Share News

AP News: నెలన్నరగా కనిపించని ఆచూకీ.. సొంత నియోజకవర్గానికి దూరం

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:31 AM

అతి త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక హడావుడి... వేడి బాగా పెరిగిపోయింది. సిటింగ్‌లు, ఆశావహులూ బిజీ బిజీ! కానీ..

AP News: నెలన్నరగా కనిపించని ఆచూకీ.. సొంత నియోజకవర్గానికి దూరం

నెలన్నరగా కనిపించని ఆచూకీ

సొంత నియోజకవర్గానికి దూరం

‘డబ్బుల్లేవ్‌, పోటీ చేయను’ అని

వైసీపీ పెద్దలకు వర్తమానం

గతంలో టీడీపీలోనూ ఇదే వ్యూహం

ఆర్థిక సమస్యలా.. ఓటమి భయమా?

(అమరావతి/విజయవాడ - ఆంధ్రజ్యోతి)

అతి త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక హడావుడి... వేడి బాగా పెరిగిపోయింది. సిటింగ్‌లు, ఆశావహులూ బిజీ బిజీ! కానీ... ఒక ఎమ్మెల్యే మాత్రం పత్తాలేకుండా వెళ్లిపోయారు. ఒకరోజో రెండు రోజులో కాదు... దాదాపు నెలన్నరగా ఆయన ఆచూకీ గల్లంతైంది! విజయవాడ సమీపంలోనే... జాతీయ రహదారిపైనే ఉన్న ఆ నియోజకవర్గం స్టేట్‌లోనే బాగా ఫేమస్‌! ఆ ఎమ్మెల్యే మరింత ఫేమస్‌! అయితే... గత నెలన్నరగా నియోజకవర్గ ప్రజలకు ఆయన కనిపించడంలేదు. పొరుగు రాష్ట్రంలోనే మకాం వేశారు.

డబ్బుల్లేవంట...

కొద్ది రోజులక్రితం ఆ నియోజకవర్గ పరిధిలోని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి ఏదో విషయమై ఆ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేశారు. ‘అధికార పార్టీ’ ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పబోయారు. కానీ... ఆ ఎమ్మెల్యే సదరు అధికారికి షాక్‌ తినిపించారు. ‘ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నియోజకవర్గ వ్యవహారాలతో నాకు పనేమీ లేదు. నాకు ఫోన్‌ చేయాల్సిన అవసరం లేదు’ అని ముక్కుసూటిగా చెప్పేశారు. దీంతో కంగారుపడిన ఆ అధికారి వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ చెవిన వేశారు. ఎస్పీ కూడా క్షణం ఆలస్యం చేయకుండా ఉన్నతాధికారులకు చెప్పేశారు. ఇది తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి ఆ ఎమ్మెల్యేకు పలుమార్లు ఫోన్లు చేశారు. కానీ... ఆ ఎమ్మెల్యే వాటిని తీయలేదు. ఆర్థికంగా తన పరిస్థితి బాగోలేదని, అందువల్ల తాను ఈసారి పోటీ చేయలేనని... అందుకే నియోజకవర్గానికి కూడా వెళ్లడం లేదని ఆ ఎమ్మెల్యే అధికార పక్ష ప్రముఖులు కొందరికి చెప్పినట్లు సమాచారం.

అప్పుడూ అదే ఎత్తుగడ!?

నియోజకవర్గంలో భారీగా డబ్బు వెదజల్లుతాడని గతంలో ఆయన తనకు తనే ప్రచారం కల్పించుకున్నారు. ఏదైనా గ్రామానికి వెళ్తే పక్కన ఒక అనుచరుడిని పెట్టుకొనేవారు. అతని భుజానికి ఒక బ్యాగు తగిలించేవారు. ఆ గ్రామంలో ఎవరు ఏ ఇబ్బంది చెప్పినా వెంటనే ఆ బ్యాగులో నుంచి ఐదు వేలో పది వేలో తీసి ఇచ్చేసేవారు. ‘ఉదార స్వభావి’ అని పేరు తెచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచార పర్వాన్ని బహిరంగంగా నిర్వహించేవారు. కానీ... గత కొన్ని నెలలుగా ఈ పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఆయన అసలు నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. ఇది నిజమైన ఆర్థిక సమస్యా లేక ఒత్తిడి పెట్టి ఆర్థిక సాయాన్ని సాధించుకొనే వ్యూహమా... అనే సందేహాలూ ఉన్నాయి. ఎందుకంటే... గతంలో తెలుగుదేశం పార్టీ వద్ద కూడా ఆయన ఇదే తరహా ఎత్తుగడ వేశారు. పోయిన ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు ఆయన టీడీపీ అధినాయకత్వాన్ని కలిశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, వేరే అభ్యర్థిని చూసుకోవాలని కోరారు. ఇదేమిటని విస్తుపోయిన పార్టీ నాయకత్వానికి తన బాధలు చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో నాకు విలువైన భూమి ఉంది. అక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమని అందులో బోర్డు పెట్టేసింది. ఇప్పుడు దానిని కొనేవారు లేరు. నా పరిస్థితి దివాలా తీసినట్లుగా అయిపోయింది. రూపాయి కూడా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అందుకే తప్పుకొంటున్నాను’’ అని ఆయన వివరించారు. దీంతో టీడీపీ పెద్దలు కరిగిపోయారు. ‘‘బాధ పడొద్దు. ఏదో ఒక మార్గం చూస్తాం’’ అని ఆయనను సముదాయించి పోటీకి ఒప్పించారు. ఎన్నికల్లో ఖర్చు కోసం భారీ మొత్తం ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అచ్చంగా అదే వ్యూహాన్ని వైసీపీలో అమలు చేస్తున్నారని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొందరు దీనికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఈసారి ఆయన విజయావకాశాలు బాగా తగ్గిపోయాయని, ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉంటానని చెబుతున్నారన్నది వారి కథనం.

Updated Date - Feb 01 , 2024 | 10:03 AM