Share News

సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా!

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:44 AM

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థులపై కసరత్తు పెంచింది. సంక్రాంతి సమయానికి 20-25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది.

సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా!

20-25 స్థానాల్లో పేర్ల ప్రకటన.. ఐవీఆర్‌ఎస్‌ విధానంలో సర్వే

ప్రజాభిప్రాయం సహా రెండు మార్గాల్లో కసరత్తు

కొద్ది మంది తప్ప అంతా పాతకాపులకే సీట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థులపై కసరత్తు పెంచింది. సంక్రాంతి సమయానికి 20-25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలేవీ ఉండబోవని, ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్‌, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు వంటి వారి పేర్లు తొలిజాబితాలో ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి ఉండేలా ఈ జాబితా కూర్పు ఉండబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ అంతర్గత కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై ఆ పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్‌ఎస్‌ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో ఫోన్‌ సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. క్షేత్ర స్ధాయి సర్వే కూడా చేయిస్తున్నారు. పండుగకు ముందు లేదా తర్వాత జాబితా విడుదల అయ్యే అవకాశముంది. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో మలి జాబితాలు వెలువడతాయని సమాచారం. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ‘రా.. కదలిరా’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో 22 అసెంబ్లీ స్ధానాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. టీడీపీ టికెట్లు ఎవరికి లభించబోతున్నాయో ఈ సభల ద్వారా సంకేతాలు అందుతున్నాయి. బుధవారం వరకు చంద్రబాబు ఆరు రా..కదలిరా సభల్లో పాల్గొన్నారు. వీటిలో కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావల దేవదత్‌, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్య ఇన్‌చార్జులుగా ఉన్నారు. వీరిలో దేవదత్‌ విషయంలో కొంత ఊగిసలాటలో ఉన్నా చివరకు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వెంకటగిరిలో ఇన్‌చార్జిగా కురుగుండ్ల రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ టికెట్లు లభించబోతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సభలు ఇక్కడే

రాబోయే రోజుల్లో చంద్రబాబు పాల్గొనే రా.. కదలిరా సభలు జరగనున్న వాటిలో గుడివాడకు వెనిగళ్ల రామ్మోహన్‌, గంగాధర నెల్లూరుకు డాక్టర్‌ థామస్‌, కమలాపురం నియోజకవర్గానికి పుత్తా నరసింహారెడ్డి, అరకుకు దన్ను దొర, మండపేటకు వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరుకు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, ఉరవకొండకు పయ్యావుల కేశవ్‌, కోవూరుకు పోలంరెడ్డి దినేశ్‌ రెడ్డి, పత్తికొండకు కేఈ శ్యాంబాబు, గోపాలపురం నియోజకవర్గానికి మద్దిపాటి వెంకటరాజు, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, మాడుగులకు పీవీజీ కుమార్‌, టెక్కలికి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉంగుటూరుకు గన్ని వీరాంజనేయులు, చీరాలకు కొండయ్య యాదవ్‌ ఇన్‌చార్జులుగా ఉన్నారు. వీటిలో గోపాలపురంలో వెంకటరాజును ఆ నియోజకవర్గంలో ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. చీరాలలో కొండయ్య యాదవ్‌ విషయంలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మాడుగుల సీటు విషయంలో కుమార్‌కు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావు నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ మూడు సీట్లలో అధినేత నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Jan 11 , 2024 | 03:44 AM