Share News

ఆ ఐపీఎస్‌.. వైసీపీ ఫ్యాన్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:33 AM

హోదా.. ఐపీఎస్‌. కానీ అధికార పార్టీకి వీర భక్తుడనే పేరుంది. ఎక్కడ పని చేసినా స్వామి భక్తి ప్రదర్శిస్తారని చెబుతారు.

ఆ ఐపీఎస్‌.. వైసీపీ ఫ్యాన్‌

సీమలో పెద్దిరెడ్డికి.. రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్‌

క్రాంతి రాణా వ్యవహారంపై ఐపీఎస్‌లలో చర్చ

‘తిరుపతి’లో వైసీపీ విజయానికి తోడ్పాటు

కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు

విజయవాడలో అధికార పార్టీ వారికి వత్తాసు

టీడీపీ నేతలపై దాడులు చేసినా చర్యలు అంతంతే

అసోసియేషన్‌లోనూ ఏకపక్ష వ్యవహార శైలి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

హోదా.. ఐపీఎస్‌. కానీ అధికార పార్టీకి వీర భక్తుడనే పేరుంది. ఎక్కడ పని చేసినా స్వామి భక్తి ప్రదర్శిస్తారని చెబుతారు. ఆయనే.. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా. రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన ‘పనితీరు’ గురించి ఐపీఎస్‌ వర్గాలు కథలు కథలుగా చెబుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఐపీసీ కన్నా వైసీపీ చట్టానికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అనంతపురం డీఐజీగా క్రాంతి రాణా పనిచేశారు. అప్పట్లో చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటించేవారనే విమర్శలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను డీఐజీ హోదాలో అడ్డుకోవాల్సింది పోయి వంతపాడారనే పేరుంది. అనంతపురం నుంచి వాహనాల్లో వైసీపీ కార్యకర్తల్ని తీసుకెళ్లి కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయిస్తే.. కట్టడి చేయాల్సిన డీఐజీ వారికి సహకరించారనే ఆరోపణలున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ దొంగ ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ నేతలు తమిళనాడుకు చెందినవారిని బస్సుల్లో తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త వ్యక్తులు ఎవరని డీఐజీ కనీసం ఆరా తీయలేదు. నాటి తిరుపతి ఎస్పీ వెంకటప్పలనాయుడు తనిఖీలకు వెళుతుంటే.. ‘వద్దు వద్దు.. నాతో ఉండు’ అంటూ రాణా ఆపారని ఐపీఎ్‌సలు చెబుతారు. ఆయనకు వైసీపీ పెద్దలు సిఫారసు చేసి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పోస్టు ఇప్పించారు. ఓ మాజీ డీజీపీ, ప్రకాశం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి మద్దతుతో విజయవాడలో పాగా వేశారు.

సారు తీరే వేరు

విజయవాడలో టీడీపీ మహిళా కార్పొరేటర్‌ భర్త చెన్నుపాటి గాంధీపై వైసీపీ గూండాలు అకారణంగా హత్యాయత్నం చేసి కన్ను పొడిచేసేశారు. అయితే నిందితులపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బెయిల్‌ వచ్చేందుకు సహకరించిన ఘనుడు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా.

విజయవాడలో టీడీపీకి చెందిన మహిళపై దాడులు చేసిన వ్యక్తులే తిరిగి కేసు పెట్టారు. సౌమ్యుడిగా పేరున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు కృష్ణలంక ఘటనపై అడిగేందుకు ప్రయత్నించగా... కనీసం పోలీసు స్టేషన్‌లోకి కూడా రానివ్వలేదు. అదే వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌కు స్వాగతం పలికి తాను అధికార పక్షం అని రుజువు చేసుకున్నారు.

సీఎం జగన్‌ రెడ్డి కక్షగట్టిన ఒక ప్రైవేటు చిట్టీల వ్యవహారంలో వైసీపీ పెద్దల మెప్పు పొందేందుకు చిట్టీల డీఫాల్టర్‌ను పక్కన కూర్చోబెట్టుకుని క్రాంతి రాణా విలేకరుల సమావేశం నిర్వహించారు.

సంఘానికి అధ్యక్షుడెవరు?

రాష్ట్రంలో అన్ని విభాగాలు, శాఖల్లో నెలకొన్న అనిశ్చితి ఐపీఎస్‌ అధికారుల్లోనూ కనిపిస్తోంది. క్రాంతి రాణా అత్యుత్సాహం తర్వాత ఐపీఎస్‌ అధికారుల్లో దీనిపై చర్చ మొదలైంది. ‘ఇంతకూ మనకు అసోసియేషన్‌ ఉందా? ఉంటే అధ్యక్షుడు ఎవరు?’ అంటూ ఐపీఎస్‌ అధికారులు ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆరా తీశారు. ఏపీలో ఐపీఎస్‌ అధికారుల సంఘం కార్యవర్గం రెండున్నరేళ్ల క్రితం వరకూ ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు అధ్యక్షుడిగా, అడిషనల్‌ డీజీ ఆర్‌కే మీనా కార్యదర్శిగా ఉండగా, క్రాంతి రాణా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. అయితే 2022 ఫిబ్రవరిలో తన కన్నా జూనియర్‌ అయిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు దక్కించుకున్నాక అసోసియేషన్‌ అఽధ్యక్షుడిగా తాను ఉండడం సరికాదని తిరుమలరావు తప్పుకొన్నట్లు తెలిసింది. ఐపీఎ్‌సలు సమావేశం ఏర్పాటు చేసుకుని మరో కమిటీని ఎన్నుకోవాలి. కానీ అదేదీ జరగలేదు. అసోసియేషన్‌ సెక్రటరీ కూడా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ క్రాంతి రాణా అసోసియేషన్‌లో కనీసం చర్చించకుండా అధికార పార్టీకి వత్తాసు పలికే కొందరు ఐపీఎస్‌ పెద్దల సూచన మేరకు ప్రతిపక్షాలు, పత్రికలపై ఏకపక్షంగా ఎలా ఫిర్యాదులు చేస్తారనే చర్చ ఐపీఎ్‌సలలో జరుగుతోంది. బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి ఏపీలో ఐపీఎ్‌సలపై 360 డిగ్రీల నివేదిక తెప్పించుకున్నాక తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం.

‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు

అధికార పార్టీకి అనుకూల వ్యక్తిగా పేరున్న క్రాంతి రాణా ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గత నెల 26న ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఆ లేఖ వారం తర్వాత బయటికి వచ్చింది. అందులో పేర్కొన్న 22 మంది అధికారులపై చేసిన ఆరోపణలను ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’పై సారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు, ప్రజారక్షణ కోసం అహోరాత్రులు శ్రమించే వారిపై కొన్ని పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నామంటూ.. ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ పేరుతో ఉన్న ఒక లెటర్‌ హెడ్‌పై ప్రకటన విడుదల చేశారు. అంతటితో ఆగకుండా తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి స్వామి భక్తి చాటుకున్న ఐపీఎ్‌సలకు వంత పాడారు.

Updated Date - Apr 08 , 2024 | 04:33 AM