Share News

దేశంలోనే అత్యుత్తమం!

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:33 AM

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను నిర్మించింది.

దేశంలోనే అత్యుత్తమం!

రాష్ట్రానికి గర్వకారణంగా మంగళగిరి ఎయిమ్స్‌

183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం

అన్ని రకాల అధునాతన వైద్యసేవలు

వివిధ ల్యాబ్‌లు.. అధునాతన బ్లడ్‌బ్యాంకు

2015లోనే నిర్మాణ పనులు ప్రారంభం

2019 ఎన్నికలకు ముందే ఓపీ సేవలు

నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ

దేశంలో కెల్లా అత్యుత్తమ ఎయిమ్స్‌ మంగళగిరిలో రూపుదిద్దుకుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులే ఈ మేరకు కితాబునిచ్చారు. సువిశాల విస్తీర్ణంలో, పచ్చని కొండల నడుమ, ఆహ్లాదకరమైన గ్రీనరీ మధ్య చాల సుందరంగా మంగళగిరి ఎయిమ్స్‌ రూపుదిద్దుకుంది. విజయవాడ-గుంటూరు నడమ, నవ్యరాజధాని అమరావతికి అత్యంత చేరువలో ఇది ఉంది. ఇన్ని అనుకూలతలున్న ఎయిమ్స్‌ దేశంలో మరెక్కడా లేవన్నది కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల మాట! వచ్చే యాభై ఏళ్లలో కూడా దీనికి సాటి రాగల ఎయిమ్స్‌ మరొకటి ఉండదని అంటున్నారు. అంతగొప్ప సంస్థ ఇక్కడ ఆవిష్కృతం కావడం మన రాష్ట్రానికే గర్వకారణం.

- మంగళగిరి

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను నిర్మించింది. 2015 డిసెంబరు 19న ఇక్కడి కొండల నడుమ ఉన్న 183.11 ఎకరాల విస్తీర్ణంలో రూ.1618.23 కోట్ల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్‌కు నాటి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతుండగానే 2018లో ఎయిమ్స్‌కు అనుబంధంగా ఏర్పాటుచేయనున్న వైద్యకళాశాల తాలూకు తొలిబ్యాచ్‌ 50మంది వైద్యవిద్యార్ధులకు విజయవాడ సిద్దార్ధ వైద్యకళాశాలలో తరగతులను ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందే ఓపీ విభాగం బ్లాక్‌ను పూర్తిచేసి అవుట్‌ పేషెంట్‌ వైద్యసేవలను ఇందులో లాంఛనంగా ప్రారంభించారు. ఎయిమ్స్‌లో 41 బ్రాడ్‌ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు పనిచేస్తున్నాయి. 2019 మార్చి 12 నుంచి అవుట్‌ పేషెంట్‌ విభాగం పనిచేస్తుండగా, ప్రస్తుతం ఓపీ విభాగంలో ప్రతిరోజూ సగటున 2,500 మంది రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి 15 లక్షల ఓపీ సేవలు అందించారు. అలాగే, ఇప్పటివరకు 20వేలకు పైగా ఇన్‌పేషెంట్‌ అడ్మిషన్లు, మరో 12వేల మంది అత్యవసర సేవలు పొందారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ కోర్సును 2018లో ప్రారంభించగా, ప్రస్తుతం 600 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో వంద మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులను అభ్యసిస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పారామెడికల్‌ కోర్సులను కూడా ప్రారంభించనున్నారు.

7,200కుపైగా శస్త్ర చికిత్సలు..

ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌ డిపార్టుమెంట్‌ భవనం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇన్‌పేషెంట్‌ బెడ్‌ ఆక్యుపెన్సీ 65 శాతంగా ఉంది. డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ సేవలను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. రేడియో డయాగ్నోసిస్‌ కింద ఎక్స్‌రే, మామోగ్రఫీ, అలా్ట్రసోనోగ్రఫీ, సిటీ అండ్‌ ఎమ్మారై, న్యూక్లియర్‌ మెడిసిన్‌ కింద పెట్‌ స్కాన్‌ సేవలను సైతం అందిస్తున్నారు. ఈ డయాగ్నోస్టిక్స్‌ సేవలను ఇప్పటివరకు 20,80,335 మందికి అందించారు. ఇక సర్జరీల విషయానికొస్తే.. ఇప్పటివరకు న్యూరోసర్జరీ, పిడియాట్రిక్‌ సర్జరీ, యూరాలజీ సహ వివిధ విభాగాలలో 7,200కు పైగా శస్త్రచికిత్సలను జరిపించారు. రెండు లైనాక్‌ రేడియోథెరపీ యంత్రాలు, సిటీ స్టిమ్యులేటర్‌, హెచ్‌డీ బ్రాకీథెరపీ పాలియేటివ్‌ కేర్‌ తదితర అధునాతన సమగ్ర కేన్సర్‌ చికిత్స సౌకర్యాలను సైతం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చి ఉత్తమ వైద్యసేవలను అందిస్తున్నారు. డయాలసిస్‌ సౌకర్యం, అధునాతన బ్లడ్‌బ్యాంకు, రాష్ట్రస్థాయి వీఆర్‌డీయల్‌ సౌకర్యం, ట్రేస్‌ ఎలిమెంట్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ ల్యాబ్‌, అధునాతన రోబోటిక్‌ ఫిజియోథెరపీ సౌకర్యం, ఇంట్రా యుటిరైన్‌ ఇన్సెమిషేన్‌, ఆడియోమెట్రీ అండ్‌ వెస్టిబ్యులర్‌ ఫంక్షన్‌ ల్యాబ్‌, నరాల ప్రసరణ అధ్యయనాలు, స్పిరోమెట్రీ, యూరోఫ్లోమెట్రీ వంటి అన్ని రకాల వైద్యసేవలను వినియోగంలోకి తెచ్చారు.

నేడు జాతికి అంకితం

వర్చువల్‌గా చేయనున్న ప్రధాని మోదీ

9 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు శంకుస్థాపన కూడా

విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌..

రాష్ట్రంలో 4 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లూ ప్రారంభం

మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 24: మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. అలాగే, ఎయిమ్స్‌ ప్రాంగణంలో 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు వర్చువల్‌ విధానంలో మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు విశాఖపట్నంలో మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ, రాష్ట్రంలో నాలుగు మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌, సీఈవో డాక్టర్‌ మధుబానందకర్‌ ఈ వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు డాక్టర్‌ మన్సూఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషి, భారతీ ప్రవీణ్‌ పవార్‌, ప్రొఫెసర్‌ ఎస్పీ సింగ్‌ బఘేల్‌, గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని హాజరుకానున్నారని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో రోగుల సంరక్షణతోపాటు విద్య, పరిశోధనల్లో ఉన్నత స్థాయి ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పారామెడికల్‌ కోర్సులను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నట్టు డాక్టర్‌ మధుబానందకర్‌ చెప్పారు.

Updated Date - Feb 25 , 2024 | 03:33 AM