Share News

తెలుగు విద్యార్థుల ‘జై’ఈఈ!

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:53 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.

తెలుగు విద్యార్థుల ‘జై’ఈఈ!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల సత్తా

టాప్‌టెన్‌లో 3 ర్యాంకులు తెలంగాణకే

మరో ర్యాంకు ఏపీ విద్యార్థి కైవసం

తొలి 100 ర్యాంకుల్లో 26 తెలుగు రాష్ట్రాలకే

16 మంది తెలంగాణ.. 10 మంది ఏపీ నుంచి

సత్తా చాటిన కర్నూలు విద్యార్థులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు. వీరిలో 16 మంది తెలంగాణ నుంచే ఉంటే.. మిగతా 10 మంది ఏపీకి చెందినవారున్నారు. ఆల్‌ ఇండియా టాప్‌-10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు తెలంగాణ, ఒక ర్యాంకు ఏపీ విద్యార్థికి దక్కాయి. హైదరాబాద్‌ విద్యార్థి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సందేశ్‌ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, పుట్టి కుశాల్‌కుమార్‌ ఐదోర్యాంకు, ఎస్‌ఎ్‌సడీబీ సిద్థ్విక్‌ సుహాస్‌ పదో ర్యాంకుతో మెరిశారు. అదేవిధంగా ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన కొండూరు తేజేశ్వర్‌ 331/360 మార్కులు సాధించి 8వ ర్యాంకు సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ఐఐటీ మద్రాస్‌ ఆదివారం విడుదల చేసింది.

రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థులు హర్షవర్ధన్‌కు 42వ ర్యాంకు, కె. శివనారాయణకు 51వ ర్యాంకు, ప్రణతికి 345వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యధికంగా అబ్బాయిలు హాజరుకాగా, ఉత్తీర్ణులైన వారిలోనూ వారే ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జాతీయ స్థాయిలో 1,86,584 మంది రిజిస్ర్టేషన్‌ను చేసుకోగా, 1,80,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 48,248 మంది అర్హత పొందారు. అబ్బాయిలు 1,43,637 మంది రిజిస్ర్టేషన్‌ చేసుకోగా, 40,284 మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 42,947 మంది దరఖాస్తు చేసుకుంటే, 7,964 మంది క్వాలిపై అయ్యారు.

ఐఏఎస్‌ లక్ష్యం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన ఉమ్మడి కర్నూలు జిల్లా గోస్పాడు మండల కేంద్రానికి చెందిన బి.సందేశ్‌కు 338/360 మార్కులు వచ్చాయి. 99.99 పర్సంటైల్‌ సాధించారు. గోస్పాడు మండలం నెహ్రునగర్‌కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బొగ్గులపల్లె రామసుబ్బారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమారుడు సందేశ్‌ పాఠశాల దశ నుంచే ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు, ఇంటర్మీడియెట్‌లో 957 మార్కులు సాధించారు. సందేశ్‌ మాట్లాడుతూ.. సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావడం తన ఆశయమని తెలిపారు.

కేటగిరీల వారీగా

ఈ ఏడాది జనరల్‌ కేటగిరీ విద్యార్థులు 14 వేల మంది క్వాలిఫై కాగా, ఎస్సీ కేటగిరీ విద్యార్థులు 13వేల మంది క్వాలిఫై అయ్యారు. ఓబీసీ విద్యార్థులు 9వేల మంది క్వాలిఫై అయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్‌ను జూన్‌ 10 నుంచి జులై 23 వరకు నిర్వహించనున్నారు.

మెరిసిన తెలంగాణ

తెలంగాణకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఈసారి జేఈఈలో మెరిశారు. సుచిత్రకు చెందిన గంగా శ్రేయా్‌సకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు, గచ్చిబౌలి విద్యార్థి ప్రీతం భాటియాకు 32వ ర్యాంకు, హర్షిణికి 72వ ర్యాంకు, సిద్దిపేటకు చెందిన లక్ష్మి నరసింహారెడ్డికి 76 ర్యాంకు, శ్రేయాస్‌ హోహన్‌ కల్లూరి 92వ ర్యాంకు, నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్‌ రాహుల్‌కు 207వ ర్యాంకు, ఎన్‌ హరిచక్రవర్తి 483వ ర్యాంకు, మిర్యాలగూడకు చెందిన కుంచం శివకు 211వ ర్యాంకు, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జే వెంకటేశ్‌కు 293వ ర్యాంకు సాధించారు. ఇదిలావుంటే, ఆల్‌ ఇండియా టాప్‌-10లో ఐఐటీ మద్రాస్‌ జోన్‌ నుంచి నలుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులున్నారు. తెలంగాణ విద్యార్థిని శ్రీనిత్య దేవరాజ్‌ మద్రాస్‌ జోన్‌ నుంచి మహిళల్లో టాపర్‌గా నిలిచారు. శ్రీనిత్య ఆలిండియా ఓపెన్‌ కోటాలో 268 ర్యాంకును సాధించారు.

సీఎ్‌సఈలో చేరతా!

కర్నూలు నగరానికి చెందిన కొండూరు తేజేశ్వర్‌ 331/360 మార్కులు సాధించి 8వ ర్యాంకు సాధించారు. తేజేశ్వర్‌ తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. తండ్రి శేఖర్‌ ఆస్పరి మండలం చిన్నహుల్తిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా, కృష్ణవేణి జూపాడుబంగ్లా మండలం తంగడంచలో పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్నారు. తేజేశ్వర్‌ పదో తరగతిలో 570 మార్కులు, ఇంటర్‌లో 981 మార్కులు సాధించారు. జేఈఈలో 331 మార్కులతో 99.918 పర్సంటైల్‌ను సాధించారు. తేజేశ్వర్‌ మాట్లాడుతూ.. ఐఐటీ ముంబై విద్యా సంస్థలో సీఎ్‌సఈలో చేరాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 03:53 AM