మళ్లీ టెండర్లా.. నామినేషన్‌పైనా?
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:17 AM
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్ నిర్మాణ బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు.

కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ బాధ్యతెవరికి?
అనుభవం లేని ‘మేఘా’కు అప్పగిస్తారా?
తిరిగి జర్మన్ బావర్‌నే తీసుకొస్తారా?
రేపు సీఎం సమీక్షలో స్పష్టత వచ్చే చాన్సు!
నిపుణుల నివేదిక 5న అందే అవకాశం
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్ నిర్మాణ బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. మళ్లీ టెండర్లు పిలుస్తారా.. ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్‌కే నామినేషన్ విధానంలో అప్పగిస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రూ.990 కోట్లతో కొత్త వాల్ నిర్మించాలని కేంద్ర జలసంఘం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దెబ్బతిన్న వాల్‌కు మరమ్మతు చేయడం కంటే కొత్తది కట్టడమే ఉత్తమమని జలసంఘం చైర్మన్ కుశ్వీందర్ వోహ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల్లో సీపేజీలను అధ్యయనం చేసేందుకు వచ్చిన అమెరికా, కెనడా నిపుణులతోనూ ఇదే చెప్పారు. వారు ఈ నెలాఖరులోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఇద్దరు అమెరికాలో, ఇంకో ఇద్దరు కెనడాలో ఉంటుండంతో ఆన్‌లైన్‌లో ఒకే సమయంలో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు వీలు కావడంలేదని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెల 5న ప్రాథమిక నివేదికను అందజేస్తారని జల సంఘానికి సమాచారం అందినట్లు తెలిపాయి. ఈ నివేదికలో ప్రధానంగా కాఫర్ డ్యామ్‌ల సీపేజీ నివారణకు, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, పాత వాల్‌కు ఎంత దూరంలో నిర్మించాలో స్పష్టత ఇస్తారని పేర్కొన్నాయి. గతంలో డయాఫ్రం వాల్‌ను నిర్మించినప్పుడు..
అప్పటి పోలవరం నిర్మాణ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ తమకు అనుభవం లేదని తెలిపింది. దీంతో ఈ వాల్ నిర్మాణంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన జర్మనీకి చెందిన ‘బావర్’ సంస్థను ఎంపిక చేసి.. దానితో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు ఏడాదిన్నర కాలంలోనే బావర్ ఈ వాల్‌ను రూ.460 కోట్లతో నిర్మించింది. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో జరిగాయని కేంద్ర జల సంఘం, ఇతర సంస్థలు సర్టిఫికెట్ ఇచ్చాయి. 2020లో 23 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. వాల్ పూర్తిగా దెబ్బతినకుండా నిలిచింది. వాస్తవానికి ఇప్పటి వాల్‌కు అక్కడక్కడా కొన్ని మరమ్మతులు చేస్తే సరిపోతుందని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు. వోహ్రా మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవడం కంటే కొత్తది నిర్మించడమే శ్రేయస్కరమని అన్నారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ కూడా కొత్త వాల్ నిర్మాణానికే మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో దీని నిర్మాణం, డిజైన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను.. ఆ శాఖ కార్యదర్శి దేబర్షి, వోహ్రాలను రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కోరారు. అలాగే దీనికి కొత్తగా టెండర్లు పిలవాలా.. లేక అనుభవం లేని మేఘాకే నామినేషన్‌పై అప్పగించాలా అనే విషయంలోనూ స్పష్టత కోరారు. ఇప్పటివరకు అటు నుంచి స్పందన లేదు. సోమవారం (29న) ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంపై సమీక్ష జరుపనున్నారు. ఆ సందర్భంగా స్పష్టత వచ్చే వీలుందని అంటున్నారు.