అదిగదిగో.. నవలోకం
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:44 AM
చిన్నచిన్న ఇసుక తిన్నెలతో ఉండే నవలంక నేడు పర్యాటక ప్రేమికులే ఆశ్చర్యపోయేలా సరికొత్త అందాలను సంతరించుకుంది.
ఆంధ్రజ్యోతి - అవనిగడ్డ: చిన్నచిన్న ఇసుక తిన్నెలతో ఉండే నవలంక నేడు పర్యాటక ప్రేమికులే ఆశ్చర్యపోయేలా సరికొత్త అందాలను సంతరించుకుంది. కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకటైన నాగాయలంకకు ఇటీవల వచ్చిన భారీ వరదల సమయంలో కృష్ణమ్మ గర్భం నుంచి సరికొత్త అందాలతో నవలంక పునరుద్భవించింది. ఉదయించే సూర్యకిరణాల వెలుగులో జిగెలుమనిపించే మెరిసే గడ్డిపూలు, కాసేపట్లో అస్తమించే సూర్యబింబిం ముందు మనల్ని పలకరించేందుకు వస్తున్నాయా అన్నట్టుండే సముద్రపు పక్షుల గుంపు మనల్ని చూపుతిప్పుకోనివ్వవు. ముఖ్యంగా సూర్యాస్తమ మనోహర దృశ్యాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే నాగాయలంక శ్రీ రామపాదక్షేత్రం సమీపంలోని ఈ నవలంక దీవి ఉంది. ప్రకృతి రమణీయ అందాలతో తులతూగే నవలంకను సందర్శించాలంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి అవనిగడ్డ మీదుగా నాగాయలంక ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. కరకట్ట ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కితే విజయవాడ, రామలింగేశ్వర నగర్ దాటిన దగ్గర నుంచి పులిగడ్డ వరకు దాదాపు 60 కిలోమీటర్ల పొడవున వివిధ పంటలతో లంక భూములు కనువిందు చేస్తాయి. పచ్చని చెట్లతో ఆకాశానికి కప్పు వేశారా అన్నట్లు కరకట్ట పొడవునా ఇరువైపులా కనిపించే చెట్లు పర్యాటకులకు కొత్త అనుభూతులు మిగులుస్తున్నాయి. కరకట్ట ప్రయాణంతో అవనిగడ్డ మీదుగా నాగాయలంక చేరుకొంటే బస్సు దిగిన దగ్గర నుంచి కేవలం అర కిలోమీటరు దూరంలోనే శ్రీరామపాదక్షేత్రం ఘాట్ వస్తుంది. ఈ ఘాట్ వద్ద నుంచి స్థానిక మత్స్యకారులు తమ పడవల్లో పర్యాటకులను నది మధ్యలో అందంగా కనిపించే నవలంకకు తీసుకెళ్తారు. ఇందు కోసం వారు రూ.300-400 వరకు చార్జ్ చేస్తారు. అయితే నవలంక అందాలు పూర్తిస్థాయిలో ఆస్వాఽధించాలంటే సాయంత్రం 4 గంటల సమయం దాటితేనే కాని కుదరదు. కాబట్టి ఈ అంతకంటే ముందు ఈ ప్రాంతానికి వస్తే మాత్రం అవనిగడ్డ లంకమ్మ అమ్మవారిని, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని (గాలిగోపురంగుడి) ద ర్శించుకుని సాయంత్రం సూర్యాస్తమ సమయానికి నాగాయలంక చేరుకుని నవలంక అందాలు ఆస్వాదించవచ్చు. పులిగడ్డ వద్ద కృష్ణానది రెండుగా చీలి ఒక పాయ హంసలదీవి సమీపంలో సాగరంలో సంగమిస్తే, మరో పాయ వేణీ నదిగా మారి నాగాయలంక దిగువన సాగురుడితో సంగమిస్తుంది. అందుకే నాగాయలంక శ్రీరామపాదక్షేత్రాన్ని వేణీ సంగమ క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ నది అంచున నిర్మించిన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం, కనకదుర్గమ్మవారి ఆలయం, సత్యనారాయణ స్వామి ఆలయం, రాముల వారి ఆలయం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, పునర్నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంతో ఆధ్యాత్మిక ఆరాధికులను ఆకట్టుకుంటాయి.
కొత్త సోయగాలతో..
ఇటీవల వచ్చిన వరదల అనంతరం కొత్తగా ఏర్పడిన ఇసుక తిన్నెల అందాలను వీక్షించేందుకు చుట్టు పక్క ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ప్రభుత్వ స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది.
మండవ బాలవర్థిరావు, మాజీ సర్పంచ్
ప్రకృతి సిగలో.. ఆధ్యాత్మిక శోభ
శ్రీరామపాదక్షేత్రం ఘాట్ ప్రకృతి సోయగాలకు, ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం. ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం కొత్తకొత్త అందాలను ఆవిష్కరిస్తుంది. ఇక్కడి ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి.
ఆలూరి శ్రీనివాసరావు, ఛైర్మన్, శ్రీరామపాదక్షేత్రం అభివృద్ధి కమిటీ
సెలవులు వచ్చాయంటే పర్యాటక కళ
సెలవులొస్తే చుట్టుపక్క ప్రాంతాల నుంచి వచ్చేవారితో పాటు ఈ ప్రాంతం గురించి పరిచయం ఉన్నవారితో శ్రీరామపాదక్షేత్రం ఘాట్ కళకళలాడుతుంది. వరదల అనంతరం నవలంక ఇసుక మెటలతో ఎత్తు పెరిగింది. ఈ ఇసుక తిన్నెలు చూసేందుకు, అందులో ఆడుకునేందుకు వచ్చే యువత ఎక్కువ.
నాగిడి పోతురాజు, స్థానిక మత్స్యకారుడు