Share News

రెచ్చిపోయిన వైసీపీ మూకలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:50 AM

ఎన్నికల ప్రచారంలో వైసీపీ వర్గాలు రెచ్చిపోతున్నాయి.

రెచ్చిపోయిన వైసీపీ మూకలు

పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ వర్గీయులపై దాడి

ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

గృహాలపైనా రాళ్లు.. గ్రామంలో పోలీసు బందోబస్తు

దాచేపల్లిలో పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే టీడీపీ కార్యకర్తపై దాడి

తెనాలిలో కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. తిట్ల దండకం

వైసీపీ మూకల తీరుపై జనం నుంచి ఛీత్కారాలు

ఈపూరు, తెనాలి, దాచేపల్లి, ఏప్రిల్‌ 24: ఎన్నికల ప్రచారంలో వైసీపీ వర్గాలు రెచ్చిపోతున్నాయి. జగన్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతుండడాన్ని సహించలేక దాడులకు దిగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ వర్గాలవారు టీడీపీ కార్యకర్తలతోపాటు పోలీసు కానిస్టేబుల్‌పైనా దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై వైసీపీ అల్లరి మూకలు రాళ్లతో దాడిచేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు.. వినుకొండలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు బుధవారం నామినేషన్‌ వేస్తుండడంతో గ్రామం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో టీడీపీ వారి కారుకు వైసీపీ వాళ్లు మోటార్‌ బైక్‌ను అడ్డుపెట్టడంతో కొద్దిపాటి ఘర్షణ జరిగింది. కొంతమంది పెద్దలు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లి ఇంటికి వచ్చిన తిరువెంగల చలమయ్య అనే టీడీపీ కార్యకర్త.. పొలానికి వెళుతుండగా అతనిపై వైసీపీకి చెందిన తమ్మిశెట్టి ఆంజనేయులు, తిరుపతి లక్ష్మీనారాయణ, బండారి కోటయ్య, తమ్మిశెట్టి రంగయ్య, బండారి వెంకటస్వామి, హనుమయ్య, తమ్మిశెట్టి ఏడుకొండలు మరికొందరు దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన చింతల సీతారామాంజినేయులు, చింతల కుమారిపై కూడా వైసీపీ వర్గీయులు దాడి చేశారు. సీతారామాంజినేయులు తలకు తీవ్రగాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చలమయ్య తలకు, ఎడమ చెవికి తీవ్ర గాయమైంది. ఇరువురికీ ఈపూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా గ్రామంలోని వైసీపీ మండల నాయకుడి ఆదేశాల మేరకు వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల గృహాలపై రాళ్లతో దాడి తెగబడ్డారు.

కానిస్టేబుల్‌పై దౌర్జన్యం

గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా నామినేషన్‌ కేంద్రానికి వచ్చారు. అభ్యర్థితోపాటు పరిమిత సంఖ్యలో వ్యక్తు లు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లాలి. నామినేషన్‌ కేంద్రం దగ్గర నిశ్శబ్దంగా ఉండాల్సి ఉన్నా వైసీపీ జెండా రంగులున్న కాగితాలను చిమ్ముతూ వీరంగం చేశారు. బారికేడ్లు అమర్చిన చోట పోలీసులు జనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పట్టణ వైసీపీ నాయకుడు దేసు శ్రీనివాస్‌, మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానిస్టేబుల్‌పై శ్రీనివాస్‌ వేలు చూపిస్తూ తిట్ల దండకం అందుకున్నారు. అయితే కానిస్టేబుల్‌ కూడా ధీటుగానే సమాధానం ఇవ్వటం, లోపలకు ఎవరినీ వెళ్లనివ్వకుండా ఆపేయటంతో నాయకుల తీరుపై విమర్శలు వినిపించాయి.

Updated Date - Apr 25 , 2024 | 03:50 AM