Share News

భీమిలి వైసీపీ సభకు పంపిన బస్సులెన్నో చెప్పండి: వర్ల

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:41 AM

ఈ నెల 27న భీమునిపట్నం వైసీపీ సభకు సరఫరా చేసిన బస్సుల వివరాలివ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఏపీఎ్‌సఆర్‌టీసీ ఎండీకి లేఖ రాశారు.

భీమిలి వైసీపీ సభకు పంపిన బస్సులెన్నో చెప్పండి: వర్ల

ఈ నెల 27న భీమునిపట్నం వైసీపీ సభకు సరఫరా చేసిన బస్సుల వివరాలివ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఏపీఎ్‌సఆర్‌టీసీ ఎండీకి లేఖ రాశారు. ‘చెల్లింపులు చేయించుకుని అన్ని రాజకీయ పార్టీలకూ బస్సులను సరఫరా చేయడం అనేది గతంలో ఏపీఎ్‌సఆర్‌టీసీకి ఆనవాయితీగా ఉంది. అయితే ఇటీవల ఆర్‌టీసీ కేవలం వైసీపీకి మాత్రమే బస్సులు సరఫరా చేసి టీడీపీకి నిరాకరిస్తోంది. ఈ నెల 27న భీమిలీలో వైసీపీ నిర్వహించిన రాజకీయ సభకు భారీ సంఖ్యలో బస్సులు సరఫరా చేశారు. ఎన్ని బస్సులు సరఫరా చేశారు? అందుకోసం ఆ పార్టీ ఎంత చెల్లించింది? ఆ పార్టీకి చెందిన ఎవరు ఈ చెల్లింపులు చేశారు? వైసీపీకి సరఫరా చేసిన విధంగా టీడీపీకి ఎందుకు బస్సులు సరఫరా చేయలేదు? వివరాలు చెప్పండి’ అని లేఖలో కోరారు.

పోలీసుల వేధింపులను ఆపండి

‘డీజీపీ గారూ... మీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. పల్నాడు జిల్లా వెల్దుర్తిలో వైసీపీలో చేరమని పోలీసులు టీడీపీకి చెందిన మత్స్యకారుడ్ని కొడితే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మీరొస్తుంటే గంటలకొద్దీ ట్రాఫిక్‌ ఆపడం కాదు... పోలీసుల వేధింపులు ఆపండి, అమాయకులను కాపాడండి’ అని వర్ల ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.

వైసీపీకి కౌంట్‌డౌన్‌: ఆనంద్‌బాబు

మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ... ‘వైసీపీకి కౌంట్‌డౌన్‌... సిద్ధం అంటూ జగన్‌ ప్రకటనలు ఓ వైపు, మేం సిద్ధంగా లేం అంటూ టికెట్లు తిరస్కరించి ఎంపీలు, ఎమ్మెల్యేల పరార్‌ మరో వైపు. దీన్నే ఓటమికి సిద్ధం అంటాడు వైఎస్‌ జగన్‌’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 30 , 2024 | 02:42 AM