Share News

అవినీతి ‘కళ’

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:56 AM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గిరిజన ప్రాంతమున్న నియోజకవర్గమది. స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఏమాత్రం కృషి చేయలేదనే విమర్శలున్నాయి.

అవినీతి ‘కళ’

నియోజకవర్గంలో అభివృద్ధి నిల్‌

మహిళా ఎమ్మెల్యే అక్రమాల దందా

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. తండ్రి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. ఆమె కూడా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అక్రమార్జనపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై ఏమ్రాతం చూపడం లేదని చెబుతారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

ఇసుక దందాలు, అక్రమ మట్టి తవ్వకాలు, భూ ఆక్రమణలు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు.. ఇలా దోచుకోవడానికి అవకాశమున్న ఏ వనరునూ వదలకుండా సదరు నాయకురాలు సొమ్ములు వెనకేసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఫాం హౌస్‌ నిర్మించుకున్నారు. నియోజకవర్గంలో అవినీతి ‘కళ’ తప్ప.. అభివృద్ధి మచ్చుకైనా కనిపించదనే విమర్శలు ఉన్నాయి.

సొంతూరులోనే చెరువు ఆక్రమణ

కబ్జా చేసిన భూముల్లో ఫాం హౌస్‌

ఏ శాఖ ద్వారా పనులు చేపట్టినా

సదరు నేతకు వాటాలు ఇవ్వాల్సిందే

పీఏ ద్వారా కమీషన్ల వసూలు

ఇసుక అక్రమ తవ్వకాలతో సొమ్ములు

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గిరిజన ప్రాంతమున్న నియోజకవర్గమది. స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఏమాత్రం కృషి చేయలేదనే విమర్శలున్నాయి. బినామీలకు కేరా్‌ఫగా మారారు. అధికారంలో ఉంటామో లేదోననే భావనతో అక్రమార్జనకు తెరలేపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఫాం హౌస్‌ నిర్మించుకుని ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకున్నారు. సొంత గ్రామంలోని చెరువును కూడా ఆక్రమించుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల్లో సొమ్ములు వెనకేసుకున్నారు. తన పీఏ ద్వారా వాటాలు దండుకున్నారు. సదరు నాయకురాలు సొంత నియోజకవర్గంలో ఓ గ్రామ సమీపంలో 18 ఎకరాల డీ పట్టా భూమిని ముగ్గురు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి, చుట్టుపక్కల ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు 30 ఎకరాల్లో ఫాం హౌస్‌ నిర్మించుకున్నారు. దానికి అవసరమైన రవాణా మార్గాన్ని ఐటీడీఏ నిధుల ద్వారా నిర్మించుకున్నారు. ఫాం హౌస్‌కు సమీపంలోనే గ్రామం పేరు చెప్పి బీటీ రోడ్డు వేయించుకున్నారు. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారని ఒక జాతీయ పార్టీ నాయకుడు వచ్చి ఆరోపించినప్పటికీ ఆమె ఖండించలేదు. గిరిజన మండలంతో పాటు ఓ మైదాన మండలంలో కూడా పలుచోట్ల ఆమె భూములు ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏ ఒక్కరూ ముందుకువచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు.

వాటా ఇవ్వాల్సిందే..

కొన్ని శాఖలకు సంబంధించి ఆర్థికపరమైన పనులు జరిగితే ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాల్సిందే. ఏమాత్రం మొహమాటం లేకుండా తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా సదరు ఎమ్మెల్యే డిమాండ్‌ చేస్తారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు అధికారులు వాటాలు పంపాల్సిన పరిస్థితి. తమ శాఖ పరిధిలో జరిగిన పనులకు సంబంధించి ప్రతిఫలాలను ఎమ్మెల్యేకు అందిస్తున్నారనే ఆరోపణలు బాగా ఉన్నాయి. కాగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడే బినామీ పేర్లతో కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ముందుగా ‘లెక్కలు’ తేలాకే..

నియోజకవర్గంలో ఏ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా ఏ పనులు చేపట్టాలన్నా ఎమ్మెల్యే అనుమతి ముందుగా పొందాల్సిందే. వాటికి సంబంధించిన ‘లెక్కలు’ ముందుగా తేల్చుకున్న తర్వాతే పనుల కేటాయింపు జరుగుతుందన్న ప్రచారం ఉంది.

ఎమ్మెల్యే అనుచరులు కూడా..

ఎమ్మెల్యే అనుచరులు కూడా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తెరవెనుక ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమార్కుల వెనుక ఎమ్మెల్యే ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇసుక దందా..

నియోజకవర్గంలో ఇసుక దందా విపరీతంగా ఉంది. ఒక గిరిజన మండలంలో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుకదందా అధికంగా సాగుతోంది. ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోనే చెరువు ఆక్రమణకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులకు, ఆ ఎమ్మెల్యేకు మధ్య వివాదం కొనసాగుతోంది. చెరువు తన పూర్వీకులదని చెబుతూ దాన్ని కబ్జా చేశారు. ఇది గ్రామానికి చెందిన చెరువు అని కొంతమంది అడ్డు తగిలారు. ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి.

Updated Date - Feb 25 , 2024 | 03:56 AM