Share News

రోడ్ల రక్తదాహానికి అంతేదీ!

ABN , Publish Date - May 29 , 2024 | 04:15 AM

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రాంతం, వాహనం, సమయంతో సంబంధం లేకుండా పగలు, రాత్రి, వేకువజామున.. ఎప్పుడుపడితే అప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి.

రోడ్ల రక్తదాహానికి అంతేదీ!

రాష్ట్రంలోని రహదారులకు కొన్ని రోజులుగా రక్తదాహం ఎక్కువైంది! ప్రయాణం కోసం రోడ్డెక్కిన వారిని అమాంతం మింగేస్తున్నాయి. వారిపై ఆధారపడిన కుటుంబాలను చిదిమేస్తున్నాయి. గోతులమయమై, పూర్తిగా ధ్వంసమైన రోడ్లు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతి వేగం, నిద్ర మత్తు, ప్రభుత్వ అలసత్వం.. ఇలా కారణాలు ఏవైతేనేం బయటికి వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగొస్తాడనే నమ్మకం సడలుతోంది. పోలీసు, రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగటున రోజుకు 50కి పైగా ప్రమాదాలు, 20కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు అంతం కాదు కదా.. కనీసం అదుపు చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించడం లేదు.

రాష్ట్రంలో రోజుకు 50 ప్రమాదాలు.. 20 మరణాలు

ధ్వంసమైన రోడ్లు, అతివేగం, నిర్లక్ష్యమే కారణాలు

అయిన వారిని కోల్పోయి విషాదాల్లో కుటుంబాలు

కార్లు, బైకులు, బస్సులు, ఆటోలు.. ఏవీ సురక్షితం కాదు

రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టని ప్రభుత్వం

కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీలోనూ పెరిగిన ప్రమాదాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రాంతం, వాహనం, సమయంతో సంబంధం లేకుండా పగలు, రాత్రి, వేకువజామున.. ఎప్పుడుపడితే అప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతులమయమైన రాష్ట్ర రోడ్లు నరకానికి బాటలు వేస్తుంటే.. వేగానికి బాటలైన జాతీయ రహదారులు రెప్పపాటులో వాహనాలను తలకిందులు చేస్తున్నాయి. మరోవైపు రాంగ్‌ రూట్లో వస్తున్న వాహనాలు మృత్యువులా మీదపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రమాదాలను కట్టడి చేయాల్సిన పోలీసులను సైతం రహదారులు బలిగొంటున్నాయి. రాష్ట్రంలో ఈ రోడ్డు ప్రమాదాలను అదుపు చేసే పరిస్థితి కనిపించడంలేదు. బడ్జెట్‌లో రూ.135 కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కనీసం పావలా వంతు కూడా ఖర్చు చేయలేదు. పోలీసు, రవాణా, రెవెన్యూ, విద్యా, వైద్య శాఖలు ఉమ్మడిగా చర్యలు చేపట్టింది కూడా లేదు. విధి నిర్వహణలో తమ సిబ్బందిని కోల్పోయినప్పటికీ పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల కట్టడి అంశాన్ని సీరియ్‌సగా తీసుకోవడం లేదు. ఫలితంగా బైకులు, లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, ఆఖరికి ట్రాక్టర్లు... దేనిలో ప్రయాణించినా సురక్షితంగా గమ్యం చేరుతామనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ప్రయాణికులకు సురక్షితం అనే పేరున్న ఆర్టీసీలోనూ డొక్కు బస్సుల వల్ల ప్రమాదాల సంఖ్య పెరిగింది.

లారీలు ఆగినా అడ్డుకోరా..

జాతీయ రహదారులపై రోడ్డు పక్కన ఆగిన లారీలను వెనుక నుంచి ఢీ కొట్టి ఎక్కువ కార్లు ప్రమాదాలకు గురయ్యాయి. వాటిని ఎక్కడ బడితే అక్కడ ఆపకూడదు. ఒకవేళ బండి రిపేర్‌ వస్తే రోడ్డు పక్కన ఆపి.. డేంజర్‌ సిగ్నల్స్‌ వేయాలి. లేదంటే బారికేడ్లు, ట్రాఫిక్‌ కోన్లు అడ్డు పెట్టాలి. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు వీటిపై దృష్టి పెట్టరు. టోల్‌ ఫీజు వసూలు చేసే కాంట్రాక్టరు ఆ వాహనాన్ని తరలించేందుకు టోయింగ్‌ క్రేన్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఎక్కడా టోల్‌ గేట్ల పక్కన ఇలాంటి టోయింగ్‌ వాహనాలు కనిపించవు. ఇదంతా ఒక ఎత్తయితే లారీలకు వెనుక రిఫ్లెక్ట్‌ స్టిక్కర్లు ఉండాలి. అవి పూర్తిగా ఉండవు.. ఉన్నా లోడు లారీ టార్పాలిన్‌ దానిపై కప్పేసి ఉంటుంది. ఆగిన లారీలను ఢీ కొట్టడానికి ఇది కూడా ప్రధాన కారణం. టోల్‌ గేట్‌ దగ్గర పోలీసులు, చెక్‌ పోస్టుల దగ్గర ఆర్టీఏ సిబ్బంది ఈ చర్యలు తీసుకోవడం కన్నా మామూళ్ల వసూళ్లలోనే ఎక్కువ శ్రద్ధ పిస్తుంటారు.

ప్రమాదాలకు కారణాలు...

జాతీయ రహదారులపై వాహనాల అతివేగమే ఎక్కువ ప్రమాదాలకు కారణమని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. నిద్రమత్తు, నిర్లక్ష్యం మరో కారణంగా తెలుస్తోంది. అయితే వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. గంటకు 80 కి.మీ. దాటి వాహనం నడపరాదన్న నిబంధన అమలు చేసేందుకు హైవే పెట్రోలింగ్‌ పోలీ్‌సతోపాటు రవాణా శాఖ వేగ నియంత్రణ యంత్రాలను అక్కడక్కడా అమర్చి అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేది. ఇప్పుడు జాతీయ రహదారులపై అలాంటివి ఎక్కడా కనిపించడంలేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఇటీవల ఎక్కడా కనిపించడంలేదు. గత ప్రభుత్వంలో ‘వాష్‌ అండ్‌ గో’ అనే కార్యక్రమం ద్వారా పోలీసులు రాత్రుల్లో హైవేలపై వాహనాలు ఆపి డ్రైవర్‌ ముఖం కడుక్కున్నాకే బండి కదలనిచ్చేవారు. అనంతపురం జిల్లాలో ఎస్‌వీ రాజశేఖర్‌ బాబు, జీవీ అశోక్‌ కుమార్‌ ఎస్పీలుగా ఉన్నప్పుడు కొనసాగిన ఈ ప్రక్రియ అప్పట్లో రాష్ట్రమంతా పోలీసుశాఖ అమలు చేసింది. అప్పట్లో ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య డ్రైవర్లకు ఫ్లాస్క్‌లు కొనిచ్చి నిద్ర వస్తే టీ తాగాలని స్వయంగా చెప్పేవారు.

అధికారుల చర్యలు శూన్యం..

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్ల ప్రవర్తనే కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేగంగా వెళితే ప్రమాదాలు జరుగుతాయి.. అనూహ్యంగా ఏదైనా అడ్డొస్తే బండిని అదుపు చేయడం కష్టమని తెలిసినా త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆత్రుతతో డ్రైవర్లు వేగంగా బండి నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ తరహా ప్రమాద బాధితుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహన దారులు ఉండగా.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నామనే సృహ కోల్పోతున్న పాదాచారులు.. మద్యం సేవించి వాహనం నడిపే వారు ఉన్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు రవాణా, పోలీసు శాఖలు ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం బటన్‌ నొక్కడం మినహా దేనికీ రూపాయి ఇవ్వక పోవడంతో అవన్నీ ఆపేసినట్లు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రవాణాశాఖకు విడుదల చేయాల్సిన నిర్వహణ నిధులు కూడా ఇవ్వక పోవడంతో ఆన్‌లైన్‌ సేవలు సైతం ఆగిపోయాయని అధికారులు వాపోతున్నారు.

Updated Date - May 29 , 2024 | 04:15 AM