అడ్డగోలు బదిలీలకు బ్రేక్
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:09 AM
వైసీపీ పాలనలో ఐదేళ్లు బడిని మర్చిపోయారు. తాము ఉపాధ్యాయులమన్న సంగతి మర్చిపోయారు. వైసీపీ ప్రభుత్వాన్ని భుజాన మోశారు. పైరవీలతో పబ్బం గడుపుకున్నారు. ఎన్నికలు సమీపించగానే అధికార పార్టీ నాయకుల అండతో, రూ.లక్షలు వెచ్చించి అడ్డగోలుగా బదిలీలు చేయించుకున్నారు.

వైసీపీని మోసిన టీచర్లకు షాక్
ఎన్నికలకు ముందు దొడ్డిదారి బదిలీలు
ఫిర్యాదు చేసిన జేఏసీ, కూటమి పెద్దలు
స్పందించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
అనంతపురం విద్య, జూన 6: వైసీపీ పాలనలో ఐదేళ్లు బడిని మర్చిపోయారు. తాము ఉపాధ్యాయులమన్న సంగతి మర్చిపోయారు. వైసీపీ ప్రభుత్వాన్ని భుజాన మోశారు. పైరవీలతో పబ్బం గడుపుకున్నారు. ఎన్నికలు సమీపించగానే అధికార పార్టీ నాయకుల అండతో, రూ.లక్షలు వెచ్చించి అడ్డగోలుగా బదిలీలు చేయించుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉన్న పలు పాఠశాలలకు పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఎన్నికలు పూర్తవ్వగానే ఆగమేఘాల మీద బడిలో వాలిపోదామని అనుకున్నారు. కానీ అధికారం చేతులు మారింది. కోడ్ అమలులో ఉండటం, పోలింగ్, కౌంటింగ్‌కు మధ్య చాలా రోజుల వ్యవధి ఉండటంతో కొందరు సంఘాల నాయకులు, ఉపాధ్యాయుల ఎత్తులు పారలేదు. అడ్డగోలు బదిలీలను ఆపేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది.
అడ్డగోలుగా బదిలీలు
జిల్లాలో 49 వరకూ అడ్డగోలు ఆర్డర్లు తెచ్చుకున్నట్లు సమాచారం. వైసీపీ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను పట్టుకుని చాలా మంది పైరవీలు చేశారు. అనంతపురం, రూరల్ మండలం, బుక్కరాయముద్రం, ఇతర సమీప మండలాల్లోని పలు స్కూళ్లకు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఎస్‌జీటీలు 11 మంది, స్కూల్ అసిస్టెంట్లు 30 మంది, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ముగ్గురు, పీఈటీలు ముగ్గురు, గ్రేడ్ -2 హెచఎంలు ఇద్దరు ఇలా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొందరు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ముడుపులు కట్టారని తెలిసింది. తాము వైసీపీకి వీరవిధేయులమని, వైఎ్‌సఆర్‌టీఏ నాయకులమని చెప్పుకుని.. వైసీపీ పెద్దలను పట్టుకుని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిపై అప్పట్లో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది.
జగనపై భక్తి
అడ్డగోలుగా ఆర్డర్లు అందుకున్న నాయకులు కొందరు వైసీపీ కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. డిన్నర్ రాజకీయాలు నడిపారు. పగలు ఉపాధ్యాయులుగా.. సాయంత్రం పార్టీ నాయకులుగా ద్విపాత్రాభినయం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టింది. అయినా ఆ పార్టీకి విధేయులుగా సంఘాల నాయకులు రాజకీయం నెరపడం పట్ల ఉపాధ్యాయులు విమర్శలు గుప్పించారు. వైసీపీ కోసం ఎన్నికల రాజకీయాలు చేసినవారిలో వైఎ్‌సఆర్‌టీఏ నాయకులతోపాటు కొందరు ఏపీటీఎఫ్ నాయకులు కూడా ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న సగటు ఉపాధ్యాయులను వదిలేసి.. జగనకు మళ్లీ ఓటు వేయాలని ప్రచారం చేయడం ఏమిటని అప్పట్లోనే మండిపడ్డారు.
ఉత్తర్వుల నిలిపివేత
బదిలీలపై బ్యాన ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని కొందరు అడ్డగోలుగా బదిలీల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమౌతాయి. అడ్డగోలు బదిలీలు తెచ్చుకున్నవారు వెంటనే స్కూళ్లలో చేరి సుఖంగా గడుపుదామని అనుకున్నారు. కానీ వారి అక్రమాలను పసిగట్టి, సిఫార్సు బదిలీలపై విద్యాశాఖకు పలువురు ఫిర్యాదులు చేశారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వ పెద్దలు, జేఏసీ నాయకులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్పందించారు. బదిలీ ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ ఉత్తుర్వులు డీఈఓలకు గురువారం చేరాయి.