వాహన స్కామ్‌పై విజి‘లెన్స్’
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:05 AM
రాష్ట్రంలోని దళిత యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో కార్లు, ఈ-ఆటోల కొనుగోలు కోసం ఆరేళ్ల క్రితం నాటి టీడీపీ ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించింది.

కార్లు, ఈ-ఆటోల కొనుగోలుకు రూ.వందల కోట్లు ఖర్చు
వాహన డీలర్లతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కు
రూ.93.98 కోట్లు స్వాహా చేసి దళిత యువతకు ద్రోహం
జగన్ భజన చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారే కీలక లబ్ధిదారు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని దళిత యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో కార్లు, ఈ-ఆటోల కొనుగోలు కోసం ఆరేళ్ల క్రితం నాటి టీడీపీ ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించింది. అయితే వాహన డీలర్లతో కుమ్మక్కైన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రూ.93.98 కోట్లు స్వాహా చేశారు. గత ప్రభుత్వంలో జగన్ భజన చేస్తూ, దళిత జనోద్ధారకుడిగా రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి అని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణకు వైసీపీ ప్రభుత్వంలో ఓ మంత్రి ప్రయత్నం చేసినా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు చేసి అక్షింతలు వేయడంతో కిక్కురుమనలేదు. దళితుల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఇటీవల ఢిల్లీ నుంచి లేఖ రావడంతో కూటమి ప్రభుత్వం ఈ బాగోతంపై దృష్టి సారించింది. ఈ-ఆటోలు, కార్ల స్కామ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది. గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అమలులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ-ఆటోలు కొనుగోలు చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అందుకోసం ఎస్సీ యువతకు ఈ-ఆటోలు పంపిణీ చేసి వాటిని చెత్త తరలించేందుకు వినియోగించేందుకు సిద్ధమైంది. అందుకోసం 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి జాతీయ సఫా యీ కర్మచారీ ఆర్థిక అభివృద్ధి సంస్థ, జాతీయ ఎస్సీ ఆర్థిక అభివృద్ధి సంస్థ నుంచి నిధులు తీసుకుంది. అప్పట్లో ఈ-ఆటోల సరఫరాకు పుణెకి చెందిన కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ ఆథరైజేషన్‌తో తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ ఒప్పందం చేసుకుంది. సరఫరాదారుల తరపున ఆథరైజ్డ్ డీలర్ అనిల్‌కుమార్‌రెడ్డి 7,500 పవర్ ఆటోలు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుని రూ.77.91 కోట్లు అడ్వాన్స్‌గా పొందారు. అయితే ఆయన రూ.57.98 కోట్ల విలువైన 2,550 వాహనాలు మాత్రమే సరఫరా చేసి, మరో 4,950 వాహనాలు ఇవ్వలేదు. అడ్వాన్స్‌లో రూ.19.93 కోట్లు ఆయన వద్దనే ఉండగానే ఈగల్ అగ్రి ఎక్వి్‌పమెంట్, కావలి పేరుతో 280 మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మెషిన్లు సరఫరా చేస్తామని మరో రూ.23.72 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. అందులోనూ రూ.14.27 కోట్లు విలువైన 209 మెషిన్లు సరఫరా చేసి, మరో 71 మెషిన్లు ఇవ్వకపోగా, రూ.9.45 కోట్లు తిరిగి చెల్లించలేదు. ఇదే కంపెనీ 660 ట్రాక్టర్లు సరఫరా చేస్తామని రూ.38.87 కోట్లు అడ్వాన్స్ తీసుకుని, రూ.26.56 కోట్లు ఖరీదైన 451 ట్రాక్టర్లు మాత్రమే సరఫరా చేసింది. తిరిగి చెల్లించాల్సిన రూ.12.31 కోట్లు డీలర్ వద్దనే ఉన్నాయి. మొత్తం మీద అనిల్‌కుమార్ రెడ్డి వద్దే రూ.41.69 కోట్లు ఆగిపోయాయి. ఈ మొత్తం తిరిగి చెల్లించాలంటూ వైసీపీ హయాంలో ఓ మంత్రి ఆదేశంతో ఎస్సీ కార్పొరేషన్ నోటీసు ఇచ్చింది. వెంటనే వైసీపీ పెద్దల నుంచి ఫోన్లు రావడంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎంట్రాన్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మెషిన్లు సరఫరా చేస్తామని రూ.3.52 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని 6 మెషిన్లు మాత్రమే సరఫరా చేసింది. తీసుకున్న అడ్వాన్స్‌లో రూ.2.93 కోట్లు ఇప్పటికీ ఆ కంపెనీ ఖాతాలోనే ఉంది.
మరో డీలర్ రూ.49 కోట్లకు టోపీ
దళిత యువతకు కార్ల సరఫరా పేరుతో మరో డీలర్ ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.49కోట్లకు టోపీ పెట్టారు. విజయవాడకు చెందిన రాధా మాధవ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,061 ఇన్నోవాలు, 588 ఇతియోస్ కార్లు సరఫరా చేస్తామని రూ.221.64 కోట్లు అడ్వాన్స్ తీసుకుంది. అయితే రూ.172.28 కోట్ల విలువైన 1,230 వాహనాలే సరఫరా చేసింది. వాహనాలు తీసుకోవడంలో కార్పొరేషన్ జాప్యం చేసినందున 2018 నాటి ఒప్పందం ప్రకారం 2021లో ఇవ్వలేమని, పెరిగిన ధరల ప్రకారం తీసుకునేందుకు అంగీకరిస్తే పరిశీలిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. అయితే ఎస్సీ కార్పొరేషన్ నోటీసులిచ్చేలోపు వారి డీలర్‌షి్‌పను టోయోటా రద్దు చేసింది. అప్పటి సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తి ఆయనకు ఎన్నికల్లో మేలు చేసేందుకు రాజకీయ పార్టీని ప్రారంభించి, గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వల్లే ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.93.98 కోట్లు గండిపడినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్‌లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వంలో అయినా... డీలర్ల నుంచి వైసీపీ ప్రభుత్వం సొమ్ము వసూలు చేయలేకపోవడానికి ఆ డీలర్ సదరు అధికారికి బినామీ కావడమేనని కారణమని తెలుస్తోంది. డీలర్‌కు నోటీస్ ఇచ్చినప్పుడల్లా జగన్ పేషీ నుంచి ఫోన్ రావడంతో మంత్రులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉండేదని విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేలింది.