Share News

నేడు తెలంగాణ సీఎం రేవంత్‌ విశాఖ రాక

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:23 AM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే ధ్యేయంగా ‘సేవ్‌ విశాఖ- సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌’ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

నేడు తెలంగాణ సీఎం రేవంత్‌ విశాఖ రాక

‘సేవ్‌ విశాఖ-సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌’ నినాదంతో కాంగ్రెస్‌ బహిరంగ సభ

అమరావతి, విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే ధ్యేయంగా ‘సేవ్‌ విశాఖ- సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌’ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని తృష్ణా మైదానంలో జరిగే ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అధ్యక్షతన జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మాణిక్కం ఠాగూర్‌, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతోపాటు పలువురు నాయకులు హాజరు కానున్నారు. సుమారు 70 వేల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. కాగా, రాష్ట్ర విభజన హామీలలో అత్యంత ప్రధానమైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, రామాయపట్నం ఓడరేవు నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తామని ప్రకటించింది. ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా ఎన్నికల అజెండాలో చేర్చింది. అదేవిధంగా నవరత్నాలలో ఒక్కటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలని, ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఏఐసీసీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ మద్దతు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం విశాఖలో జరిగే బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని వెల్లడిస్తారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సంబంధించి పార్టీ తరఫున డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని, మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశముందని నేతలు పేర్కొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 08:27 AM