Share News

పత్తికొండలో టీడీపీ విజయం

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:21 AM

మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పలితాల కౌంటింగ్‌ మంగళవారం ముగిసింది.

పత్తికొండలో టీడీపీ విజయం
కేఈ శ్యాంబాబును స‌న్మానిస్తున్న టీడీపీ నాయ‌కులు

పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు 14,211 ఓట్లతో గెలుపు

పత్తికొండ, జూన్‌ 4 : మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పలితాల కౌంటింగ్‌ మంగళవారం ముగిసింది. పత్తికొండ అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు 14,211 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవిపై విజయం సాధించారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామలక్ష్మి ఆధ్వర్యంలో ఓట్లలెక్కింపు కార్యక్రమం ఉదయం 8గంటలకు ప్రారంభించారు. ముందుగా పోస్టల్‌బ్యాలెట్‌ లెక్కించి అరగంటతర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు. పోస్టల్‌బ్యాలెట్‌తో కలుపుకుని 19రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు 98,849 ఓట్లుపోలవ్వగా, సమీపప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవికి 84,638 ఓట్లుపోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు 14,211 ఓట్లఆధిక్యంతో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి రామలక్ష్మి ప్రకటించారు. గెలుపు ప్రకటన అనంతరం తల్లిదండ్రులు కేఈ క్రిష్ణమూర్తి, పద్మావతిలకు పాదాబివందనంచేసి ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు కేఈ శ్యాంబాబు కౌంటింగ్‌కేంద్రానికి చేరుకున్నారు.

మధ్యలోనే వెళ్లిపోయిన వైసీపీ అభ్యర్థి

ఓట్లలెక్కింపులో మొదటి రౌండ్‌ తర్వాత టీడీపీ ఆధిక్యత పెరుగుతూ పోవడంతో కౌంటింగ్‌ హాల్‌లో ఉన్న వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Jun 05 , 2024 | 12:21 AM