Share News

భవన నిర్మాణ రంగాన్ని కూల్చేశారు!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:28 AM

ఉపాధి కల్పనలో భవన నిర్మాణరంగానిది మూడో స్థానం. సుమారు 60 లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడ్డారు.

భవన నిర్మాణ రంగాన్ని కూల్చేశారు!

60 లక్షల మందిని వేధించిన జగన్‌

ఇసుక దోపిడీ కోసం ‘స్కెచ్‌’.. కొత్త విధానం పేరిట రీచ్‌లు బంద్‌

అమరావతి దెబ్బకు రియల్‌ రంగం ఢామ్‌.. అస్థిర విధానాలతో ఆగిన నిర్మాణాలు

పనుల్లేక ఇతర రాష్ట్రాలకు వలసలు.. సుమారు వెయ్యి మంది ఆత్మహత్య

టీడీపీ హయాంలో చేతినిండా పనులు.. కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు

ఆ నిధులనూ దారి మళ్లించిన జగన్‌.. నేటికీ కుదుట పడని నిర్మాణ రంగం

కట్టడం కాదు... కూల్చడం!

నేను కట్టను!... మిమ్మల్ని కట్టుకోనివ్వను!

..ఇదీ ఐదేళ్లపాటు జగన్‌ అనుసరించిన విధానం!

దీని ఫలితం... రాష్ట్రంలోని సుమారు

60 లక్షల మంది భవన నిర్మాణరంగ కార్మికులకు ఆకలి కేకలు, తీరని కష్టాలు!

ఇసుకను భోంచేయడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని రూపొందించిన జగన్‌... కార్మికుల పొట్టకొట్టారు.

పాధి కల్పనలో భవన నిర్మాణరంగానిది మూడో స్థానం. సుమారు 60 లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు భవన నిర్మాణ రంగం ఒక వెలుగు వెలిగింది. అమరావతిలో రాజధాని పనుల నిర్మాణంలో వేల మంది కార్మికులు పాల్గొన్నారు. అదే సమయంలో... గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భవన నిర్మాణాలు మొదలయ్యాయి. ఇటు ప్రకాశం జిల్లా నుంచి అటు తూర్పు గోదావరి వరకు ‘అమరావతి’ ప్రభావంతో రియల్‌ బూమ్‌ రంకెలేసింది. బిల్డర్లు పెద్దసంఖ్యలో కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, పల్లెల్లో సిమెంటు రోడ్లు, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం... ఇలా ప్రభుత్వపరంగానూ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం కళకళలాడింది. ఇక్కడ కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచీ తెప్పించుకునేవారు. సొంత ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. టీడీపీ సర్కారు అమలు చేసిన ‘ఉచిత ఇసుక’ విధానం నిర్మాణ రంగానికి ఎంతో ఊతమిచ్చింది. ఇలా ఐదేళ్లపాటు కళకళలాడిన భవన నిర్మాణ రంగం... వైసీపీ అధికారంలోకి రాగానే కుదేలైపోయింది.

జగన్‌ కొట్టిన ‘ఇసుక’ దెబ్బ

ఇసుక... ప్రకృతి వనరు! పైసా పెట్టుబడి లేదు! తవ్వుకోవడం... రవాణా చేసి అమ్ముకోవడం! కోట్లకు కోట్లు వెనకేసుకునే అవకాశం! అందుకే దీనిపై వైసీపీ పెద్దలు ఎప్పటి నుంచో కన్నేశారు. ‘అధికారంలోకి వస్తే ఇసుక నుంచి కోట్లు పిండుకునేది ఎలా?’ అనే వ్యూహం రచించుకున్నారు. పీఠం చేజిక్కగానే దానిని అమలు చేశారు. ఉచిత ఇసుకకు మంగళం పలికారు. ‘కొత్త విధానం తీసుకొస్తాం’ అంటూ కాలయాపన మొదలుపెట్టారు. దీంతో ఇసుకే బంగారమైంది. అప్పటికే కొనసాగుతున్న నిర్మాణ పనులకు ఇసుక కరువైంది. దీనిని వైసీపీ నాయకులు బాగా సొమ్ము చేసుకున్నారు. ఒక దశలో లారీ ఇసుక లక్ష రూపాయలకు చేరుకుంది. ఇసుక ఖర్చు భరించ లేని వాళ్లు పనులు ఆపి వేశారు. కొత్తగా శంకుస్థాపనలు ఆగిపోయాయి. దీంతో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలలపాటు రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు బంద్‌! ఇక్కడ చేయడానికి పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస పోయారు. జగన్‌ సర్కారు 2019 సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీని తెచ్చింది. ఇసుక దోపిడీని కేంద్రీకరించి... సాంతం దోచుకోవడమే లక్ష్యంగా ఈ పాలసీ రూపొందింది. ప్రజలకు మేలు చేయడంకాదు... జేబులు నింపుకోవడమే దీని ఉద్దేశం! దీనివల్ల ఇసుక ధరలు తగ్గలేదు. దోపిడీ ఆగలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కరోనా రెండేళ్లపాటు భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసింది.

నిర్మాణాలపై సమ్మెట!

ఒకవైపు ఇసుక దెబ్బ... మరోవైపు జగన్‌ విధ్వంసకర విధానాల పోటు! ఈ రెండింటితో నిర్మాణరంగం పూర్తిగా కుదేలైంది. ‘అమరావతి’ని అటకెక్కించడంతో రియల్‌ ఎస్టేట్‌ ఢామ్‌ అంది. అంతకుముందు ఒకేసారి రెండుమూడు ప్రాజెక్టులు చేపట్టిన బిల్డర్లు... ఆ తర్వాత రెండేళ్లలో ఒక్కటీ పూర్తి చేయలేని స్థితికి వచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వ పనులు ఆగిపోయాయి. బటన్‌ నొక్కితే చాలని భావించిన జగన్‌... అభివృద్ధి పనులను ఆపివేశారు. ఫలితంగా నిర్మాణ రంగం ధ్వంసమైంది. కార్మికులకు కష్టాలే మిగిలాయి.

వెయ్యిమంది ఉసురు పోసుకున్న జగన్‌

రాష్ట్రంలో పనులు లభించక రాయలసీమ జిల్లాల్లోని చాలా మంది భవన నిర్మాణ కార్మికులు, కూలీలు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారు ఒడిసా వంటి రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుని వెళ్లారు. కోస్తా జిల్లాల కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య వెయ్యికిపైనే ఉంటుందని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోనా రాజ్‌ తెలిపారు.

భవన నిర్మాణ రంగానికి కీలకం ఇసుక! ఇసుక లేకుంటే నిర్మాణం ఆగినట్లే! 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితం! లోడింగ్‌, రవాణా ఖర్చులతో 4 టన్నుల ఇసుక ట్రాక్టర్‌ రూ.2వేలు, 20 టన్నుల ఇసుక లారీ రూ.10వేలు ఉండేది. జగన్‌ వచ్చాక... ఈ ధర అనేక రెట్లు పెరిగిపోయింది.

ఆదుకోవాల్సింది పోయి...

కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి... వారిపై కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. అంతకుముందు టీడీపీ అమలు చేసిన పథకాలు, తీసుకున్న చర్యలకు సమాధి కట్టారు. వైసీసీ

అధికారంలోకి వచ్చిన సమయానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఖాతాలో రూ.1850 కోట్లు ఉండేవి. కార్మికులు సహజ మరణం చెందితే కుటుంబ సభ్యులకు రూ.80 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5.20 లక్షల ఆర్థిక సాయం అందించేవారు. ఇక... కార్మికుల కుటుంబంలో ఆడ పిల్లలకు వివాహమైనప్పుడు, ప్రసవమైనప్పుడు టీడీపీ ప్రభుత్వం రూ.20 వేలు ఇచ్చేది. అయితే కార్మికుల బోర్డు నిధులను వైసీపీ సర్కారు దారి మళ్లించింది. దీంతో... మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందడంలేదు.

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నిర్మాణ కూలీలకు అడ్డా! టీడీపీ హయాంలో ఉదయం 9లోపు అడ్డా మొత్తం ఖాళీ అయ్యేది. ఎంత మంది వస్తే అంతమందికీ ఏదో ఒక పని దొరికేది. ఇప్పుడు... మధ్యాహ్నం 12 దాకా కూలీలు పనులకోసం బెంజ్‌ సర్కిల్‌ అడ్డాలో ఎదురు చూస్తూనే ఉంటున్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి గురించి చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు!

రోజుల తరబడి పస్తులు!

20 ఏళ్లకు పైగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నా. ఇసుక లేక నెలల తరబడి పనులు దొరకని దుస్థితిని నా వృత్తి జీవితంలో 2019లోనే తొలిసారి చూశా. తాపీ మేస్త్రీలతోపాటు భవన నిర్మాణ కూలీలకూ పనులు దొరకలేదు. ఓ వైపు ఇసుక కొరత, మరోవైపు కరోనా మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొచ్చాం. పస్తులతో గడిపిన రోజులు కూడా ఉన్నాయి. కూలీలు ఏ రోజుకారోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారే. ఇప్పటికీ కార్మికుల పరిస్థితి గాడిన పడలేదు.

- బి.నాగరాజు,

తాపీ మేస్ర్తీ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా

నెలలో 15 రోజులు పని ఉండడం లేదు

ఇసుక కొరతతో పనులు లేకుండా పోయాయి. దీనికి తోడు మిషన్లు రావడంతో పనులు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో ఇంట్లో పనుల వల్లో, ఆరోగ్యం బాగోలేక వెళ్లకపోతే తప్ప పని లేదనే బాధ ఉండేది కాదు. ఇప్పుడు నెలలో 15 రోజులు కూడా పనులు ఉండటం లేదు.

- వేముల పార్వతి, కూలీ, విజయవాడ

అలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు

‘‘40 ఏళ్లుగా సిమెంట్‌ వ్యాపారంలో ఉన్నాను. 2019 నుంచి రెండేళ్ల పాటు ఎదుర్కొన్న దుస్థితిని తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. 2019 మే నెల ముందు వరకు రోజుకులారీ లోడు సిమెంట్‌ అమ్మేవాడిని. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలవడంతో వారానికి ఒక లోడుకూడా అమ్మలేకపోయాం. ఆ ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది!’

- విజయవాడకు చెందిన సిమెంటు వ్యాపారి

భవన నిర్మాణ రంగం... ఉపాధి కల్పనలో మర్రిచెట్టు లాంటిది. పేరుకే ఇది ఒక రంగం. కానీ... తాపీ మేస్త్రీ, రాడ్‌ బెండింగ్‌, సెంట్రింగ్‌, ఎలక్ర్టీషియన్‌, ప్లంబర్‌, టైల్స్‌ మేస్త్రీ, పెయింటర్‌ ఇలా 36 రకాల నిపుణులకు నిర్మాణ రంగం ఉపాధి కల్పిస్తుంది. జగన్‌ జమానాలో వీరంతా పనుల్లేక అల్లాడిపోయారు.

జగన్‌ అధికారంలోకి రాగానే... ‘మద్యం’ పాలసీని మార్చేశారు! కానీ... ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా మద్యం షాపులు మూతపడలేదు. మందుబాబులు ఇబ్బంది పడలేదు. రాత్రికి రాత్రి ప్రైవేటు షాపులు పోయి, ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చేశాయి. మద్యానికి జగన్‌ ఇచ్చిన విలువ ఇది!

జగన్‌ వచ్చీ రాగానే... ఇసుక విధానాన్ని మార్చేశారు. కానీ... కొత్త పాలసీ వచ్చేదాకా ఇసుక బంద్‌! ఒకరోజు, రెండు రోజులు కాదు! దాదాపు ఆరునెలలు ఎక్కడా అధికారికంగా ఇసుక దొరకలేదు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. నిర్మాణ రంగానికి జగన్‌ ఇచ్చిన ప్రాధాన్యం ఇది!

Updated Date - Apr 24 , 2024 | 03:28 AM