Share News

ధరలపై చర్చకు టీడీపీ పట్టు

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:20 AM

నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని టీడీపీ ఇచ్చిన వాయుదా తీర్మానం శాసనసభలో గందరగోళానికి దారితీసింది.

ధరలపై చర్చకు టీడీపీ పట్టు

స్పీకర్‌ పోడియం వద్దకెళ్లి ఎమ్మెల్యేల నినాదాలు.. సస్పెన్షన్‌

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని టీడీపీ ఇచ్చిన వాయుదా తీర్మానం శాసనసభలో గందరగోళానికి దారితీసింది. పెరుగుతున్న ధరలపై చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టగా, సభాపతి తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. అచ్చెన్నాయుడు మినహా అందరూ స్పీకర్‌ పోడియంపైకి వెళ్లి నినాదాలు చేశారు. ధరల పెరుగుదలపై ప్లకార్డులు ప్రదర్శించారు. కాగితాలు చించి పైకి విసిరేశారు. ఈ గందరగోళం మధ్యే న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించారు. దీంతో సభను స్పీకర్‌ టీ విరామం కోసం వాయిదా వేశారు. వాయిదా అనంతరం కూడా టీడీపీ ఎమ్మెల్యేల నిరసన కొనసాగింది. ఈసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విజిల్స్‌ తీసుకొచ్చి ఊదారు. దీనిపై కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయగా ‘మీకు సీటు ఉందో లేదో చూసుకోండి’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. చివరకు స్పీకర్‌ పోడియం బల్లపై పెద్దగా చరచడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయినా వారంతా స్పీకర్‌ పోడియం మెట్లపై కూర్చోవడంతో మార్షల్స్‌ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. బయటకు వెళ్తూ ‘స్పీకర్‌ గారూ మీకు సీటు ఉందా?’ అని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. వారు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... పేపర్లు చించి విసరడం స్పీకర్‌ను అవమానించడమేనని అన్నారు. అలా రెచ్చగొట్టడం మర్యాద కాదని.. ‘రెచ్చగొడుతున్నారు జాగ్రత్త’ అని వ్యాఖ్యానించారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని, స్పీకర్‌ పోడియం వద్ద గేలి చేయడం సరికాదని టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా పోడియం వద్ద స్పీకర్‌ వినియోగించే బెల్‌ను వెలగపూడి మూడుసార్లుకొట్టడంతో తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై అసెంబ్లీలో చర్చ చేపడితే తన బాగోతం బయటపడుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి తమను సస్పెండ్‌ చేయించారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, సీఎం చెప్పిందే వేదం అన్నట్లు సభను నడుపుతున్నారని ఆరోపించారు. సభ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత టీడీపీ సీనియర్‌ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రతిపక్షం గొంతు ప్రభుత్వం నొక్కేస్తోంది. జగన్‌ 4 ఏళ్ల 10 నెలల పాలనలో టీడీపీ సభ్యులు అసెంబ్లీలో మాట్లాడటానికి ఎన్ని నిమిషాలు అవకాశమిచ్చారో స్పీకర్‌ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... జగన్‌ పాలనలో ప్రజలు ఏమీ కొనేట్టు, తినేట్టు లేదన్నారు.

ధరల పెరుగుదలపై టీడీపీ ప్రదర్శన

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం నిరసన తెలిపారు. టీడీపీ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ప్రదర్శనగా తరలివచ్చారు. బైబై జగన్‌అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ధరలు, పన్నులు, చార్జీల భారంతో సామాన్యుడు విలవిల.. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపు, ప్రజలపై చెత్త పన్ను అని ప్లకార్డులు ప్రదర్శించారు.

గంటా రాజీనామా ఆమోదం: విశాఖపట్నం నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్లు సభలో స్పీకర్‌ ప్రకటించారు.

Updated Date - Feb 07 , 2024 | 08:51 AM