Share News

జగన్‌పై చర్యలు తీసుకోండి!

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:00 AM

టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా దూషిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

జగన్‌పై చర్యలు తీసుకోండి!

సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపైనా..

సీఈవోకు టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా ఫిర్యాదు

అమరావతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా దూషిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీని, చంద్రబాబును అసభ్యకరంగా జగన్‌ దూషిస్తున్నారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమరావతి సచివాలయంలో శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ప్రభుత్వ గెస్ట్‌హౌ్‌సలో సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణిపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆ వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన సతీమణి ఝాన్సీ ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌లో ఎందుకు మీటింగ్‌ పెట్టారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ సమావేశంలో ప్రభుత్వ వాహనాలు వాడారని, వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరామన్నారు. అలాగే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై పెట్టిన కేసుల వివరాలివ్వాలని అడిగామన్నారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా ఇచ్చిన లేఖ ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన లేఖ కాదని చెప్పారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు, కార్యదర్శి లేఖ ఇవ్వాలని, కార్యవర్గ సభ్యుడు కాంతిరాణా లేఖ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయన జగన్‌, సజ్జలకు వ్యక్తిగతంగా కావాల్సిన వ్యక్తి అని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులపై రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి కేసులున్నాయో ఈ నెల 10వ తేదీలోపు తెలపాలని డీజీపీని కోరామన్నారు. చంద్రబాబుపై ఏమేమి కేసులున్నాయో తెలపాలని 10 రోజుల క్రితమే అభ్యర్థిస్తే 13 జిల్లాల నుంచి మాత్రమే సమాచారం వచ్చిందని, మరో 13 జిల్లాల నుంచి ఇంకా వివరాలు అందలేదని తెలిపారు. మాజీ సీఎంపై ఉన్న కేసుల వివరాలు తెలపడానికే ఇన్ని రోజులు పడితే, ఇక మిగిలిన అభ్యర్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామన్నారు. దేవినేని ఉమ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కొంతమంది అక్రమార్కులు జగన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

Updated Date - Apr 07 , 2024 | 03:00 AM