Share News

ఆదమరిస్తే అంతే!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:26 AM

‘మీ భూమికి మా హామీ. మీ భూమికి జగనన్న రక్ష. జగన్న శాశ్వత భూ హక్కు.. భూ రక్ష’ జగన్‌ సర్కారు రైతులకు ఇస్తున్న హామీలివి.

ఆదమరిస్తే అంతే!

టైటిల్‌ చట్టంతో భూములకు ముప్పు

రైతులు అప్రమత్తంగా ఉండాల్సిందే

సర్కారు మాట నమ్మితే గజమూ మిగలదు

ఎవరి భూమికి వారే కాపలాదారు

రీ సర్వే రికార్డులన్నీ తప్పుల మయం

జగన్‌ సర్కారు హడావుడితో చిక్కులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మీ భూమికి మా హామీ. మీ భూమికి జగనన్న రక్ష. జగన్న శాశ్వత భూ హక్కు.. భూ రక్ష’ జగన్‌ సర్కారు రైతులకు ఇస్తున్న హామీలివి. భూముల సమగ్ర సర్వే చేపట్టి, రికార్డులను తాజాపరిచి రైతులకు ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు (టైటిల్‌ చట్టం) ద్వారా శాశ్వత హక్కులు కల్పిస్తామని గత నాలుగున్నరేళ్లుగా చెబుతోంది. ఇవన్నీ పచ్చిమోసకారి మాటలే. రైతు వీటిని నమ్మి, తన భూమికి ఏం కాదని ఆద మరిస్తే అంతే సంగతులు. గజం భూమి కూడా మిగలదు. రాత్రికి రాత్రే ఓ రైతు భూమి మరొకరి పేరిట మారిపోతుంది. రాత్రికి రాత్రే నిషేధిత భూముల జాబితాలో కలిసిపోతుంది. ఎందుకంటే.. టైటిల్‌ చట్టం అమలు కోసం చేపట్టిన భూముల సర్వే, రికార్డుల తయారీ అంత ఘోరంగా, అధ్వానంగా ఉంటోంది. భూ యజమానుల ప్రమేయం లేకుండానే భూముల సర్వే సాగుతోంది. భూమి రికార్డుల తయారీలో అడ్డగోలు తప్పులొస్తున్నాయి. వాటిని చడీచప్పుడు లేకుండా ఆమోదిస్తూ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తున్నారు. ఆ రికార్డులనిండా జగన్‌ బొమ్మలే. ఆ రికార్డుల ఆధారంగానే రైతులకు టైటిల్‌ గ్యారెంటీ ఇస్తారు. ఈ ఘోరాలపై జగన్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన, జగనన్నకు చెబుదాం, ఇంకా పలు వేదికల ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా అంతా గప్‌చుప్‌. రీ సర్వే రిపోర్టుల్లో తప్పుల గురించి, పాస్‌పుస్తకాల్లో లోపాల గురించి ఎక్కడా మాట్లాడవద్దని ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.


పైలెట్‌లోనే ఫెయిల్‌

భూముల సమగ్ర సర్వేకు జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష అనే పేరు పెట్టారు. సర్వే పూర్తయ్యాక రైతులకు శాశ్వత టైటిల్‌ (యాజమాన్య హక్కు) ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తీసుకొచ్చేందుకు 2019లో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించారు. అది 2023 దాకా అమలు కాలేదు. అయితే ఈ టైటిల్‌ చట్టం అమలుకు ముందే రాష్ట్రంలో ఉన్న భూ వివాదాలన్నింటిని పరిష్కరిస్తామని, ఇందుకోసం సమగ్ర భూ సర్వే చేస్తామని సర్కారు చెప్పింది. సమగ్ర భూ సర్వేకు జగన్‌ పేరు పెట్టడం దగ్గరి నుంచి ఇతర కీలక పనులను హేతుబద్ధత లేకుండా చేపట్టారు. 2019 డిసెంబరులో భూముల సర్వేలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలెట్‌ రీ సర్వే చేశారు. గ్రామ అడంగల్‌ ప్రకారం 150 సర్వే నెంబర్లలో 1539 ఎకరాల భూమి ఉంది. ఆధునిక టెక్నాలజీ జగనన్న రక్ష పేరిట రీ సర్వే చేసిన ప్రభుత్వం సర్వే నెంబర్లను 631కి పెంచింది. మొత్తం 1539 ఎకరాలుగా ఉన్న భూమిని 1533.36 ఎకరాలకు తీసుకొచ్చింది. అంటే.. ఉన్న భూమిలోనే 5.64 ఎకరాలు తగ్గించి చూపించింది. మరి ఆ భూమి ఎక్కడికి వెళ్లిందో తేల్చనే లేదు. పైలెట్‌ నివేదిక ప్రకారం సర్వేలో గరిష్ఠంగా 2.10 ఎకరాలపైనే తేడా వచ్చినట్లు గుర్తించారు. అడంగల్‌లో ఉన్న రికార్డు, రీ సర్వే రికార్డుకు పొంతన లేదు. 71 సర్వే నెంబర్లలో భూముల విస్తీర్ణంలో తేడాలు వచ్చాయి. ఫైలెట్‌ దశలోనే విఫలమైన ప్రభుత్వం రెగ్యులర్‌ సర్వే ఎలా చేస్తుందని మొదట్నుంచీ ‘ఆంధ్రజ్యోతి’ అనేక సందర్భాల్లో కథనాలు ప్రచురించింది.

మొక్కుబడిగా భూముల కొలతలు

పైలెట్‌ దశలోనే సరిగ్గా సర్వే నిర్వహించలేని సర్కారు... రాష్ట్రంలోని 17,583 గ్రామాల్లో భూముల సర్వే చేపట్టింది. సర్వే ఆఫ్‌ ఇండియాతో డ్రోన్‌ సర్వే కోసం ఒప్పందం చేసుకుంది. భూముల సర్వేను శరవేగంగా చేపట్టాలని, 2023 నాటికి పూర్తిచేయాలని షరతులు విధించింది. ఆ తర్వాత ఆ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకొంది. సర్వేను మధ్యలో ఆపేస్తే పరువు పోతుందనే భయంతో... గ్రామ సర్వేయర్లతోనే భూముల కొలతలు చేపట్టారు. సర్వేకు అనుసరించాల్సిన పద్ధతులను పాటించకుండా... హడావుడిగా ఈ ప్రక్రియను నడిపిస్తున్నారు. కొన్నిరోజులు డ్రోన్లతో సర్వే అన్నారు. ఆ తర్వాత విమానాలతో ఫొటోలు అన్నారు. చివరకు ఆర్థోరెక్టిఫైడ్‌ చిత్రాలను తీసి వాటి నుంచి భూముల చిత్రపటాలు తీశారు. రైతులను భాగస్వామ్యం చేయలేదు. నేరుగా భూమి చిత్రపటాలను గ్రామంలోకి తీసుకెళ్లి రైతులతో బలవంతపు సంతకాలు తీసుకున్నారు. ఆ నోటీసులు, చిత్రపటాల్లో ఏముందో రైతులకు తెలియనే లేదు. చివరకు పాస్‌పుస్తకాలు వచ్చేవరకు తమ భూమి సంగతేమిటో తెలుసుకోలేకపోయారు. డ్రోన్‌లు తీసిన ఫొటోల (ఆర్థోరెక్టిఫైడ్‌ ఇమేజెస్‌) నుంచి గ్రామాల వారీగా భూమి పటాలు తీసి, వాటి ఆధారంగా రైతుల భూముల చిత్రపటాలను తయారు చేశారు. అవఇ సరైనవే అని రైతులతో సంతకాలు తీసుకున్నారు. రైతుల సమక్షంలో సర్వే చేసి రికార్డులు తయారు చేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ. కేవలం ఆఫీసుల్లో కూర్చొనే సర్వే రికార్డులు, చిత్రపటాలు తయారు చేసి, 13 నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందు రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు.


రికార్డుల నిండా తప్పులే

దశలవారీగా రీ సర్వేను పూర్తి చేశామంటూ సర్కారు గొప్పలు చెబుతూ కొత్తగా పాస్‌పుస్తకాలు జారీ చేసింది. రైతుల భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్‌ స్థానంలో కొత్తగా ఇచ్చిన ల్యాండ్‌పార్సిల్‌ నెంబర్‌లలో తప్పులు దొర్లాయి. ఉదాహరణకు తిరుపతి సమీపంలో ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌కు నాలుగు ఎకరాల భూమి ఉందనుకుందాం. ఆ పక్కనే మరో మహిళా రైతుకు 1.54 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే తర్వాత ఆ మహిళా రైతు ఖాతాలో ఐదు ఎకరాల భూమిని చూపించారు. రిటైర్డ్‌ ఇంజనీర్‌కు ఉన్న భూమిలో కొంత తగ్గించారు. ఇదేమిటని ఆయన గగ్గోలు పెడితే ఇప్పుడేమీ చేయలేమని సర్వే అధికారులు చేతులెత్తేశారు. కేవలం ఇదొక ఉదాహరణ మాత్రమే. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఇచ్చిన పాస్‌పుస్తకాల్లోనూ భూముల విస్తీర్ణంలో తప్పులు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి రికార్డుల ఆధారంగానే టైటిల్‌ కల్పిస్తామని సర్కారు చెబుతోంది. వాటిని నమ్మి రైతులు టైటిల్‌ తీసుకుంటే నిండా మునిగిపోయే ప్రమాదం ఉంది.

Updated Date - Apr 25 , 2024 | 04:26 AM