Share News

ట్యాబ్‌ల్లో ‘టెన్త్‌’ మూల్యాంకనం

ABN , Publish Date - May 30 , 2024 | 01:57 AM

బైజూస్‌ పాఠ్యాంశాల బోధన కోసం ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌లను మూల్యాంకనానికి ఉపయోగించుకోవాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

ట్యాబ్‌ల్లో ‘టెన్త్‌’ మూల్యాంకనం

సప్లిమెంటరీ గణితం పేపర్లకు వర్తింపు

వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టులకూ...

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): బైజూస్‌ పాఠ్యాంశాల బోధన కోసం ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌లను మూల్యాంకనానికి ఉపయోగించుకోవాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో గణితం పేపరుకు ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టులకూ ఇదే విధానం అమలు చేయనున్నారు. ఈ ఏడాది దాదాపు 50వేల మంది విద్యార్థులు గణితం సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఈ పేపర్లు దిద్దే టీచర్లు మూల్యాంకనం కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. రెండేళ్ల కిందట వారికిచ్చిన ట్యాబ్‌లోనే లాగిన్‌ అవ్వాలని, ప్రభుత్వ పరీక్షల విభాగం కేటాయించిన పేపర్లు చూసి వాటికి పక్కనే ఉన్న టేబుల్‌లో మార్కులు వేయాలని సూచిస్తోంది. మొదట ఒక టీచర్‌ పేపరును దిద్దిన తర్వాత దాన్ని రెండో టీచర్‌ పరిశీలిస్తారు. వారిద్దరి మధ్య మార్కుల్లో 10శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం వస్తే మళ్లీ మూడో టీచర్‌ దానిని దిద్దుతారు. ఈ విధంగా మూడంచెల విధానంలో మూల్యాంకనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు సంబంధించిన 24 పేజీల గణితం పరీక్ష బుక్‌లెట్లను ప్రస్తుతం స్కానింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఒక్కో టీచర్‌కు గరిష్ఠంగా 75 పేపర్లు ఇవ్వనున్నారు.

Updated Date - May 30 , 2024 | 08:05 AM