పూలూ పండ్లూ తీసుకోండి జగన్
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:22 AM
ప్రభుత్వం మారడంతో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని రైతాంగం ఆనందం వ్యక్తం చేసింది.

ఓడిపోయి మాకు న్యాయం చేశారు
జగన్ ఇంటికి అమరావతి రైతులు
అమరావతి(ఆంధ్రజ్యోతి), తుళ్లూరు, జూన్ 6: ప్రభుత్వం మారడంతో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని రైతాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ ఈ విధంగా తమకు న్యాయం చేశాడంటూ అభినందించేందుకు అమరావతి ప్రాంత రైతులు గురువారం తాడేపల్లి ప్యాలె్‌సకు వచ్చారు. వీరిలో పలువురు మహిళా రైతులు కూడా ఉన్నారు. తమ వెంట అరటి, మామిడి పండ్లు, మిఠాయిలు, పూల బొకేలు తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని జగన్‌కు భద్రతా సిబ్బంది ద్వారా కబురు పంపారు. అయితే తనను కలిసేందుకు రైతులకు జగన్ అనుమతి ఇవ్వలేదు. అయినా, మహిళా రైతులు చాలా సేపు వేచి చూశారు.
ఒక్కసారి చూడనివ్వండయ్యా..
‘అయ్యా. ఆయనను ఒక్కసారి చూడనివ్వండి. సీఎంగా ఉన్నప్పుడు ఎటూ ముఖం చూపించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ముఖం చూపించండి’ అంటూ మహిళలు పోలీసులను అభ్యర్థించారు. రాజధాని రైతుల బాధలు పట్టించుకోకుండా పరదాల మాటున అసెంబ్లీకి జగన్ వెళ్లే వారని, మీ సమస్య ఏమిటి అని అడిగిన పాపాన పోలేదని వారంతా వాపోయారు. కనీసం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ముఖం చూపించి మాట్లాడతారేమోనని వచ్చామన్నారు. అయినా, పోలీసులు అనుమతించకపోవటంతో వారు నిరాశతో వెనుదిరిగారు.