Share News

కూటమిదే పీఠం

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:07 AM

రాష్ట్రంలో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిదే విజయమని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమ్మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో..

కూటమిదే పీఠం

మోదీ రాక.. ఎన్డీయే పునఃకలయిక.. 5 కోట్ల మందికి ఆనందం

నేను దేవదత్తం పూరించా.. మోదీ పాంచజన్యం పూరిస్తారు

మద్యనిషేధం పేరుతో అధికారంలోకి.. గద్దెనెక్కాక సారా వ్యాపారం

పది వేల కోట్ల జీఎస్టీ మోసం.. ఇసుకలో 40 వేల కోట్ల దోపిడీ

పరిశ్రమలన్నీ ఏపీ నుంచి పరార్‌.. జగన్‌ సర్కార్‌పై పవన్‌ ధ్వజం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

రాష్ట్రంలో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిదే విజయమని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమ్మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో.. మోదీ రాక, ఎన్డీయే పునఃకలయిక 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందాన్నిచ్చిందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రా ప్రజానీకం.. దాష్టీకం, దోపిడీతో నలుగుతున్న ఆంధ్ర ప్రజానీకం.. అవినీతి, అప్రజాస్వామిక విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకం.. మోదీ రాక కోసం ఎదురుచూస్తోందన్నారు. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతూ.. హ్యాట్రిక్‌ కొట్టబోతున్న మోదీకి ఆంధ్ర ప్రజల తరఫున, ఎన్డీయేలో భాగస్వాములైన మూడు పార్టీల తరఫున ఘనస్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ‘ఆంధ్ర రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ వచ్చారు. మన కోసం, మన కష్టానికి భుజం కాయడానికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని వచ్చారు. జరుగబోయేది కురుక్షేత్రం. ఈ యుద్ధంలో ధర్మానిదే విజయం.. కూటమిదే పీఠం. నేను దేవదత్తం పూరించాను. అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ పాంచజన్యం పూరిస్తారు. 2014 బాలాజీ ఆశీస్సులతో సాధించిన విజయాన్ని మించిన ఘనవిజయాన్ని ఈసారి సాధిస్తున్నాం. బిడ్డలకు అండగా ఉండే దుర్గమ్మ తల్లి.. అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పెడుతుంది. అలాంటి తల్లి ఆశీస్సులతో మన ప్రభుత్వం స్థాపించే దిశగా వెళ్తున్నాం’ అని చెప్పారు. సీఎం జగన్‌, వైసీపీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారంటే..

ఏపీలో బ్లాక్‌ మనీ..

దేశాన్ని డిజలైజ్‌ చేద్దాం.. అవినీతిని తగ్గిద్దాం.. బ్లాక్‌ మనీని తగ్గిద్దామని మోదీ భావిస్తుంటే.. ఏపీలో మాత్రం బ్లాక్‌మనీ ఎక్కువైపోయింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజు సారా వ్యాపారిగా మారారు. ఒక్క సారా వ్యాపారంలోనే ఐదేళ్లలో రూ.1.13,583 కోట్ల మద్యాన్ని అధికారికంగా, అనధికారికంగా అమ్మారు. కానీ రూ.84,050 కోట్లు మాత్రమే అమ్మినట్లు చూపించారు. పది వేల కోట్ల రూపాయల జీఎస్టీ మోసం జరిగింది. ఇసుకను కూడా దోపిడీ చేశారు. జేపీ వెంచర్స్‌ సంస్థ ద్వారా బినామీలు రూ.40 వేల కోట్లు దోచుకుని, భారీ స్కాం చేశారు. అడిగిన వాళ్లను హింసించడంతో పాటు చిత్తూరు జిల్లాలో కిషన్‌ అనే రిపోర్టర్‌ని చంపేశారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా లేదు. రాష్ట్రమంతా గంజాయి నిండిపోయింది. ఏపీ మాదకద్రవ్యాలకు కొత్త రాజధానిగా మారిపోయింది. రాష్ట్రంలో 2019-21 నడుమ 30,196 మంది ఆడవాళ్లు అదృశ్యం అయ్యారు. కేంద్రమే రాజ్యసభలో చెప్పినా.. ఈ రాష్ట్రప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఒకవైపు విదేశీ సంస్థలు దేశానికి వస్తుంటే.. ఏపీకి రావలసినవి మాత్రం పారిపోతున్నాయి. అమర్‌రాజా, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, రిలయన్స్‌ ఎలక్ట్రిక్‌ యూనిట్‌.. ఇవన్నీ వెళ్లిపోయాయి. 2019లో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉంటే.. 2024 నాటికి మైన్‌సలోకి వెళ్లిపోయింది. నెగిటివ్‌ గ్రోత్‌లో వెళ్లిపోతోంది.

అడ్డూఅదుపు లేదని..

వైజాగ్‌ సంఘటన, ప్రతిపక్ష నాయకులపై ఎలాంటి దాడులు చేశారో చూశారు. వైసీపీ నాయకులు బీజేపీ కార్యకర్తల పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటకు తీశారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించారు. చంద్రబాబును అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారు. నన్నూ అనేక పర్యాయాలు అడ్డుకున్న ఈ ప్రభుత్వం పోవాలి. పోవాలంటే ప్రజలే పూనుకోవాలి. జగన్‌కు డబ్బులు పెరిగిపోయాయి.. అడ్డూ అదుపూ లేదని అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది.. వజ్రవైడూర్యాలతో ఉన్న పుష్పకవిమానం ఉంది. వీరులు, శూరులు.. మందీమార్బలం ఉన్నాయని.. నన్నేమి చేయగలరని అనుకున్నాడు. నార పంచె కట్టుకున్న, నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రంలో రామరాజ్యం స్థాపన జరగబోతోంది.

జగన్‌ అరాచకాల్ని తుంగలో తొక్కుదాం ఈ జనసంద్రాన్ని చూస్తుంటే జగన్‌పై ఏ స్థాయి వ్యతిరేకత ఉందో కళ్లకు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకే కూటమి ఏర్పడింది. ఐక్యంగా అడుగులు వేద్దాం. జగన్‌ అరాచకాన్ని తుంగలో తొక్కుదాం.

- కె.అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం..

ఐదేళ్లుగా ఆంధ్ర ప్రజలు పడుతున్న కష్టాలకు ముగింపు నినాదం ప్రజాగళం. ఇది నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి తీసుకున్న గళం. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనందరిదీ ఒకే పంతం. అదే జగన్‌ రెడ్డి పాలన అంతం.

- కొల్లు రవీంద్ర

ప్రతివర్గానికి ప్రజాగళం భరోసా

రాష్ట్రంలో ప్రతి వర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది. ప్రజా ప్రభుత్వంలో యువత, మహిళల కలలకు రెక్కలు తొడుగుతాం. ఐదేళ్లలో ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించుకుందాం. ఆగిపోయిన అమరావతిని పునర్నిర్మించుకుందాం. సువర్ణాంధ్రప్రదేశ్‌కు బాటలు వేద్దాం.

- లావు కృష్ణదేవరాయులు, నరసారావుపేట ఎంపీ

ఇది మరో కురుక్షేత్ర యుద్ధం

ఇది మరో కురుక్షేత్ర యుద్ధం. ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడింది. కూటమి తిరుగులేని విజయానికి బొప్పూడి సభ శుభసూచికగా నిలవబోతోంది. బొప్పూడి ఆంజనేయస్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగించబోయేది మనమే.

- ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి

ఐదేళ్ల దగాపై నిరసన గళం..

విముక్త ఆంధ్రప్రదేశ్‌ సాధనకు ఉమ్మడి నినాదం ప్రజాగళం. జగన్‌ ఐదేళ్ల దగాను నిరసిస్తూ ప్రారంభించిన గళం. జగన్‌ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మరో ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రమే లేకుండా చేస్తారు.

- నిమ్మల రామానాయుడు, టీడీపీ ఎమ్మెల్యే

గొడ్డలి వేటు వేసే వాళ్లకు గుండెపోటే!

గొడ్డలి పోటు వేసేవారికి ప్రజాగళం సభను చూసి గుండెపోటు తెప్పించాలి. దేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో నిలిపే మోదీ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రధాత, దార్శనికుడు చంద్రబాబు, విశ్వసనీయతకు మారుపేరైన పవన్‌ కల్యాణ్‌ త్రిమూర్తుల్లా ఒక వేదికపైకి రావడం వారికి వణుకు పుట్టించాలి. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన సాగుతోంది. హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి పరదాలూ, బారికేడ్ల మధ్య తిరుగుతున్నాడు.

- సత్యకుమార్‌, బీజేపీ నాయకుడు

వడ్డీతో తిరిగి చెల్లిస్తాం..

అక్కడ కేంద్రంలో మోదీ.. ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఐదేళ్లలో కార్యకర్తలను వేధించినవారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. అది అధికారులైనా, అధికార పార్టీలోవారైనా వదిలే ప్రసక్తే లేదు. ల్యాండ్‌, శాండ్‌, మైనింగ్‌ ఏదీ వదలకుండా దోపిడీ చేశారు. కక్షగట్టి కార్యకర్తలను వేధించారు. అవినీతి, వేధింపులకు పాల్పడిన వారినీ వదిలేది లేదు.

- సీఎం రమేశ్‌, బీజేపీ నాయకుడు

అరాచక పాలన అంతం బాధ్యత ప్రజలదే..

రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన అంతానికి ప్రజలే బాధ్యత తీసుకోవాలి. ప్రజలు ఎదుర్కొనే సమస్యల నుంచి బయట పడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అందుకోసం ప్రజలే బాబును గెలిపించుకోవాలి.

- నక్కా ఆనందబాబు, టీడీపీ

బీసీ సంక్షేమాన్ని జగన్‌ నాశనం చేశారు

జగన్‌ బీసీలకు 70 సీట్లు ఇచ్చేశామని చెబుతున్నారు. ఐదేళ్లలో ఏ ఒక్క బీసీ కులానికైనా న్యాయం చేసింది ఉందా? ఏవో కొంత మందికి సీట్లు ఇచ్చేస్తే అది సామాజిక న్యాయం అవుతుందా? ఐదేళ్లలో బీసీ సంక్షేమాన్ని జగన్‌ నాశనం చేశారు. బీసీ విద్యార్థులు చదువుకునే స్టడీ సెంటర్లను కూడా మూసివేశారు. విదేశీ విద్య పక్కన పెట్టారు. ప్రతివారికి కూడా నేను నొక్కాను.. నొక్కాను అంటూ చెబుతున్నారు. బీసీలకు న్యాయం చేశాను, ప్రజలంతా నా పక్కనే ఉన్నారన్న మాయమాటలను బీసీ సోదరులు నమ్మొద్దు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే పవన్‌ పొత్తులు పెట్టుకున్నారు.

- గాదె వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ నాయకుడు

ఐదేళ్లుగా అభివృద్ధి లేదు..

జగన్‌ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి లేదు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవు. పరిశ్రమలే కాదు చివరికి సరైన రోడ్లు కూడా లేవు. పోలవరం ముందుకు సాగలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేసిన ఘనత దుర్మార్గపు ముఖ్యమంత్రికే దక్కింది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ద్వారా మంచి పాలన అందించేలా చేసుకుందాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రజలంతా కలిసి ఎన్నుకోవాలి.

- బొమ్మిడి నాయకర్‌, నర్సాపురం జనసేన అభ్యర్థి

Updated Date - Mar 18 , 2024 | 04:08 AM