పథకం కింద మంజూరు చేసిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సక్రమంగా కేటాయించలేదని, ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయడం లేదని తప్పుబట్టింది.

Updated Date - Apr 25 , 2024 | 07:47 AM