Share News

తాడోపేడో!

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:03 AM

పంచాయతీల నిధులను జగన్‌ ప్రభుత్వం కైంకర్యం చేయడమే కాకుండా.. సర్పంచ్‌లకున్న విధులను కూడా కొత్తగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలకు కట్టబెట్టేసి గ్రామస్వరాజ్య స్ఫూర్తినే దెబ్బతీశారు!. నిధులు,

తాడోపేడో!

సర్కార్‌పై ‘స్థానిక’ నేతల పోరుబాట

పంచాయతీల నిధులను జగన్‌ ప్రభుత్వం కైంకర్యం చేయడమే కాకుండా.. సర్పంచ్‌లకున్న విధులను కూడా కొత్తగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలకు కట్టబెట్టేసి గ్రామస్వరాజ్య స్ఫూర్తినే దెబ్బతీశారు!. నిధులు, విధులు లేక సర్పంచ్‌లతోపాటు.. ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు వంటి స్థానిక సంస్థల ప్రతినిధులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. ఆఖరికి వలంటీర్ల సూచనలతో సంతకం పెట్టే స్థితి రావడంతో.. ఇక ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవడానికి... వైసీపీ సహా పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రతినిధులతా సమాయత్తమయ్యారు. ఈమేరకు బుధవారం(నేడు) రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. విధులు, నిధులు సాధించుకోవడం ద్వారా తిరిగి గ్రామస్వరాజ్య స్ఫూర్తిని నిలుపుకోవడమే లక్ష్యంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించడం విశేషం!.

మలిదశ పోరాటానికి సమాయత్తం

జగన్‌ పాలనలో కుప్పకూలిన పంచాయతీలు

గ్రామ పాలన మొత్తం ప్రభుత్వం హైజాక్‌

నిధులు దారిమళ్లించడంతో స్థానిక సంస్థల నిర్వీర్యం

నిస్సహాయ స్థితిలో సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్లు

వైసీపీ సర్కారును నిలదీయాలని నిర్ణయం

ఆఖరి దశలోనైనా డిమాండ్ల సాధనకు ఆరాటం

సర్కారు దిగిరాకుంటే ఎన్నికల్లో దెబ్బతీయాలని కంకణం

నేడు రాష్ట్ర సదస్సు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల నేతలు పోరుబాట పట్టారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు నిర్వీర్యమవడంపై మండిపడుతున్నారు. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లతో పాటు అన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్‌లు వివిధ దశల్లో పోరాటాలు చేయగా.. ఇక నుంచి వారితోపాటు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొని జగన్‌ను నిలదీయాలని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించాలని కంకణం కట్టుకున్నారు!. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రాష్ట్రస్థాయి పంచాయతీరాజ్‌ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రతిపక్షనేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును ఆహ్వానించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సమస్యలను ప్రస్తావించి వాటిని సాధించుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

కేంద్ర నిధులు దారిమళ్లింపు

చంద్రబాబు సర్కార్‌ దిగిపోయిన తర్వాత పంచాయతీలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం పైసా విదల్చకపోయినా.. కేంద్రం నుంచి వస్తున్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకే తెలియకుండా దారిమళ్లించేసింది. 2018 ఆగస్టు 1 నుంచి ఏప్రిల్‌ 2 2021 వరకు పంచాయతీల ఎన్నికలు జరగకపోవడంతో సర్పంచ్‌లు అధికారంలో లేరు. ఆ తర్వాత 2021లో ఎన్నికలు జరిగి నూతన సర్పంచ్‌లు ఏప్రిల్‌ 2, 2021న పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతన సర్పంచ్‌లు వచ్చిన తర్వాత కూడా పంచాయతీ సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం పంపించామంటున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర సర్కార్‌ మాయం చేసింది. సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనందున 2018-2021 మధ్య కాలంలో నిధులు విడుదల చేయలేదని, అందుకే ఈ మూడు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని అప్పట్లో అందరూ భావించారు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నతో పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి.. రూ.7659 కోట్లు రాష్ట్రానికి విడుదల చేశామని జవాబివ్వడంతో అసలు విషయం వెల్లడైంది. ఈ సర్పంచ్‌లు వచ్చిన కొత్తలో రూ.345 కోట్లు ఓ సారి, రూ.969కోట్లు మరోసారి, మళ్లీ రూ.800కోట్లు ఇలా.. సర్పంచ్‌లకు తెలియకుండా విద్యుత్‌ చార్జీల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని, దారి మళ్లించి సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపించారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్‌ లాగేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయగా, సర్పంచ్‌లు ఢిల్లీ వెళ్లి తిరిగి సాధించుకున్నారు. ఆ నిధులను కూడా విద్యుత్‌ చార్జీల పేరుతో మళ్లీ సర్కార్‌ లాక్కొంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ఒక్క రంగంలోనూ అభివృద్ధి జరగలేదు.

ఉనికి కోల్పోయిన స్థానిక ప్రజాప్రతినిధులు

గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి పల్లెలను ఉద్ధరిస్తామన్న సీఎం జగన్‌ పంచాయతీలను అడ్రస్సు లేకుండా చేసి గ్రామ స్వరాజ్య స్ఫూర్తినే దెబ్బతీశారు. పంచాయతీ కార్యాలయాలను సచివాలయాలుగా మార్చి సర్పంచ్‌లు, వార్డ్‌ సభ్యులను బయటకు తరిమేశారు. సర్పంచ్‌లు.. వలంటీర్‌ల సూచనలతో సంతకాలు పెట్టే నామమాత్రపు వ్యక్తిగా మారిపోయారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలు పూర్తిగా విస్మరించారు. తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో నిధులు మాయం కావడం, పంచాయతీల్లో చేపట్టిన చిన్నపాటి పనులకు సైతం నెలల తరబడి బిల్లుల కోసం నిరీక్షించడం పరిపాటిగా మారడంపై సర్పంచ్‌లు, ఇతర స్థానిక సంస్థల నేతలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. ఇదే పరిస్థితి ఎంపీపీ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లకు ఏర్పడింది. ప్రభుత్వమే విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో మండలాలు, జిల్లా పరిషత్‌లు ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది.

దత్తతనూ దూరం చేసిన జగన్‌

గ్రామాల్లో జన్మించి ఉద్యోగ, వ్యాపారపరంగా విదేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలకు జన్మభూమికి సేవ చేసే అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాసింది. గతంలో గ్రామ సీమలు దత్తపుత్రికలుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రభుత్వం 2015 జనవరిలో శ్రీకారం చుట్టింది. సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన తరహాలో రాష్ట్రంలో ప్రతి ఊరు, వార్డును కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ఎన్‌ఆర్‌ఐలు ఎవరో ఒకరు దత్తత తీసుకునేలా ప్రోత్సాహం కల్పించింది. పలువురు ప్రముఖులు గ్రామసీమలను, పట్టణాల్లో వార్డ్‌లను ఎంపిక చేసుకుని ఆర్థిక సహాయం అందించి పాఠశాలలు, శ్మశానాలు, తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, ఆటస్థలాలు, ప్రార్థనా మందిరాల అభివృద్ధి కోసం ఇతోధికంగా సాయం అందించారు. ప్రభుత్వం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్‌ వార్డ్‌-స్మార్ట్‌ విలేజ్‌ పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో కనెక్ట్‌ ఆంధ్రా అని కొత్త విభాగాన్ని తీసుకొచ్చినా.. ఈ సంస్థ కాన్సెప్ట్‌ ఒక్క ఎన్‌ఆర్‌ఐలో కూడా స్ఫూర్తి కల్పించలేకపోయింది. ఎన్‌ఆర్‌ఐలు, దత్తత తీసుకునే ప్రముఖులు నిధులిస్తే.. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని కనెక్ట్‌ ఆంధ్రా పథకం అధికారులు చెప్తుండటంతో ప్రముఖులు మొహం చాటేశారు.

ఉపాధి చట్టానికి విరుద్ధంగా పనులు

గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామాలకు ఒక పెద్ద వనరు. దేశ వ్యాప్తంగా ఈ పథకం గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం కాంట్రాక్టు సిబ్బంది ఆధ్వర్యంలో చేపడుతున్నారు. గ్రామంలో ఏ పనులు చేపట్టాలని నిర్ధారించే అధికారం గ్రామ సర్పంచ్‌లకు లేకుండా చేశారు. ఈ పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సర్పంచ్‌ కంటే పవర్‌పుల్‌గా గ్రామాల్లో పెత్తనం చలాయిస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించినట్లు చట్టాలు చెప్తున్నా.. రాష్ట్రంలో గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఉనికి మాత్రం లేకుండా పోతోంది.

అసంపూర్తిగానే భవనాల నిర్మాణాలు

వైసీపీ సర్కార్‌ గ్రామ, వార్డ్‌ సచివాలయాల ఏర్పాటు చేసిన వెంటనే సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌, ఆర్బీకే భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. అయితే ఒక్క పైసా కూడా వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్ల పాటు పునాదులు స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత వాటికి సిమెంట్‌ విడుదల చేస్తే వైసీపీ నేతలు, కార్యకర్తలు అమ్ముకున్నారు. ఇప్పుడు వాటి నిర్మాణాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనుల్లో ప్రతి ఏటా నిర్దిష్ట సమయాల్లో పురోగతి లేకపోవడంతో ఏ సంవత్సరం నిధులు ఆ సంవత్సరం మురిగిపోతున్నాయి. పంచాయతీల సర్పంచ్‌లతో సంబంధం లేకుండా వైసీపీ కార్యకర్తలతో పనులు చేయిస్తుండటంతో పనుల్లో జవాబుదారీతనం లోపించింది. దీంతో ఎక్కడపనులు అక్కడ ఆగిపోయాయి. గ్రామ పాలన మొత్తాన్ని ప్రభుత్వం హైజాక్‌ చేయడంతో స్థానికసంస్థల ప్రతినిధులను పట్టించుకున్న వారు లేరు. అందుకే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి.

Updated Date - Jan 03 , 2024 | 03:03 AM