Share News

అంటే.. ఎన్డీయేకే జగన్‌ జై!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:33 AM

విశాఖ స్టీల్‌ప్లాంటు కార్మిక సంఘాల నాయకులకు సీఎం జగన్‌ పెద్ద ఝలక్‌ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరగా, ఆయన విచిత్రమైన సమాధానం ఇచ్చారు.

అంటే.. ఎన్డీయేకే జగన్‌ జై!

ఉక్కు కార్మికులతో భేటీలో పరోక్షంగా అంగీకారం

ఎన్డీయేకు మెజారిటీ సీట్లు రాకపోతే వైసీపీ ఎంపీల మద్దతు

అప్పుడు ఉక్కు సమస్య పరిష్కారానికి అవకాశం.. కార్మిక నేతలతో జగన్‌ వ్యాఖ్యలు

స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందా అని అమాయక ప్రశ్న!.. గనుల రెన్యువల్‌కు నిరాకరణ

విద్యుత్‌ బిల్లుల చెల్లింపు గడువుకూ హామీ ఇవ్వని వైనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంటు కార్మిక సంఘాల నాయకులకు సీఎం జగన్‌ పెద్ద ఝలక్‌ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరగా, ఆయన విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 230-240 కంటే ఎక్కువ సీట్లు రాకూడదని ప్రార్థన చేయండి. అప్పుడు వైసీపీ మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’’ అని జగన్‌ సెలవిచ్చారు. తద్వారా కేంద్రంలో ఎన్డీయేకే తన మద్దతు ఉంటుందనే విషయాన్ని సూటిగా చెప్పేశారు. గత ఎన్నికల సమయంలో 25 ఎంపీ సీట్లు తనకు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తానని చెప్పిన జగన్‌, ఆ తర్వాత మాత్రం.. ‘దేవుడి దయ మనకు లేదు. కేంద్రంలో బీజేపీకి మన అవసరం లేకుండా పోయింది’ అని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పాట పాడటం గమనార్హం. తమ సమస్యలు పరిష్కరించాలని వచ్చిన ‘ఉక్కు’ కార్మికులతో.. ‘స్టీల్‌ ప్లాంటు నష్టాల్లో ఉందా?’ అని చిత్రంగా ప్రశ్నించారు. వాస్తవానికి గత రెండ్రోజులుగా విశాఖ పర్యటనలో ఉన్న ఆయన, స్టీల్‌ప్లాంటు సమస్యపై గానీ, అదానీ గంగవరం పోర్టులో కార్మికుల సమ్మెపై గానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎన్నికల సమయం కావడం, స్టీల్‌ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు ఓట్లు కలిపి 50 వేలకుపైగా ఉండడం, ఇప్పుడు వారి సహకారం అవసరం కావడంతో వైసీపీ నాయకులు.....సీఎంతో భేటీకి ఉక్కు సంఘాల నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించారు. అన్ని కార్మిక సంఘాలకు చెందిన 20 మంది నాయకులు మంగళవారం ఉదయం ఎండాడలో బస వద్ద జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం పరిష్కరించదగిన సమస్యలనే వారు ప్రస్తావించారు. విజయనగరం జిల్లా గర్భాంలో మాంగనీస్‌ గనులను, పక్కనే సారిపల్లిలో ఇసుక గనుల లీజు కాలం ముగిసిపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని రెన్యువల్‌ చేయడం లేదు. వాటిని త్వరగా రెన్యువల్‌ చేయాలని నాయకులు కోరగా, వాటిని రెన్యువల్‌ చేయలేమని పరోక్షంగా స్పష్టంచేశారు. బొగ్గు కొరత వల్ల తాము ప్రతి నెల 80 కోట్ల నుంచి రూ.90 కోట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నామని, అందుకు ఏ నెలకా నెల చెల్లించాలని ఈపీడీసీఎల్‌ నోటీసులు ఇస్తూ ఒత్తిడి పెడుతోందని, వాటిని వాయిదాలో చెల్లించడానికి అనుమతించాలని ఉక్కు నాయకులు కోరారు. దానికీ సీఎం నిరాకరించారు. ‘డిస్కమ్‌లకు రూ.లక్ష కోట్ల అప్పులు ఉన్నాయి. మీరు కాకపోతే బిల్లులు సకాలంలో ఇంకెవరు కడతారు?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయని, ఈ నెల 50 శాతం జీతాలే ఇచ్చారని, సంస్థ నష్టాల్లో ఉందని నాయకులు వివరించగా....జగన్‌ స్టీల్‌ ప్లాంటు నష్టాల్లో ఉందా? అంటూ రెండు మూడుసార్లు రెట్టించి అడిగారు. దాంతో నాయకులు అవాక్కయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తరువాత వరుసగా నష్టాలు వస్తున్నాయనీ, ఇప్పటికి రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉంటే..ఆ విషయమే తెలియదన్నట్టుగా జగన్‌ మాట్లాడడం వారు జీర్ణించుకోలేకపోయారు.

వైసీపీని గెలిపించాలి...

‘‘స్టీల్‌ప్లాంటు సమస్యలు పరిష్కారం కావాలంటే...మీరు ఎన్డీయే అభ్యర్థులను ఓడించాలి. ఎన్డీయేకు మెజార్టీ సీట్లు రాకపోతే వైసీపీ ఎంపీల మద్దతు అవసరమవుతుంది. అలా జరిగితే... ఒడిశా నుంచి ఐరన్‌ఓర్‌ సరఫరాకు ఏకంగా పైపులైన్‌ వేయించేస్తా’’ అని జగన్‌ అన్నారు. ఇదంతా ‘చేతిలో ఉన్న చిల్లిగవ్వ ఇవ్వడుగానీ బంగారం ముద్దలు పెడతాడంటా’ అన్నట్లుగా ఉందని కార్మిక నేతలు వెనుదిరిగారు.

స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నేతలు: ‘విజయనగరం జిల్లా గర్భాంలో మాంగనీస్‌ గనులను, పక్కనే సారిపల్లిలో ఇసుక గనుల లీజు కాలం ముగిసిపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని రెన్యువల్‌ చేయడం లేదు. వాటిని త్వరగా రెన్యువల్‌ చేయండి’.

సీఎం జవాబు: ‘నాకు సిమెంట్‌ ప్లాంటు ఉంది. అందులో జిప్సం 0.5 శాతం నుంచి 1 శాతం వాడతాను. అలాగే మీరు స్టీల్‌ తయారీలో ఐరన్‌ఓర్‌ 98 శాతం వాడుతూ, మిగిలిన ముడిపదార్థాలు రెండుశాతం వాడతారు. కాబట్టి మీరు ఐరన్‌ఓర్‌ గనులపై దృష్టిపెట్టండి. వీటి సంగతి మరిచిపోండి’.

Updated Date - Apr 24 , 2024 | 03:33 AM