Share News

టీడీపీ, జనసేన పొత్తు ప్రజల కోరిక: రఘురామ

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:20 AM

టీడీపీ, జనసేన మధ్య పొత్తును ప్రజలు కోరుకున్నారని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆదివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ఆయన మీడియాతో

టీడీపీ, జనసేన పొత్తు ప్రజల కోరిక: రఘురామ

న్యూఢిల్లీ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన మధ్య పొత్తును ప్రజలు కోరుకున్నారని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆదివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఎంత ఖాయమో, జగన్మోహన్‌రెడ్డి దారుణంగా ఓడిపోవడం కూడా అంతే ఖాయమన్నారు. ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలని జగన్‌ పత్రిక చేయని ప్రయత్నమంటూ లేదని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వల్ల ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన నష్టమేమీ లేదని, పాలకపక్షానికే పెద్ద బొక్క అని అభివర్ణించారు. షర్మిల టకటకా నిజాలు చెబుతుంటే, జగన్మోహన్‌ రెడ్డి భయపడి అమ్మ ఒడిని ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్‌ రెడ్డి సింహమో కాదో తెలియదు కానీ, షర్మిల మాత్రం శివంగేనన్నారు. ఈ మూర్ఖులు మాట్లాడే మాటలకు ఆమె బెదిరిపోతుందా? అని ప్రశ్నించారు. ‘జగన్‌ ఇప్పుడు ఎన్ని టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించినా ప్రయోజనం సున్నా. మనసు చంపుకొని మీ తల్లి మీతో వచ్చినా, భయపెడితేనే వచ్చినట్లుగానే ప్రజలు భావిస్తారు. మీ పట్ల ఆమెకు ఏమీ మమకారం లేదని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. నెల రోజుల క్రితం టీడీపీ, జనేసన కూటమి ఓటింగ్‌ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండగా, వైసీపీ ఓటింగ్‌ క్షీణించి, కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌ పెరిగింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావలసి వస్తుంది’ అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 02:20 AM