Share News

ఉద్ధరిస్తే.. 5 లక్షల మంది ఎందుకు తగ్గారు

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:05 AM

తన హయాంలో విద్యారంగాన్ని ఎంతో ఉద్ధరించానని చెబుతున్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అదే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్‌ చేసింది.

ఉద్ధరిస్తే.. 5 లక్షల మంది ఎందుకు తగ్గారు

జగన్‌ సమాధానం చెప్పాలి: పీతల సుజాత

అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): తన హయాంలో విద్యారంగాన్ని ఎంతో ఉద్ధరించానని చెబుతున్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అదే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. జగన్‌ పనికిమాలిన ప్రయోగాలతో పేద ప్రజానీకం ప్రభుత్వ పాఠశాలలకు దూరం అయ్యారని, లక్షల సంఖ్యలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి మాన్పించారని ఆ పార్టీ విమర్శించింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పీతల సుజాత శనివారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ ప్రభుత్వం జీవో 117 తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారు ఉండే ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసి వాటిని వేరేచోటకు తరలించింది. దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించే అవకాశం లేక తల్లిదండ్రులు పిల్లలను మానిపించారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పిన జగన్‌ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. దీనితో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం 94 ఉంటే జగన్‌ హయాంలో అది 70- 75ుకి పడిపోయింది. దానికి కారణం ఏమిటో జగన్‌ మాట్లాడరు. ఉపాధ్యాయులకు చదువు తప్ప ఇతరత్రా అనేక పనులు అప్పగించారు. చివరకు మద్యం షాపుల వద్ద వారిని కాపలా పెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కింది’ అని సుజాత విమర్శించారు.

Updated Date - Dec 22 , 2024 | 03:05 AM