Central Cabinet TDP : కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ..
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:31 AM
కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరనుంది. నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా పదవీప్రమాణం చేయనున్నారు.

నేటి ఎన్డీయే ఎంపీల భేటీ కోసం ఢిల్లీ పయనం
మళ్లీ 9న మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు
12న చంద్రబాబు ప్రమాణానికి మోదీ రాక
హాజరు కానున్న ఎన్డీయే ముఖ్యమంత్రులూ..
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరనుంది. నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా పదవీప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఎన్డీయేలోని వివిధ భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. లోక్‌సభలో విశ్వాస పరీక్ష నెగ్గాక కేబినెట్ విస్తరణ జరుగుతుందని.. ఆ సందర్భంగా ఇంకొందరికి మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. కేబినెట్‌లో టీడీపీ చేరుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారమే ఢిల్లీలో వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్ పదవి ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నా.. ఆ పదవిని తామే ఉంచుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్పీకర్ పదవిని మరొకరికి ఇవ్వరాదని ఆ పార్టీ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే బెర్తులు, శాఖలపై ఇంకా పై స్థాయిలో చర్చలేవీ జరుగలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీయే ఎంపీల సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరుగనుంది. ఆ సందర్భంగా వారు మోదీని తమ కూటమి పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటారు. తర్వాత ఎన్డీయే అగ్ర నేతలు, ఎంపీలంతా కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఆమె పిలుపు అందగానే ఆదివారం సాయంత్రం మోదీ, కొందరు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తారు. కాగా.. ఎన్డీయే ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత రాత్రికి అమరావతికి తిరిగి వస్తారు. శనివారం ఇక్కడే ఉండి పాలనా వ్యవహారాల్లో పాల్గొంటారు.
ఆదివారం మళ్లీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు రాత్రికి అమరావతి వచ్చేస్తారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న సమయంలో మంత్రివర్గ కూర్పుపై ఆయన బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఫోన్లలో కొంత చర్చ జరుగుతున్నా ముఖాముఖి చర్చల్లో దీనిపై స్పష్టత రావచ్చని అంటున్నారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లాలని ఆయన మొదట అనుకున్నారు. తర్వాత మనసు మార్చుకుని గురువారం రాత్రే బయల్దేరారు. అక్కడ ఏవైనా మాట్లాడాలంటే సమయం చాలినంత ఉంటుందన్న ఉద్దేశంతో ముందే వెళ్లారు. ఢిల్లీ అశోకా రోడ్డులో రామ్మోహన్‌నాయుడికి కేటాయించిన క్వార్టర్‌లో ఆయన బస చేస్తున్నారు.
బాబు ప్రమాణ స్వీకారానికి మోదీ
ఏపీ సీఎంగా 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. టీడీపీ వర్గాలు దీనిని ధ్రువీకరించాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేయగా.. ఆయన అంగీకరించారు. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని గురువారమిక్కడ తనను కలిసిన డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయే పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కానున్నారు. వారికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. 12న ఉదయం 11 గంటలకు అటూఇటూగా ప్రమాణ స్వీకారం నిర్వహించాలని టీడీపీ వర్గాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి స్థలాన్వేషణ జరుగుతోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకడ్రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది.