Share News

‘కొండా’ ఆస్తులు రూ.4,490 కోట్లు

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:00 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.4,490 కోట్లు! అప్పులు రూ.13.83 కోట్లు! వేల కోట్లు ఆస్తులున్నా కొండా దంపతుల పేరున కానీ, వారి కుమారుడి పేరున కానీ ఒక్క వాహనం కూడా లేకపోవడం గమనార్హం.

‘కొండా’ ఆస్తులు రూ.4,490 కోట్లు

చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలోకి విశ్వేశ్వర్‌రెడ్డి

అప్పులు రూ.13.83 కోట్లు.. చేతిలో నగదు 9 లక్షలు

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.4,490 కోట్లు! అప్పులు రూ.13.83 కోట్లు! వేల కోట్లు ఆస్తులున్నా కొండా దంపతుల పేరున కానీ, వారి కుమారుడి పేరున కానీ ఒక్క వాహనం కూడా లేకపోవడం గమనార్హం. కొండా తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన పేరుమీద రూ. 1,178.72 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య సంగీతా రెడ్డి పేరిట రూ.3,203.90 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన కుమారుడు వీరజ్‌ మాధవరెడ్డి పేరున ఉన్న ఆస్తులు రూ.107.44 కోట్లు! కొండా వద్ద 3 లక్షలు, ఆయన భార్య వద్ద 6 లక్షల నగదు ఉన్నట్లు చూపించారు. ఆయన పేరుమీద వివిధ బ్యాంకుల్లో అప్పు రూ.17.69 లక్షలు, ఆయన భార్య పేరిట రూ.12.06 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన వద్ద రూ.60 లక్షలు, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు చూపించారు. కొండా పేరున చేవెళ్లలో మూడు ఎకరాలు, ధర్మసాగర్‌లో 43.26 ఎకరాలు, చేవెళ్ల మండలం కమ్మెటలో రెండు ఎకరాలు, కుమ్మెరలో 21.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య పేరిట రాజేంద్రనగర్‌ మండలం నార్సింగిలో ఎకరం, ఏపీలోని చిత్తూరు జిల్లాలో 14.13 ఎకరాల సాగుభూమి ఉన్నట్లు ప్రకటించారు.

66 వేల మందికి యూఎస్‌ పౌరసత్వం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 22: అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో నాచురలైజ్డ్‌ యూఎస్‌ సిటిజన్‌షిప్‌ పొందిన వారిలో మెక్సికన్లు 1.06 లక్షల మందితో ప్రథమ స్థానంలో నిలవగా, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా భారత్‌, ఫిలిప్పైన్స్‌, క్యూబా, డొమినిసియన్‌ రిపబ్లిక్‌, వియత్నాం, చైనా నిలిచాయి. ఆ ఏడాది మొత్తం 65,960 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. అమెరికాలో 2022 నాటికి 4.60 కోట్ల మంది విదేశీయులు నివశిస్తున్నారు. మొత్తం యూఎస్‌ జనాభా 33.3 కోట్లలో అది 14 శాతం.

Updated Date - Apr 23 , 2024 | 05:00 AM