మా ఊళ్లో చిచ్చుపెట్టొద్దు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:24 PM
ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలోకి వచ్చి రాజకీయ చిచ్చు పెట్టవద్దని మాజీ ఎంపీ తలారి రంగయ్యను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కుందుర్పి మండలం మలయనూరులో గత నెల 8న పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి.

తలారి రంగయ్యను
అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
కుందుర్పి, జూలై 8: ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలోకి వచ్చి రాజకీయ చిచ్చు పెట్టవద్దని మాజీ ఎంపీ తలారి రంగయ్యను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కుందుర్పి మండలం మలయనూరులో గత నెల 8న పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. ఆ సమయంలో ఎలాంటి దాడి జరగకపోయినా.. అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త లక్ష్మీకాంత ఉద్దేశ పూర్వకంగా దాడి జరిగిందని పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశాడని వారు అన్నారు. లక్ష్మీకాంతను పరామర్శించేందుకు పార్టీ నియోజకవర్గ ఇనచార్జి తలారి రంగయ్య సోమవారం సాయంత్రం గ్రామానికి వచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, గ్రామస్థులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తలారి రంగయ్య గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలారి రంగయ్యను వెనక్కి పంపేందుకు ప్రయత్నం చేశారు. ఆయన వెనుదిరిగి వెళ్లకపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు ఆయనను బలవంతంగా వెనక్కు పంపారు. తమను అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గీయులు ఆరోపించారు.