Share News

ఆ ఐపీఎస్‌ ‘బంగారం’

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:44 AM

స్పీ సార్‌కు సెండాఫ్‌ ఉంది.. ఆఫీసర్లు క్రాస్‌ బెల్ట్‌ వేసుకుని రావాలి..’ అంటూ సెట్లో చెప్పిన గొంతులే సెల్‌ ఫోన్లో మరో మాట చెప్పాయి.

ఆ ఐపీఎస్‌ ‘బంగారం’

స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ

బహుమతులతో వీడ్కోలు

పోలీసు శాఖలో చర్చ..

కూపీలాగుతున్న ఏసీబీ’

అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘ఎస్పీ సార్‌కు సెండాఫ్‌ ఉంది.. ఆఫీసర్లు క్రాస్‌ బెల్ట్‌ వేసుకుని రావాలి..’ అంటూ సెట్లో చెప్పిన గొంతులే సెల్‌ ఫోన్లో మరో మాట చెప్పాయి. ‘సార్‌కు బంగారమంటే ఇష్టం.. ఏదో ఒక గిఫ్టు తీసుకురండి’ అనడంతో ఆ జిల్లాలోని పోలీసు అధికారులు కొందరు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే ఆయన తీసుకునే బహుమతుల్లో బోన్సాయ్‌ మొక్కలు తప్ప ఇంకేవీ ఉండవంటూ ఆ జిల్లాలో ఫొటోలతోసహా ప్రచారం బాగా జరిగింది. కానీ బదిలీ అయ్యి వేళ్లే సమయంలో మాత్రం బంగారు కానుకలు తీసుకుంటారని చెప్పడంతో తప్పక తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇటీవల పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన ఎస్పీ ఒకరికి వారం రోజుల తర్వాత జిల్లా కేంద్రంలో సిబ్బంది వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన కోరి మరీ దీనిని ఏర్పాటు చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ జిల్లాలోని పోలీసు అధికారులందరూ ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, మెడలో చైను లాంటివి తీసుకెళ్లాల్సి వచ్చింది. తమ పాత బాస్‌కు బంగారు బహుమతులిచ్చిన కొందరు పోలీసులు... ఆయనతో ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో ఇతర సోషల్‌ మీడియాలో పోస్టు చేసుకున్నారు. గమనించిన ఇతర జిల్లాల్లోని బ్యాచ్‌మెట్లు... ఇదేంటి ఇంత చిన్న గిఫ్ట్‌ ఇచ్చారని అడగ్గా అందులో బంగారు ఆభరణం ఉందంటూ బదులిచ్చారు. ఇంత ఖరీదైనవి వెళ్లిపోయే ఆయనకు ఇచ్చారా.? అంటూ ఆరా తీయగా, ‘అందులో ఎక్కువ బహుమతులు స్మగ్లింగ్‌లో పట్టుబడినవే. ఇక్కడికి అవి ఎలా వస్తాయో సార్‌కు తెలుసు.. అందుకేనేమో ఆయనకు బంగారు బహుమతులు తీసుకురమ్మంటూ ఫోన్లో ప్రత్యేకంగా చెప్పా’రంటూ బదులిచ్చారు. ఆ నోటా.. ఈ నోటా చేరి అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఈ సమాచారం చేరింది. ఉన్నతాధికారికి తెలియడంతో ‘ఇదేమి ప్రాక్టిస్‌.. ఎంక్వైరీ చేయండి’ అన్నట్లు సమాచారం. ఆ ఎస్పీ పనితీరుపై ఆ ఉన్నతాధికారి ఏ మాత్రం సంతృప్తికరంగా లేరనే చర్చ కూడా పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో బహుమతుల వ్యవహారం ఎటు దారి తీస్తుందో అన్న ఆసక్తి పోలీసు వర్గాల్లో కనిపిస్తోంది.

కలెక్టరు బంగళాలో చోరీ

పుట్టపర్తి రూరల్‌, ఫిబ్రవరి 12: శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరు అరుణ్‌బాబు క్యాంపు కార్యాలయంలో సోమవారం చోరీ జరిగింది. కలెక్టర్‌ లేని సమయంలో బంగళాలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విలువైన అభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కలెక్టర్‌ ఆదేశించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. చోరీ వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

Updated Date - Feb 13 , 2024 | 02:44 AM