Share News

పిన్నెల్లి వినతిపై నేటిలోగా నిర్ణయం తీసుకోండి

ABN , Publish Date - May 31 , 2024 | 03:37 AM

మాచర్ల నియోజకవర్గం పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ్‌ త్రిపాఠి, పల్పాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌,

పిన్నెల్లి వినతిపై నేటిలోగా నిర్ణయం తీసుకోండి

  • ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): మాచర్ల నియోజకవర్గం పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ్‌ త్రిపాఠి, పల్పాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌, కారంపూడి సీఐ నారాయణస్వామిని తప్పించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ సత్తిసుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. నియోజకవర్గం పరిధిలో అధికార విధులకు ఆ ముగ్గురినీ దూరంగా ఉంచాలని, ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల దర్యాప్తు నుంచి ఐజీని, సీఐని తప్పించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. పిటిషన్‌ను న్యాయస్థానం లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఐజీ త్రిపాఠి, సీఐ నారాయణస్వామి దర్యాప్తు చేస్తే పిటిషనర్‌కు న్యాయం జరగదని తెలిపారు. ఓ సామాజికవర్గానికి చెందిన సీఐ నారాయణస్వామి ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. జూన్‌ 4వరకు వారిని అధికార విధుల నుంచి తప్పించాలన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.

Updated Date - May 31 , 2024 | 08:06 AM