Share News

‘దొంగ ఓట్ల’ దెబ్బ.. ముగ్గురు కలెక్టర్లపై వేటు

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:06 AM

కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ఐఏఎ్‌సలపై వేటు వేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, అనంతపురం కలెక్టర్‌ ఎం.గౌతమి, తిరుపతి కలెక్టర్‌ లక్ష్మీశను విధుల నుంచి తప్పించింది.

‘దొంగ ఓట్ల’ దెబ్బ.. ముగ్గురు కలెక్టర్లపై వేటు

కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ఐఏఎ్‌సలపై వేటు వేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, అనంతపురం కలెక్టర్‌ ఎం.గౌతమి, తిరుపతి కలెక్టర్‌ లక్ష్మీశను విధుల నుంచి తప్పించింది. కలెక్టరు విధుల నుంచి తప్పుకొని వెంటనే జీఏడీలో రిపోర్టు చేయాలని వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి ముగ్గురు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాలో అవకతవకల దగ్గర నుంచి విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి వంటి కారణాలతో వీరిని అకస్మాతుగా బదిలీ చేసినట్టు చెబుతున్నారు. రాజాబాబు, గౌతమి ఏడాది క్రితమే బదిలీపై కృష్ణా, అనంతలకు వచ్చారు. గత ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన జగన్‌ ప్రభుత్వం ఒకేసారి దాదాపు ఎనిమిది కలెక్టర్లను బదిలీ చేసింది. ఆ బదిలీల్లో భాగంగా విశాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న రాజాబాబును కృష్ణా కలెక్టర్‌గా, తిరుపతిలో ఎలక్ట్రికల్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సీఈవోగా ఉన్న ఎం.గౌతమిని అనంతపురం కలెక్టర్‌గా నియమించింది. లక్ష్మీశ ఈ ఏడాది జనవరి 28వ తేదీన తిరుపతి కలెక్టర్‌గా నియమితులయ్యారు. దొంగ ఓట్ల వ్యవహారం రాష్ర్ట్రమంతా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో అత్యధికంగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని కలెక్టర్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కలెక్టర్‌ పూర్తిస్తాయిలో దృష్టి సారించకపోగా, తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పైగా సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డికి బంఽధువు కావడం, సీఎంవోలోని కీలక అధికారికి సన్నిహితంగా ఉంటూ, ఆయన ఆదేశాలపై పనిచేస్తుండటాన్నీ ఈసీ గమనించింది. దీంతో గౌతమిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఈసీ నిఘా ఉందని తెలిసినా తిరుపతి కలెక్టర్‌ లక్ష్మీశ అత్యుత్సాహం ప్రదర్శించారు. బాధ్యతలు తీసుకున్న రోజే వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డిని కలిశారు. అప్పటికే తిరుపతిలో దొంగ ఓటు కార్డుల వ్యవహారంపై ఈసీ అత్యంత సీరియ్‌సగా ఉంది. ఇలాంటి సమయంలో లక్ష్మీశ ప్రవర్తన ఈసీకి ఆగ్రహం తెప్పించింది. ఇటీవల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తిరుపతిలో అధికార పార్టీ దాచిన వేలకొద్ది తాయిలాలు పట్టుబడ్డాయి. దీనిపై కలెక్టర్‌ ఇచ్చిన రిపోర్టు సృప్టంగా లేకపోవడంతో ఈసీ వేటు వేసిందని చెబుతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 04:06 AM